Politics

పోలవరాన్ని పొట్టనబెట్టుకున్నారు

YSRCP Is A Curse To Polavaram-CBN | TNILIVE Politics

పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల కల అని, వైకాపా ప్రభుత్వ విధ్వంసక చర్యల వల్ల ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఒకరిని దృష్టిలో పెట్టుకొని రీటెండరింగ్‌ ప్రక్రియ చేపట్టారని ఆరోపించారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంతో పోలవరం ఆపేశారని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకూ ఇలాంటి భారీ ప్రాజెక్టు నిర్మాణాల్లో రివర్స్‌ టెండరింగ్‌కు ఎవరూ పోలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై వైకాపా ప్రభుత్వానిది ‘రివర్స్‌ టెండరింగ్‌ కాదు.. రీ టెండరింగ్‌’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుంటే రీటెండరింగ్‌తో ముందుకెళ్లేవారు కాదని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బంధువు పీటర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఏకపక్ష నిర్ణయాలతో ముందుకెళ్లడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైతే వ్యయం కూడా పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు భద్రత, నాణ్యత ప్రమాణాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం, నిపుణులు చెప్పినా ఈ ప్రభుత్వం వినకుండా ముందుకెళ్తోందని తెలిపారు. బోటు మునిగిపోతే చెప్పలేని వాళ్లు పోలవరం రీటెండరింగ్‌పై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టెక్నికల్‌ బిడ్‌ మానుకొని ప్రైస్‌ బిడ్‌కు వచ్చారని, అదేనా రీటెండరింగ్‌? అని ప్రశ్నించారు. కాంప్లికేటెడ్‌ ప్రాజెక్టుపై ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం మంచిది కాదని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తొలి భద్రత కాఫర్‌ డ్యామ్‌ అని చంద్రబాబు అన్నారు. గతంలో అందరి సలహాలు, సూచనలతో ప్రాజెక్టు నిర్మాణంలో ముందుకెళ్తే.. ఈ ప్రభుత్వం మాత్రం ఎవర్నీ సంప్రదించకుండా ఇష్టారీతిన ప్రవర్తిస్తోందని విమర్శించారు. నచ్చిన సంస్థకు పనులను అప్పగించేందుకు భద్రతను ఫణంగా పెట్టారని ఆరోపించారు. అనుకున్న వ్యక్తికి చెందిన సంస్థ ప్రాథమిక అర్హత సాధించకపోవడంతో నిబంధనలు మార్చారని విమర్శించారు. అందుకే ఈ నెల 5న నోటిఫికేషన్‌ ఇచ్చి.. మళ్లీ దానిని సవరించి 14 మరో నోటిఫికేషన్‌ విడుదల చేశారని చంద్రబాబు అన్నారు.