Kids

పిల్లలకు పరాజయం మంచిదని చెప్పండి

Teach your kids that losing is not bad

కష్టం ఎదురైనప్పుడే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటాం. కన్నీరొచ్చినప్పుడే బాధను ఎలా దిగమింగాలో నేర్చుకుంటాం. యుద్ధం వచ్చినప్పుడే పోరాటం అలవడుతుంది. అవమానాలే… అవకాశాలు సృష్టిస్తాయి. వైఫల్యమే… విజయానికి సోపానమవుతుంది. ఇవన్నీ మనకు తెలియడం కాదు… పిల్లలకూ చెప్పినప్పుడే… ఓటమిని సానుకూలంగా తీసుకుంటారు. విజయానికి పునాది ఓటమి అని అర్థంచేసుకుంటారు.
ఆ అబ్బాయికి నిండా పదమూడేళ్లు ఉంటాయో లేదో తెలియదు. తరగతిలో లీడర్‌గా ఎన్నికవలేదని, తన బదులు అమ్మాయి క్లాస్‌ లీడర్‌ అయ్యిందనే అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుల్లో మార్కులు తగ్గడం, ఆటలు పాటల పోటీల్లో ఓడిపోవడం, తోటివారు ఆటపట్టించడం… ఇలాంటివేవీ తట్టుకునే స్థితిలో ఈతరం పిల్లలు లేరనడానికి ఇదో ఉదాహరణ. ఆ అబ్బాయనే కాదు… కొందరు చిన్నారులు ఇలా సున్నిత మనసుతో చిన్నచిన్న విషయాలకే ప్రాణాలు పోగొట్టుకోవడం అడపాదడపా వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటివే తట్టుకోలేకపోతున్నారంటే… పెద్దయ్యాక ఉద్యోగాల్లో స్థిరపడ్డాక ఎదురయ్యే ఒత్తిళ్ల నుంచి అసలు బయటపడలేరు. ఈ పరిస్థితికి కారణం, బాధ్యులు ఎవరంటే… కుటుంబం, వాళ్ల చుట్టూ ఉన్న వాతావరణమే. అసలు వాళ్లకు ఎలాంటి ఒత్తిళ్లు ఎదురవుతాయో చూద్దాం.

అన్నింటికీ పోటీనే…
*బాగా చదవాలి… పేద్ద ఉద్యోగం చేయాలి… ఇల్లు, కారు, ఆస్తులు సంపాదించుకోవాలి… అంటూ పిల్లలకు చిన్నతనం నుంచీ నూరిపోస్తారు తల్లిదండ్రులు. పిల్లలు ఓ వైపు మంచి మార్కులు తెచ్చుకుంటున్నా ఇంకా బాగా చదవాలి అంటూ ఒత్తిడి తెస్తారు. తరగతిలో ఓ నలభైమంది ఉంటే.. ఒకరిద్దరికి మాత్రమే ఫస్ట్‌ వస్తుందనీ, వారిలో తమ పిల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చనే కోణంలో ఎప్పుడూ ఆలోచించరు. ఇక, మరోవర్గం తల్లిదండ్రులు ఉంటారు. తమ పిల్లలకు పెద్దగా మార్కులు రావని తెలిసినా… ‘చదువు, చదువు’ అంటూ విపరీతంగా ఒత్తిడి తెస్తారు. వాళ్లకు పుస్తకాలు తప్ప మరే ప్రపంచం లేకుండా చేస్తారు.
*ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలకు‘అన్నింట్లో గెలవాలి.. అన్నీ సాధించాలి’ అనే నేర్పిస్తున్నారు. అక్కడే సమస్య ఎదురవుతుంది. ఏ మాత్రం వైఫల్యం ఎదురైనా వాళ్ల జీవితం దుర్భరమవుతుందనే భయంతో అవసరానికి, వయసుకు మించి కష్టపడతారు. ఆ ప్రభావంతో చిన్న వైఫల్యాన్నీ తట్టుకోలేని స్థితిలో ఉంటారు.
*చాలామంది పెద్దవాళ్లు చేసే మరో పొరపాటు తమ చిన్నారుల్ని ఇతరులతో పోల్చడం. ‘వాళ్లు చూడు ఎన్ని సాధిస్తున్నారో.. నువ్వేం చేయలేకపోతున్నావు.. నీకు సిగ్గుగా అనిపించడంలేదా…’ అని అవకాశం వచ్చినప్పుడల్లా అంటూంటారు.
*ఓ పోటీకి వెళ్తున్నా, ఓ పరీక్ష రాస్తున్నా… ఫస్ట్‌ రావాలి అని అంటారు. పెద్దవాళ్ల దృష్టిలో అది దీవెన కావొచ్చు కానీ… ఆ మాటలు పిల్లలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతాయని ఆలోచించరు.
*‘చదువుల్లో తక్కువ మార్కులు.. ఆటల్లో రాణించలేవు… నీ వల్ల నేను చుట్టాల్లో, బయటా తలెత్తుకోలేకపోతున్నా…’ అని అవమానపరిచే పెద్దవాళ్లూ ఉంటారు. అక్కడితో ఆగిపోకుండా… అవకాశం వచ్చినప్పుడల్లా నలుగురిలో కించపరిచినట్లు మాట్లాడతారు. వీటన్నింటితో పిల్లలు మానసికంగా కుంగిపోతారు.

