Devotional

అసలు ఓనమ్ ఎందుకు చేసుకుంటారో తెలుసా?

The story behind Onam festival celebrations

కేరళలో జరుపుకొనే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో ఓనమ్‌ కూడా ఒకటి. రైతులు తాము పండించిన పంట కోతకు రావడంతో అందుకు ఆనందపడుతూ చేసుకునే పండగ ఇది. మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ఎలా చేసుకుంటామో అంతే సందడిగా కేరళలో ఓనమ్‌ చేసుకుంటారు. ఈ పండుగ సందర్భంగా వాళ్లలో ఎంతగా ఆనందం వెల్లువిరిస్తుందో మాటల్లో వర్ణించలేం. సంతోషాల సంబరంగా కేరళవాసులు ఈ పండగను జరుపుకునే తీరు తెన్నులు..
**ప్రాచీన గాథల ప్రకారం, ఓనమ్‌ పండగను మహారాజైన మహాబలి ఆహ్వానించే సంజ్ఞగా జరుపుకుంటారు. భూతరాజు మహాబలి కేరళ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాలంలో ఈ ప్రాంతం వైభవానికి ప్రతీకగా నిలిచింది. ఆ కాలాన్ని కేరళ స్వర్ణయుగంగా భావిస్తారు. అప్పుడు నివసించిన ప్రతి ఒక్కరూ ఆనందంతో బతకడమే కాదు.. ప్రజలు ఎంతో వైభోగమైన జీవితాన్ని గడిపేవారట. ఆ రాజుని ప్రజలందరూ అమితంగా ప్రేమించేవారు, గౌరవించేవారు. మరోగాథలో పాతాళంలోకి వామనుడి అవతారంలో వచ్చిన విష్ణుమూర్తిచే నెట్టివేయబడిన బలిచక్రవర్తి ఒక కోరిక కోరతాడు. విష్ణుమూర్తి ఆ కోరిక మేరకు ప్రతి ఏడాది తన ప్రజలను చూసేందుకు వచ్చేలా వరమిస్తాడు.
**ఇలా అనేక విశ్వాసాలు, నమ్మకాలు ఉన్నాయి. కేరళ ప్రజలు మలయాళం పంచాంగాన్ని (క్యాలెండర్‌) అనుసరిస్తారు. దీనినే ‘కొల్ల వర్షం’ అని కూడా అంటారు. చింగమ్‌ మాసం ఆరంభంలో ఈ పండగను జరుపుకుంటారు. ఈ మాసం మలయాళ క్యాలెండర్‌లో మొదటి మాసం. గ్రోగోరియన్‌ క్యాలెండర్‌ (ప్రపంచవ్యాప్తంగా అనుసరించే క్యాలెండరు) ప్రకారం ఈ పండగని ఆగస్టు – సెప్టెంబర్‌ మధ్యలో జరుపుకుంటారు. ఈసారి ఈ పండగ సెప్టెంబర్‌ 1 – 13 తేదీల మధ్య జరుగుతోంది.
****పంటలు చేతికందే సమయంలో …
ఈ పండగతోనే మలయాళీల నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. పంటలు చేతికందే సమయంలో ఈ పండగను నిర్వహిస్తారు. పండగను ఎంతో వైభవంగా జరుపుకోవాలని ఎంతగానో కృషి చేస్తారు. వారసత్వంగా వచ్చిన గొప్ప సంప్రదాయాలు కలిగిన రాష్ట్రంగా కేరళకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఓనమ్‌ పర్వదినాల్లో ప్రజలు తమ సంప్రదాయాలను సాధ్యమైనంతగా ప్రదర్శిస్తారు. తమ జీవితంలో ఓనం ఒక మధురానుభూతిగా భావిస్తారు. ఈ పండగ సంబరాలు పది రోజులు పాటు కొనసాగుతాయి. దేశవిదేశాల్లో ఉండే కేరళీయులు ఎంతో మంది ఓనమ్‌లో పాలుపంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
(***ఎలా జరుపుకుంటారంటే..
పండగలో మొదటిరోజుని ‘ఆతమ్‌’గా పరిగణిస్తారు. తర్వాత చిత్తిర, చోతి, విశాగం, అనిళ, థ్రికెత్త, మూలం, పూరాడం, ఉత్రాడం అంటూ 10వ రోజు, చివర రోజును ‘తిరు ఓనమ్‌’ అని ఘనంగా జరుపుకుంటారు. ఈ చివరి రోజుని మిగతా రోజులతో పోల్చినప్పుడు ఎంతో ముఖ్యమైన రోజుగా భావిస్తారు. 1961లో ఈ పండగను ‘కేరళ జాతీయ పండగ’గా గుర్తించారు.
