Agriculture

ఇసుక గోమూత్రంతో 30రోజుల్లో సేంద్రియ యూరియా

Organic Urea Using Sand And Cow Urine By Telangana Farmer

రెండేళ్లుగా సేంద్రియ యూరియా తయారు చేసి వాడుకుంటూ చక్కని దిగుబడులు సాధిస్తున్న ఆదర్శ యువ రైతు సోదరుల విజయ సూత్రాలే నేటి నేటి సాగుబడిగా మీ ముందు…

ఆరుగాలం చెమటోడ్చి వ్యవసాయం చేసే రైతులు స్వతహాగా స్వేచ్ఛా జీవులు. అయితే, విత్తనాలు, ఎరువులకు, పురుగుమందులకు పూర్తిగా మార్కెట్‌పైనే ఆధారపడడంతో సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఉత్సాదకాలన్నిటినీ దుకాణాల్లో కొనుక్కొని వాడుకోవడానికి అలవాటు పడిన రైతులు ఆర్థికంగా నష్టపోవడంతోపాటు తమకున్న స్వేచ్ఛను కోల్పోతున్నారు. యూరియా వంటి రసాయనిక ఎరువు బస్తాల కోసం తెలంగాణ జిల్లాల్లో రైతులు రోజుల తరబడి క్యూలలో నిలబడుతూ నానా బాధలు పడుతున్నారు. అయితే, జగిత్యాల జిల్లాలో కొందరు ప్రకృతి వ్యవసాయదారులు మాత్రం తమ స్వేచ్ఛను నిలబెట్టుకుంటున్నారు. తమ పంటలకు అవసరమైన సేంద్రియ యూరియాను ఇసుక, ఆవు మూత్రంతో తామే తయారు చేసుకుంటూ నిశ్చింతగా పంటలు పండించుకుంటున్నారు. అటువంటి ఓ యువ రైతు సోదరుల విజయగాథ ఈ వారం ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం..

♦ దండవేని నరేష్, సురేష్‌ అన్నదమ్ములు, యువకులు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలంలోని అల్లీపూర్‌ వారి స్వగ్రామం. ఐదేళ్లుగా 8 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు సాగుచేస్తున్నారు. పాలేకర్, చౌహాన్‌ క్యు, సీవీఆర్‌ మట్టిసేద్యంపై యూట్యూబ్‌లో వీడియోలు చూసి ప్రకృతి వ్యవసాయం చేపట్టి అభివృద్ధి పథంలో కొనసాగుతున్నారు.
♦ రెండెకరాల్లో 16 రకాల కూరగాయలు, 3 ఎకరాల్లో వరి, మిగతా 3 ఎకరాల్లో చిరుధాన్యాలు, పసుపు తదితర పంటలు పండిస్తున్నారు. రసాయనాలు వాడకుండా తాము పండించిన సేంద్రియ ఉత్పత్తులను జగిత్యాల పట్టణంలో సొంతంగా స్టాల్‌ ఏర్పాటు చేసుకొని మార్కెట్‌ ధరపై 10% అధిక ధరకు స్వయంగా అమ్ముకుంటూ మంచి ఆదాయం పొందుతున్నారు.
♦ నరేష్, సురేష్‌ పంటలకు ఘనజీవామృతం, జీవామృతం, లాక్టిక్‌ యాసిడ్‌ బాక్టీరియా, మట్టి ద్రావణం, చేప అమినోయాసిడ్‌ ద్రావణం, జీవన ఎరువులు వంటి వాటిని పంటల పోషక అవసరాలకు తగినట్లుగా వాడుతూ ఉంటారు. వీటిని స్వయంగా తామే తయారు చేసుకుంటారు. అయితే, రెండేళ్లుగా ఇసుక, ఆవు మూత్రంతో సేంద్రియ యూరియాను కూడా తయారు చేసుకొని పంటలకు వేసుకుంటున్నారు.

30 రోజుల్లో సేంద్రియ యూరియా సిద్ధం
సేంద్రియ యూరియాకు కావాల్సిన ముడి పదార్థాలు.. ఇసుక, నాటు ఆవు మూత్రం. యూరియా తయారీకి నాటు ఆవు మూత్రం శ్రేష్టమని, దీనితోపాటు ఏ పశువు మూత్రమైనా వాడుకోవచ్చని నరేష్, సురేష్‌ చెబుతున్నారు. దగ్గరలో ఉన్న వాగు నుంచి ఇసుకను సేకరించుకోవాలి. అందులో రాళ్లు, రప్పలు లేకుండా జల్లించుకోవాలి. వర్షం, ఎండ పడకుండా కొష్టం/షెడ్‌లో సేంద్రియ యూరియా తయారు చేసుకోవాలి. ఇందుకు 30 రోజులు పడుతుంది. మొదటి 20 రోజులు ఇసుకలో ఆవు మూత్రం రోజూ కలుపుతూ తడిగా ఉంచాలి. తర్వాత 10 రోజులు ఆ ఇసుకకు గాలి తగలకుండా ప్లాస్టిక్‌ షీట్‌లో మూటగట్టి ఉంచాలి.

