NRI-NRT

వేడుకగా నాట్స్ సంబరాల విజయోత్సవ సభ

NATS 6th Sambarala Volunteer Appreciation Meet In Coppell

మే 24-26 తేదీల్లో నిర్వహించిన ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 6వ అమెరికా తెలుగు సంబరాలు విజయోత్సవాలను శనివారం సాయంత్రం కొప్పెల్‌లో నాట్స్ డాలస్ విభాగం ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించారు. సభల విజయవంతానికి తోడ్పడిన పలు కమిటీల సభ్యులు, దాతలు, స్వచ్ఛంద కార్యకర్తలను ఈ కార్యక్రమంలో జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఆహార, వాణిజ్య, సావనీర్, సాంస్కృతిక, సాహిత్య, మహిళ, ఆధ్యాత్మిక, మీడియా, రవాణ, ఆతిథ్య తదితర విభాగాలకు చెందిన వందల మంది కార్యకర్తలను నాట్స్ కార్యవర్గం గుర్తించి, సత్కరించి, ఘనంగా గౌరవించింది. 6వ అమెరికా తెలుగు సంబరాల నిర్వహణలో డాలస్ నాట్స్ విభాగ చొరవ అభినందనీయమని, భవిష్యత్తులో ఈ విభాగ చేయూతతో సంస్థ అభ్యున్నతికి తోడ్పడే పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని నాట్స్ BoD ఛైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస్‌లు పేర్కొన్నారు. సంబరాల సమన్వయకర్త కంచర్ల కిషోర్‌ను గుత్తికొండ, మంచికలపూడిలు ప్రత్యేకంగా అభినందించి ఆయన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నే విజయశేఖర్, మాదాల రాజేంద్ర, ఆది గెల్లి, నూతి బాపు, బిందు కంచర్ల, ప్రేమ్ కలిదిండి, ఫణి యలమంచిలి, గోవాడ అజయ్, అమర్ అన్నే, వీరగంధం కిషోర్, సుబ్బు జొన్నలగడ్డ, మాడ దయాకర్, రాయవరం విజయభాస్కర్, అనంత్ మల్లవరపు, వీర లెనిన్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరయిన పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ను గుత్తికొండ శ్రీనివాస్, మంచికలపూడిలు సత్కరించి జ్ఞాపికను అందజేశారు.