Business

వాటి ఆఫర్లు నిషేధించండి

Ban Flipkart Amazon Offers-CIAT Requests Govt

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు పండగల వేళ ప్రకటిస్తున్న భారీ డిస్కౌంట్లను నిషేధించాలని ప్రముఖ వ్యాపార సంఘం కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(సీఏఐటీ) ప్రభుత్వాన్ని కోరింది. ఆ సంస్థలు అందిస్తున్న ఆఫర్ల వల్ల స్థానిక వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. ఇది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలకు పూర్తి విరుద్ధం అని తెలిపారు. ‘‘ఈ-కామర్స్‌ సంస్థలు 10శాతం నుంచి 80శాతం డిస్కౌంట్లు ప్రకటించడం వల్ల విపణిలో వస్తువుల ధరల్లో తీవ్ర అంతరం ఏర్పడుతోంది. నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధం’’ అని కేంద్రానికి రాసిన లేఖలో సీఏఐటీ పేర్కొంది. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకొని ఈ-కామర్స్‌ సంస్థలు ‘ఫెస్టీవ్‌ సీజన్‌ ఆఫర్ల’ పేరిట భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. సెప్టెంబర్‌ 29 నుంచి ఆరురోజుల పాటు ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌బిలియన్‌ డేస్‌’ పేరిట భారీ డిస్కౌంట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. అమెజాన్‌ సైతం ఇదే తరహాలో త్వరలో ‘గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌’ ప్రకటించనుందని సమాచారం.