***విందులు.. నృత్యాలు
పదిరోజుల పాటు భారీగా జరిగే ఈ సంబరాలు మలయాళీల ఆచారాలను, కళలను ప్రతిబింబిస్తాయి. కొత్త దుస్తులు, సాంప్రదాయ వంటలు, నృత్యము, సంగీతంతో పాటు రాష్ట్రమంతటా పాటించే ఆచారాలు, ఈ వ్యవసాయ పండగకు చిహ్నాలు. అన్నింటికన్నా ఈ పర్వదినాల్లో రకరకాల పూలతో ప్రతి ఇంటి ముంగిళ్లలో రంగవల్లులు తీర్చిదిద్దడం ప్రత్యేకాకర్షణ. ఆ పూల రంగవల్లుల్లో దీపం వెలిగించి ఉంచుతారు. మహిళలు దాని చుట్టూ తిరుగుతూ మహబలిని ఆహ్వానిస్తూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. వీళ్ళు చేసే నృత్యాలలో కైకొట్టి కలై, తుంబి తుల్లల్‌ ముఖ్యమైనవి. పండగ వేళ పురుషులు చొక్కా, లుంగీ (మండు) కడతారు. స్త్రీలు పావడ, రవికె ధరిస్తారు.
***సాంస్కృతిక కేళి
సంప్రదాయ పడవ పందాలు, అలాగే ఆటలు, విలువిద్య పోటీలు, కబడ్డీ, కత్తి యుద్ధాలు వంటి ఇతర క్రీడా పోటీల్లో యువకులు తమ శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శిస్తారు. అంటే యువకులు శారీరక శ్రమ కలిగించే ఆటలు ఆడతారన్నమాట !!
చిన్న, పెద్ద అనే వయోభేదం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహ భరితంగా పాల్గొంటూ పండగ సంరంభంలో మమేకవుతారు. ఈ వేడుకల్లో టపాసులు కాల్చి, ఇంటిని దీపాలతో శోభాయమానంగా అలంకరించడం కనిపిస్తాయి. కళా ప్రదర్శనలు ఎన్ని ఉన్నప్పటికీ ‘కథకళి’ నృత్యానికే అగ్ర తాంబూలం. రామాయణ, మహాభారతాల్లోని కొన్ని ఘట్టాలను విధిగా ప్రదర్శిస్తారు. పురాణాలు, చరిత్రపై పిల్లల్లో తగిన అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని మలయాళీల విశ్వాసం.
**స్నేక్‌ బోట్‌ రేస్‌
ప్రతి ఏడాది ఓనం పండగ సందర్భంగా నిర్వహించే స్నేక్‌ బోట్‌ రేస్‌ కేరళలో ప్రధానాకర్షణ. సుమారు వంద అడుగుల పొడవు ఉండే పడవల్లో దాదాపు 150 మంది యువకులు కూర్చుని, ఉత్సాహ భరితంగా పోటీల్లో పాల్గొంటారు. సుమారు 40 కిలోమీటర్ల వరకూ ఈ పడవలు దూసుకుపోతుంటాయి. పాములా మెలికలు తిరిగే ఈ పడవలు నీటిపై జోరుగా సాగుతుంటే వేలాదిమంది జనం ఉత్కంఠతో వీక్షిస్తారు.
అలెప్పి బోట్‌రేస్‌కి పెట్టింది పేరు. అద్బుతమైన రెగ్గట్టా, ఆరుములా వల్లంకలి (స్నేక్‌ బోట్‌ రేస్‌) అనేది సంప్రదాయబద్ధంగా జరిగే ఇక్కడి బోట్‌ కార్నివాల్‌. ఓనం పండగప్పుడే జరిగే ఈ పోటీలు వీక్షించేందుకు దేశ విదేశాల నుండి పర్యాటకులు తరలివస్తుంటారు. వందలాది మంది వేసే తెడ్లతో పంబానదిని వాయు వేగంతో చీల్చుకుంటూపోతున్న పాము పడవల్ని చూసేందుకు పర్యాటకులు, అక్కడి ప్రజలు ఎనలేని ఆసక్తిని కనబరుస్తుంటారు. గతంలో ఆరముల పార్థసారథి దేవాలయంలో జరిగే తిరువోనసడయ (ఓనమ్‌ విందు) కు అవసరమైన కూరగయాలు, పప్పుల్ని ఈ బోట్లలో ఊరేగింపుగా తీసుకొచ్చేవారట! దానికి గుర్తుగా ఆరుములా వల్లంకలిని నిర్వహిస్తూంటారు.
