Devotional

తిరుమల బ్రహ్మోత్సవాలకు 1000ఏళ్ల చరిత్ర

TTD Brahmotsavams Date Back 1000s Of Years | TNILIVE Devotional

‘అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు’ అనే ప్రశస్తి ఏడుకొండల వేంకటేశ్వర స్వామి విషయంలోనే సార్థకం. ఆయన కలియుగ దైవం. భక్తుల పాలిటి పెన్నిధి. కొలిచినవారికి కొంగుబంగారం. ఆ స్వామి వైభవానికి బ్రహ్మోత్సవాలే ప్రత్యక్ష నిదర్శనాలు.
*తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి తరతరాలుగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ఐహిక పారలౌకికాలు. భక్తి ముక్తి ప్రదాయకాలు. పరమాత్మ ఆవిష్కారానికి పరమ సోపానాలు. ఇది నిత్య సత్యం. వశిష్టాది మునులతో స్వామికి చతుర్ముఖ బ్రహ్మ జరిపించిన ఉత్సవాలు కాబట్టి ఇవి ‘బ్రహ్మోత్సవాలు’గా సార్థకమయ్యాయని ‘శ్రీ వేంకటాచల మాహాత్మ్యం’ తదితర పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.
***ఏడాదికి పదకొండు బ్రహ్మోత్సవాలు!
శ్రీవారి బ్రహ్మోత్సవాల చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే… పూర్వం ఆ ప్రాంతమంతా కాకులు దూరని కారడవి. క్రూర మృగాలకు స్వైర విహార స్థలం. అయినప్పటికీ శ్రీ వేంకటేశ్వరస్వామి నిలయమైన తిరుమలగిరి సుందరంగా, అపర వైకుంఠంగా, భక్తజన సందోహంతో విలసిల్లేది. ‘నభూతో నభవిష్యతి’ అనే రీతిలో ఉత్సవాలూ, అర్చనలూ వైభవంగా జరిగేవట. వాటిలో బ్రహ్మోత్సవాలు ఎన్నో తరాల నుంచి… సుమారు వెయ్యి సంవత్సరాల నుంచి రాజులు నిర్వహించేవారనడానికి శాసనాధారాలు ఉన్నాయి.
*క్రీస్తు శకం 966 నుంచి క్రీస్తు శకం 1583 మధ్య బ్రహ్మోత్సవాలు కొన్నేళ్ళపాటు నెలకొకసారి చొప్పున… ఏడాదికి పదకొండు సార్లు జరిగినట్టు శాసనాలు చెబుతున్నాయి.
*తమిళ పెరట్టాసి మాసంలో (తమిళులకు భాద్రపదం నడుస్తూ ఉంటుంది. తెలుగు క్యాలెండర్‌ ప్రకారం ఆశ్వయుజ మాసం ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఏటా ఈ సమయంలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి) తొమ్మిది రోజులు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో తాను ప్రతిష్ఠించిన రజత విగ్రహానికి ఉత్సవం నిర్వహించాలని సమవాయి రాణి శాసనం వేయించినట్టు తెలుస్తోంది. ఇది క్రీ.శ. 966 నాటిది.
క్రీ.శ. 1254 సంవత్సరంలో తెలుగు పల్లవ రాజు విజయ గండ గోపాల దేవుడు చిత్తిరి (చైత్ర) మాసంలో బ్రహ్మోత్సవం జరిపించినట్టు తెలుస్తోంది. అప్పటి వరకూ మూడు బ్రహ్మోత్సవాలు జరిగేవట.
*పదమూడో శతాబ్దం ఆరంభంలో వీరనరసింగ దేవుడు పంగుని (ఫాల్గుణ మాసం) బ్రహ్మోత్సవాన్ని నాలుగోదిగా జరిపించాడట.
*1328లో తిరువేంకటనాథ యాదవరాయలు ఆడి (ఆషాఢ మాస) తిరుమాళ్‌ను అయిదో బ్రహ్మోత్సవంగా ప్రవేశపెట్టాడట.
*1429లో శ్రీ వీరప్రతాప దేవరాయ మహారాయలు ఆశ్వయుజ మాసంలో
ఆరో బ్రహ్మోత్సవాన్ని జరిపించినట్టు శాసనాధారాలు ఉన్నాయి.
*1445లో అనంత శయనర్‌, హరిహర రాయలు ఏడో బ్రహ్మోత్సవాన్ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.
