Fashion

ఇంద్రధనస్సు రంగుల ఫ్యాషన్

Holographic Fashion Trends | TNILIVE Telugu Fashion News

కాంతిని పట్టకంలోంచి చూస్తే ఏం కనిపిస్తుంది..? సప్తవర్ణ సమ్మేళనం నృత్యం చేస్తున్నట్లు ఉండదూ. ఆ రంగులవిన్యాసం నేరుగా మన కంటికే అదీ లోహంలా మెరుస్తూ కనిపిస్తే ఎంత బాగుంటుందో కదా. సరిగ్గా ఆ ఆలోచనతోనే హోలోగ్రఫిక్‌ లేదా ఇరిడిసెంట్‌ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టారు ఫ్యాషనిస్టులూ ఇంటీరియరిస్టులూ. వేసుకునే దుస్తులు రంగుల్లో ఉండటం సహజమే. అయితే అవేవీ కాంతిమంతంగా మెరవవు. బెడ్‌షీట్లూ కుషన్లూ ఫర్నిచరూ… ఇలా ఏవయినా సరే ఆయా రంగుల్లో మాత్రమే కనిపిస్తాయి. కానీ హోలోగ్రాఫిక్‌ అలా కాదు, రంగేదయినాగానీ కాంతులీనుతూ కనిపిస్తుంది. అదీ ఒకటీరెండు రంగుల్లో కాకుండా హరివిల్లు వర్ణాల్లో లోహంలా ప్రకాశిస్తూ కనిపించేదే హోలోగ్రఫీ. హోలోగ్రఫీ లేదా ఇరిడిసెంట్‌ ఎఫెక్ట్‌ ఉండే దుస్తులు వేసుకుని నడుస్తుంటే వాటిల్లోని రంగులు అవి గ్రహించే కాంతి కోణాన్ని బట్టి మారుతూ ఓ రంగుల ప్రదర్శన ఇస్తున్నట్లే ఉంటుంది. అంటే ఆ ఫ్యాబ్రిక్‌ లేదా వస్తువులోని రంగులన్నీ ఒక్కో కోణంలో ఒక్కో రంగు కాంతిని గ్రహించి ఆ రంగుని వెదజల్లుతుంటాయన్నమాట. ఈ సరికొత్త రంగుల ప్రదర్శన అనేది కేవలం ఏదో ఒక రకం ఫ్యాబ్రిక్‌కే పరిమితం కాలేదు, జీన్స్‌, రెయిన్‌కోట్లు, జాకెట్స్‌, లెగ్గింగ్స్‌, షూ, బ్యాగులు, బెడ్‌షీట్లు, కుషన్‌ కవర్లు … ఇలా అన్ని దుస్తులూ యాక్సెసరీలూ వస్తువుల్లోకీ ఈ ట్రెండ్‌ చొరబడిపోయింది. దాంతో అంతర్జాతీయ డిజైనర్లతోబాటు అమిత్‌ అగర్వాల్‌, మొనీషా జైసింగ్‌… వంటి మన డిజైనర్లు సైతం రంగుల్ని వెదజల్లే ఫ్యాబ్రిక్కులతో ఫ్యాషన్లు సృష్టించేస్తున్నారు. ఉదాహరణకు ఓ సబ్బు బుడగనే తీసుకుందాం… దానిమీద కాంతి పడినప్పుడు అది రకరకాల రంగుల్లో కనిపిస్తుంటుంది. వాటిమీద కాంతి పడే కోణాన్ని బట్టి ఆ రంగులన్నీ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. అలాగే ఆల్చిప్పలూ, సీతాకోకచిలుక రెక్కలూ, నెమలిపింఛాలకీ ఇలా రంగుల్ని ప్రదర్శించే గుణం ఉంటుంది. అంటే వాటిమీద కాంతి పడే కోణాన్ని బట్టి రంగులు మారుతూ కనిపిస్తుంటాయి. ఈ హోలోగ్రఫిక్‌ గుణానికి ఆ ఈకలూ రెక్కల్లోని రంగులు కాక వాటి కణాల అమరికే కారణమని తేల్చారు శాస్త్రజ్ఞులు. దాని ఆధారంగా వాటి కణ నిర్మాణాన్ని పోలిన రంగుల్ని టెక్నాలజీ సాయంతో రూపొందించి, వాటిని దుస్తులకీ వస్తువులకీ అద్దేయడం ద్వారా ఈ హోలోగ్రఫిక్‌ గుణాన్ని తీసుకొస్తున్నారు. ఎలా తయారైనా చూడ్డానికి ఆకర్షణీయంగా మెరుస్తోన్న ఈ హరివిల్లు ఫ్యాషన్లూ ఇంటిరీయర్స్‌మీద ఈతరం మనసు పారేసుకుందన్నది నిజం..!

Image result for holographic fashion imagesize:640x480

Image result for holographic fashion imagesize:640x480

Image result for holographic fashion

Image result for holographic fashion