***పులి వేషాలు.. ఊయలలు
శాస్త్రీయ వాయిద్యపరికరాలను వాయిస్తుండగా, పులి వేషాలు ధరించినవారు ఆ చప్పుళ్లకు నృత్యాలు చేస్తారు. దీనిని కేరళీయులు ‘పులిక్కలి’ అంటారు. త్రిస్సూర్‌లో ఈ వేడుక ఘనంగా నిర్వహిస్తూ ఈ వేషం ధరించినవారికి బహుమతులిస్తారు గ్రామీణ ప్రాంతాలలో యువతీ యువకులు కొత్త దుస్తులు ధరించి, ఓనం పాటలు పాడుతారు. పెద్ద పెద్ద చెట్లకున్న ఎత్తైన కొమ్మలకు తాళ్లతో ఊయల కట్టి, ఊగుతారు. ఓనం పండగ రోజులలో కేరళలోని త్రిక్కకరలోని వామనమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తమ తమ ఇళ్లలో త్రిక్కకర అప్పన్‌ (వామనుడు) విగ్రహాల్ని ప్రతిష్టించి, పూజిస్తారు.కేరళ పర్యాటక సంస్థ, స్థానిక ప్రజలు కలిసి ఓనం పండగ సందర్భంగా రాష్ట్ర రాజధాని దగ్గరలోని కోవళం గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తారు. వీటిలో నాటకాలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళలు, ఆహార శాలలు, చేతివృత్తుల కేంద్రాలు ప్రధాన ఆకర్షణ. ఈ పండగ చివరి రోజున అలంకరించబడిన గజరాజులతో చేసే విన్యాసాలు చూపరుల్ని సైతం అబ్బురపరుస్తాయి.
***సామూహిక విందు భోజనాలు …
చివరి రోజున ‘తిరు ఓనం’ సందర్భంగా పచ్చని అరిటాకులో 20 రకాల వంటకాలతో, పాలు మరియు చక్కెరతో చేసిన పాయాసంతో ‘ఓన సధ్య’ సామూహికంగా స్వీకరిస్తారు. సాంప్రదాయక ఊరగాయలు, అప్పడాలతో పాటు ఇతర సాంప్రదాయ భారతీయ పిండివంటలూ వడ్డిస్తారు. చాపపై కూర్చుని అరటాకులో ఈ పదార్థాలను తినడం ఓనం ప్రత్యేకత.
***ప్రపంచవ్యాప్తంగా..
ఓనమ్‌ పండగను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఈ పండగ సందర్భంలో వచ్చే రోజులను ‘పర్యాటక వారం’ గా ప్రభుత్వం ప్రకటించింది. ఓనమ్‌ పండగ సందర్భంగా ఈ రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది పర్యాటకులు కేరళ రాష్ట్రాన్ని సందర్శించి, పరవశించిపోతారు.
***రేపటివైపు ఆశగా..
ఓనం హిందువుల పండగ అయినప్పటికీ, ఈ పండుగను హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు సమానమైన ఉత్సాహముతో కలిసికట్టుగా జరుపుకుంటున్నారు. మలయాళీయులకు ప్రీతిపాత్రమైన రెండు పండుగల్లో ఒకటి కొత్త సంవత్సరాదిగా పిలుచుకునే ‘విషు’, రెండోది శ్రవణోత్సవంగా పిలవబడే ‘తిరుఓనమ్‌’. పంట కోతకు వచ్చి ఇంటి సిరుల పంట వచ్చే తరుణంలో ఓనమ్‌ వస్తుంది. ఈ ఉత్సవాలకు కేరళ ప్రభుత్వం ఈ సారి నాలుగు రోజులు సెలవు ప్రకటించింది. మొన్నటిదాకా భారీ వర్షాలు, వరదలతో మునిగిన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఓనమ్‌ సందర్భంగా కేరళీయులు… కేరళను వరుసగా రెండో ఏడాది వరదలు ముంచెత్తాయి. ఎంతో మంది ప్రాణాలూ కోల్పోయారు. ఆ బాధలు, కన్నీటి జ్ఞాపకాల్ని తుడిచేసుకుంటూ… రేపటివైపు ఆశగా చూస్తున్న కేరళీయులు… ఓనమ్‌ పండగ ద్వారా… పునరుత్తేజం తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ట్విట్టర్‌లో ఓనమ్‌ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. పడవల పందేలూ పెద్దఎత్తున జరుగుతున్నాయి.