DailyDose

గోదావరిలో దారుణం. 34మంది మృతి.

గోదావరిలో దారుణం. 34మంది మృతి.

గోదావరిలో ప్రమాదానికి గురైన బోటు (లాంచీ)కు పర్యాటక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాయల్‌ వశిష్ట బోటును ప్రయివేట్‌ వ్యక్తి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోడిగుడ్ల వెంకట రమణ అనే వ్యక్తి ఈ బోటును తిప‍్పుతున్నట్లు చెప్పారు. మరోవైపు బాధితులను రక్షించేందుకు పర్యాటక శాఖ హుటాహుటీన రంగంలోకి దిగింది.

ఇందుకోసం టూరిజం విభాగం నుంచి రెండు బోట్లను సంఘటనా స్థలానికి పంపించారు. అలాగే సహాయక చర్యల కోసం మంత్రి అవంతి …విశాఖ నేవీ అధికారులతో మాట్లాడారు. నేవీ హెలికాఫ్టర్‌తో పాటు అధునాతన బోట్లను ఘటనా స్థలానికి పంపించాలని కోరారు. లాంచీ మునకకు వరద ఉధృతే కారణమని తెలుస్తోంది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో రెండు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. ఉదయభాస్కర్‌, ఝాన్సీరాణి అనే బోట్లు ప్రమాదానికి గురై అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.

అలాగే బోటు ప్రమాదంపై హోంమంత్రి సుచరిత ఆరా తీశారు. సహాయక చర్యలపై డీజీపీ, జిల్లా ఎస్పీతో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గల్లంతు అయినవారి కోసం గాలించి సరక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక పోలవరం ఎమ్మెల్యే బాలరాజు కూడా లాంచీ ప్రమాదంపై జిల్లా కలెక్టర్‌ ముత్యాల రాజుతో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు.

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో పాపికొండలకు విహార యాత్రకు వెళుతున్న పర్యాటక బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 61మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో 27మంది సురక్షితంగా బయటపడగా, పలువురు గల్లంతు అయ్యారు.

వరద ఉద్ధృతితో పరవళ్లు తొక్కుతున్న గోదావరి నదిలో రాయల్ వశిష్ఠ అనే లాంచీ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు తెలంగాణ వాసులు కూడా ఉన్నట్టు తెలిసింది. 22 మంది హైదరాబాదీలు, 14 మంది వరంగల్ కు చెందినవారు కూడా ఈ బోటులో ఉన్నారు. అయితే వరంగల్ కు చెందినవారిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగా, 9 మంది గల్లంతయ్యారు. హైదరాబాద్ వాసుల పరిస్థితి తెలియరాలేదు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ప్రమాదంలో 61 మందితో ప్రయాణిస్తున్న లాంచీ మునిగిపోయింది. ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టు గుర్తించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.