*1446లో కోయల్‌ కెల్వి ఎం పెరుమానార్‌ జీయర్‌ ద్వారా బ్రహ్మోత్సవాల ఆచరణ దిన సంఖ్యను పదమూడుకు పెంచి, పుష్పయాగాన్ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.
*1514లో దాతల సహకారంతో ఎనిమిదో బ్రహ్మోత్సవాన్ని జరిపించారు. కర్ణాటక రాష్ట్రంలోని శివసముద్రానికి చెందిన త్య్రంబక దేవుడు ఎనిమిది కల్యాణ దినాలకు తగిన తాళిగెను ఏర్పాటు చేసినట్టు శాసనాలు చెబుతున్నాయి.
*1530లో తొమ్మిదో బ్రహ్మోత్సవాన్ని అచ్యుతరాయలు
ప్రారంభించారు.
1535లో ఉత్సవ దినాల సంఖ్యను పది రోజుల నుంచి పదమూడు రోజులకు పెంచుతూ పదో బ్రహ్మోత్సవం జరిగినట్టు శాసనాధారాలు ఉన్నాయి.
1570లో పదకొండో బ్రహ్మోత్సవాన్ని సదాశివరాయలు పదకొండో బ్రహ్మోత్సవాన్ని నిర్వహించినట్టు తెలుస్తోంది.
*ఈ విధంగా చరిత్రను పరిశీలించినప్పుడు, 1583 వరకూ అత్యంత వైభవంగా ఏడాదిలో పలుసార్లు బ్రహ్మోత్సవాలు జరిగాయని శాసనాలు స్పష్టం చేస్తున్నాయి.
***ఆద్యంత మనోహరం
బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే ప్రతి పూజ విశేషమైనదే. ఉత్సవాలకు ముందు రోజున కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించి, మూల విరాట్‌కు తొడుగు వేసి, ఆలయాన్ని శుభ్రం చేసేవారట. అలాగే పల్లవోత్సవం, అన్న ప్రసాదాలు, వస్త్రదానం, వసంతోత్సవం, సఖియపడి, అప్పపు పడులు తదితరాల నిర్వహణ కోసం దానాలు చేసి, అగ్రహారాలను కూడా నాట ప్రముఖులు ఇచ్చేవారు. తమిళ మాసాలైన పెరట్టాసి, కార్తికి (కార్తికం), తై (పుష్య), పంగుని (ఫాల్గుణం) మాసాల్లో నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో మాత్రం రథోత్సవాలు జరిగేవి. వాహన సేవల్లో కూడా కొద్దిపాటి మార్పులు, చేర్పులు చోటు చేసుకొనేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్రహ్మోత్సవాలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. పెరటాసి (వార్షిక) బ్రహ్మోత్సవాలు మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
****అన్ని ఆలయాల మాదిరిగా కాకుండా బ్రహ్మోత్సవ కాలంలో సాయంకాలం ధ్వజారోహణం నిర్వహిస్తారు. బంగారు ధ్వజ స్తంభంపై గరుడ కేతనాన్ని ఆవిష్కరిస్తారు. తిరువారాధనం, కలశారాధన, హోమం, బలి, స్నపనం, ఆస్థానం, వివిధ వాహనాలపై ఊరేగింపులు, గరుడోత్సవం, రథోత్సవం, చక్రస్నానం లాంటి వేడుకలను వైఖానస ఆగమోక్తంగా ఆచరిస్తారు. నేత్రానందకరం, మనోల్లాసకారకం, ఆహ్లాద సంభరితం, సుగంధ సుమనోహరం అయిన ఈ వేడుకలను చూసి తరించాల్సిందే తప్ప వర్ణించడం సాధ్యం కాదు.

వినా వేంకటేశం ననాథో ననాథ
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం! వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వెయ్యి సంవత్చరాలకు పైగా చరిత్ర ఉంది. కొన్ని సంవత్సరాల కిందట ఏడాదికి పదకొండు బ్రహ్మోత్సవాలను శ్రీవారి ఆలయంలో నిర్వహించేవారని స్పష్టం చేసే శాసనాధారాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఆశ్వయుజ మాసంలో జరిపే వార్షిక బ్రహ్మోత్సవాలకు పరిమితం అయింది.