ఏం చేయాలి మరి…
పెద్దవాళ్ల ఆలోచనావిధానంలో మార్పు రావడమే కీలకం. సానుకూల దృక్పథంతో పిల్లల్ని పెంచాలే తప్ప… వాళ్లపై ఒత్తిడి తెస్తూ కాదు. అది ఎలాగంటే…
*విజయంతోపాటు వైఫల్యమూ జీవితంలో ఓ భాగమని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. ఒకసారి కాదు, మరోసారి ఓడిపోయినా ఏమీ కాదని పిల్లలు తెలుసుకోవాలంటే… తల్లిదండ్రులూ ఆ కోణంలో ఆలోచించగలగాలి. పిల్లలు పెరిగేకొద్దీ ఏ అంశాల్లో రాణిస్తున్నారు… వాళ్ల ఆసక్తులు, అనాసక్తులు తెలుసుకోవాలి. భవిష్యత్తుకు పునాది కేవలం చదువుతోనే సాధ్యం అనే ధోరణి వదిలేయాలి. మరెన్నో అంశాలు ఉన్నాయని వాళ్లకు వివరించాలి.
*సినీ ప్రముఖులు, పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు చెప్పే మాట ‘నాకు ఇతరులతో పోటీ లేదు. నాకు నేనే పోటీ. ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరుచుకుంటా…’ అనే. పిల్లలకు ఈ దృక్పథాన్ని అలవాటు చేయాలి. ఇతరులతో పోలిక, పోటీ ఎందుకసలు. వాళ్లకు వాళ్లే పోటీగా మారాలి. త్రైమాసిక పరీక్షల్లో నలభైశాతం వస్తే.. తరువాతి పరీక్షల్లో అరవైశాతం తెచ్చుకునేలా చూడాలి. ఒకేసారి వందశాతం అంటే పిల్లలు సాధించలేక ఒత్తిడికి గురవుతారు.
*పరాజయం అనేది ఎదుగుదలలో ఓ భాగం. విజయానికి పునాది అనేది పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఉదాహరణకు ఆటలపోటీలో ఫస్టు రాలేదా… ఓడిపోయావు అని అనడం కన్నా… పాల్గొనడంలో చొరవ చూపావు. ఎక్కడ పొరపాటు చేశావో గమనించుకో. ఇప్పుడు కాకపోతే మరోసారి ప్రయత్నించు అని చూడండి. మరోసారి కచ్చితంగా విజయం సాధిస్తారు.
*మీ అనుభవాలు వివరించండి. చిన్నప్పుడు మీరు ఏయే సందర్భాల్లో ఓడిపోయారో, ఎలా నిలదొక్కుకుని విజయం సాధించారో తెలియజేయండి. ప్రముఖుల స్ఫూర్తి కథలు చెప్పి చూడండి. కచ్చితంగా పిల్లల్లో మార్పు వస్తుంది. ఓటమి రుచి తెలిస్తేనే గెలుపును ఆస్వాదించగలుగుతారని చెప్పండి.
*పరాజయం ఎదురైతే చేసే పనిని వదిలేయడం సరికాదని తెలియజేయాలి. ఆ పనిని మరింత శ్రద్ధగా, నేర్పుగా, పట్టుదలతో చేయమని అర్థంమని వివరించాలి. ఈ విషయాలన్నీ చిన్నతనం నుంచే విద్యార్థులు అలవరచుకుంటే విజయాలకు ఆనందించకుండా, వైఫల్యాలకు కుంగిపోకుండా ఉంటారు.