తయారు చేసే విధానం: ఇసుకను ఒక పెద్ద నల్లని ప్లాస్టిక్‌ కవర్‌పై పోయాలి. 100 కిలోల ఇసుకపై 10–12 లీటర్ల నాటు ఆవు మూత్రాన్ని పోసి, ఇసుక పూర్తిగా తడిసేలా కలగలపాలి. తర్వాత, గాలి చొరబడకుండా కవర్‌ కట్టేయాలి. 19 రోజుల పాటు రోజూ కవర్‌ను విప్పి, ఇసుక తడి ఆరకుండా ఉండేంత ఆవు మూత్రాన్ని చల్లి.. మళ్లీ కవర్‌ను గట్టిగా తాడుతో కట్టి నీడలో ఉంచాలి. 20 రోజులకు ఇసుక యూరియా పసుపు నుంచి నల్లని రంగులోకి మారుతుంది. ఇక సేంద్రియ యూరియా వాడకానికి సిద్ధమైనట్టే.

సేంద్రియ యూరియా తయారీకి మరో పద్ధతి
సేంద్రియ యూరియాను మరింత సులభంగా తయారు చేసుకునే పద్ధతి మరొకటి ఉందని రైతు శాస్త్రవేత్త కొక్కు అశోక్‌కుమార్‌(98661 92761) తెలిపారు. పశువుల చావిడిలో నేలపైన ఇసుక పోసి, అక్కడ పశువులను కట్టేయాలి. అవి పేడ వేస్తాయి, మూత్రం పోస్తాయి కదా. పేడను విడిగా తీసుకొని.. మూత్రంతో తడిసిన ఇసుకను ఏరోజుకారోజు తీసి పక్కన కుప్పగా పోసుకోవాలి. పశువుల మూత్రమే కాదు మనుషుల మూత్రం కూడా సేంద్రియ యూరియా తయారీకి అద్భుతంగా పనిచేస్తుంది. అలా 20 రోజులు చేయాలి. 21వ రోజున ఆ ఇసుకకు గాలి ఆడకుండా ఉండేలా మూటగట్టి 10 రోజుల తర్వాత తీయాలి.

అంతే.. సేంద్రియ యూరియా సిద్ధం!
రసాయనిక యూరియా పంటపై చల్లితే ఎక్కువ తక్కువగా పంటకు అందుతుందని, అది కూడా 20% మాత్రమేనని, మిగతాది వృథా అవుతుందని కొక్కు అశోక్‌కుమార్‌ అన్నారు.
సేంద్రియ యూరియా పంటపై చల్లినప్పుడు సమానంగా, పుష్కలంగా అందుతుందని తెలిపారు. పర్యావరణ కాలుష్యం, నీటి కాలుష్యం దీని వల్ల ఉండదని, మోతాదు ఎక్కువైనా పంటకు నష్టం ఉండదని, చీడపీడల విజృంభించవని అన్నారు. రైతులందరూ సేంద్రియ యూరియాను తయారు చేసుకొని వాడుకుంటే ఆర్థికంగా, పర్యావరణపరంగా, భూసారం పరంగా ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు.

ఎకరానికి 200 కిలోలు
రైతు శాస్త్రవేత్త కొక్కు అశోక్‌కుమార్‌ గత ఖరీఫ్‌కు ముందే జగిత్యాలలో రైతులకు సేంద్రియ యూరియా తయారీపై శిక్షణ ఇచ్చారు. నరేష్, సురేష్‌ కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నారు. వాళ్లు వరి సాగుకు సేంద్రియ యూరియా వాడటం ఇది వరుసగా మూడో సీజన్‌. నాటు వేసిన 20 రోజులకు ఎకరానికి 200 కిలోలు, పొట్ట దశలో మరో 200 కిలోల సేంద్రియ యూరియా చల్లుతున్నారు. 2018 ఖరీఫ్‌లో ఎకరానికి 28 క్వింటాళ్లు, రబీలో 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి పొందారు. రసాయనిక యూరియా కోసం తోటి రైతులు రోజుల తరబడి క్యూలలో నిల్చుంటూ ఉంటే.. ఈ యువ రైతులు మాత్రం.. స్వల్ప ఖర్చుతో ముందే తాము తయారుచేసి పెట్టుకున్న సేంద్రియ యూరియాను సకాలంలో వరి పంటకు అందించడంతోపాటు పొటాషియాన్ని అందించే పొగాకు కషాయం పిచికారీ చేసి నిశ్చింతగా ఉన్నారు.
వర్షం పడని చోట దాచుకుంటే 1–2 రెండేళ్ల వరకు నిల్వ ఉంచుకొని వాడొచ్చని నరేష్‌(96409 63372), సురేష్‌ తెలిపారు. ప్టాస్టిక్‌ కవర్‌కు బదులు సిమెంటు తొట్టెలో సైతం సేంద్రియ యూరియాను సులభంగా, పెద్దమొత్తంలో తయారు చేసుకునే వీలుంది. ఎకరానికి విడతకు 100 నుంచి 200 కిలోలు వేసుకోవచ్చు. రసాయనిక యూరియా వేసిన తర్వాత పంటకు చీడపీడల బెడద ఎక్కువ అవుతుందని, సేంద్రియ యూరియా వల్ల ఆ సమస్య రాలేదన్నారు. సేంద్రియ యూరియాపై భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి లోతైన పరిశోధనలు చేసి ఫలితాలను వెల్లడిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుంది.