Editorials

టిటిడి పాలకవర్గంలో దాతలకు, ఆధ్యాత్మికవేత్తలకు చోటేది?:TNI ప్రత్యేకం

TTD Ignores Donors And NRIs For Their Board Membership

ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి నాయకత్వంలోని వైకాపా ప్రభుత్వం ప్రకటించిన టిటిడి నూతన పాలకవర్గంపై ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇదేమి పాలకవర్గం అంటూ భక్తులు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల కొండపై కొలువుదీరిన నూతన పాలకవర్గంలో చాలామందిపై కేసులు నడుస్తూ ఉండటం, మద్యం వ్యాపారులు, బడా పెట్టుబడిదారులకు చోటు కల్పించడం పట్ల నిరసన జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి.
* దాతలకు చోటేది
టిటిడికి చాలా మంది భక్తులు పెద్దఎత్తున విరాళాలు ఇస్తున్నారు. కోట్లాది రూపాయిలు విరాళంగా ఇచ్చిన దాతలకు టిటిడి పాలక మండలిలో చోటు కల్పిస్తే బాగుండేదని భక్తులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాకు చెందినా ప్రముఖ ప్రవాసాంధ్రులు, సాఫ్ట్‌వేర్ కంపెనీ అధినేతలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ లాంటి వాళ్ళు గడిచిన రెండేళ్లలో తిరుమల వెంకన్నకు దాదాపు ₹28 కోట్ల రూపాయిలు విరాళంగా అందించారు. వెంకన్నకు అందిన విరాళాల్లో ఇదే పెద్దమొత్తంగా టిటిడి అధికారులు ప్రకటించారు. ఇటువంటి దాతలకు కూడా బోర్డులో చోటు దక్కలేదు. ఇతర దేశాల్లో నివసిస్తున్న ప్రవాసులు ప్రతినిత్యం పెద్దసంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శిస్తున్నారు. ప్రవాసుల్లో ఒకరికి బోర్డులో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే విధంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలకు, స్వామీజీల్లో ఒక్కరికి కూడా పాలకవర్గంలో చోటు దక్కకపోవడం శోచనీయం.