Business

34.94శాతం నుంచి 25.17శాతానికి కార్పోరేట్ పన్ను తగ్గింపు

Indian Finance Minister Announces Reduction In Corporate Tax

మందగమనంలో ఉన్న దేశ ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించే దిశగా మరిన్ని ఉద్దీపనలతో ముందుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దేశీయ కంపెనీల కార్పొరేట్‌ పన్నును(సర్‌ఛార్జ్‌, సెస్‌ కలిపి) 34.94శాతం నుంచి 25.17శాతానికి తగ్గించింది. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధనను చేర్చుతూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా తయారీ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు, వృద్ధిరేటు పెంచేందుకే కార్పొరేట్‌ పన్నులను తగ్గించినట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

ఆర్థిక మంత్రి ప్రకటనలో కీలక అంశాలివే..

* ప్రస్తుతం కార్పొరేట్‌ పన్ను 30శాతంగా ఉంది. సర్‌ఛార్జ్‌, సెస్‌ అన్నీ కలిపి ఇది రూ.34.94శాతం. కొత్త నిబంధనలతో దేశీయ కంపెనీల కార్పొరేట్‌ పన్ను 22శాతానికి తగ్గింది. అంటే సర్‌ఛార్జ్‌లు, సెస్‌ కలిసి 25.17శాతం అవుతుంది. అయితే ఇందుకు ఓ షరతు కూడా ఉంది. 22శాతం రేటుతో కార్పొరేట్‌ పన్ను కడితే ఆ కంపెనీలకు ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు అందవు.

* అక్టోబరు 1 తర్వాత ఏర్పాటయ్యే కొత్త దేశీయ తయారీ రంగ సంస్థలు ఎలాంటి ప్రోత్సాహకాలు, రాయితీలు తీసుకోకుండా 15శాతం ఆదాయపు పన్ను చెల్లించొచ్చు. దీంతో కొత్త సంస్థలకు కార్పొరేట్‌ పన్ను(సర్‌ఛార్జ్‌, సెస్‌ కలిపి) 17.01శాతానికి తగ్గింది. ఈ కంపెనీలకు ఇప్పటివరకు కార్పొరేట్‌ పన్ను 25శాతంగా ఉండగా.. సర్‌ఛార్జ్‌, సెస్‌ కలిపి 29.12శాతంగా ఉండేది.

* ఈ ఆదాయపుపన్ను శ్లాబులో ఉన్న కంపెనీలు కనీస ప్రత్యామ్నాయ పన్నులు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

* ప్రోత్సాహకాలు, రాయితీలు అందుకోవాలంటే కంపెనీలు పాత పన్ను విధానంలోనే కార్పొరేటు పన్నులు చెల్లించుకోవచ్చు. అయితే పాత పన్నుల విధానంలో చెల్లించే కంపెనీలకు కనీస పత్యామ్నాయ పన్నులో కొంత ఊరట లభించింది. కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5శాతం నుంచి 15శాతానికి తగ్గించారు.

* కంపెనీల ఈక్విటీ షేర్లను విక్రయించడం ద్వారా వచ్చిన మూలధనంపై ఇకపై ఎలాంటి సర్‌ఛార్జ్‌ ఉండదు.

* జులై 5, 2019 కంటే ముందే షేర్ల బైబ్యాక్‌ ప్రకటించిన లిస్టెడ్‌ కంపెనీలకు ఎలాంటి సూపర్‌ రిచ్‌ పన్ను ఉండదు.

* కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఇతర ఉద్దీపనలతో ప్రభుత్వం ఏటా రూ.1.45లక్షల కోట్ల ఆదాయం కోల్పోనుంది.

జైట్లీ హామీ నెరవేరిన వేళ..

2015-16 బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కార్పొరేట్‌ పన్నులపై అప్పటి ఆర్థిక మంత్రి, దివంగత అరుణ్‌ జైట్లీ కొన్ని హామీలిచ్చారు. రానున్న నాలుగేళ్లలో అంటే 2019 నాటికి కార్పొరేట్‌ పన్నును 25శాతానికి తీసుకొస్తామని నాడు జైట్లీ అన్నారు. అయితే అది దశలవారీగా జరుగుతుందన్నారు. అన్నట్లుగానే 2017లో రూ.50 కోట్ల కంటే తక్కువ టర్నోవర్‌ కలిగిన కంపెనీల కార్పొరేట్‌ పన్నును తగ్గించారు.

ఆరునెలల క్రితం కూడా జైట్లీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. జీఎస్‌టీ వసూళ్లు మెరుగైతే అన్ని కంపెనీల కార్పొరేట్‌ పన్నులను 25శాతానికి తీసుకొస్తామని స్పష్టం చేశారు. తాజాగా నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో జైట్లీ హామీ నెరవేరినట్లయింది.