Politics

మునిగిన బోటు తీయడం అధికారులకు ఇష్టం లేదు

Officials Are Not Interested In Taking The Boat Out From Water

బోటును గుర్తించిన వెంకటశివ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం జరిగిన రెండో రోజే బోటును గుర్తించామని, రన్నింగ్ పంటు, రోప్ ఇస్తే 2గంటల్లో బోటు తీస్తానని చెప్పానన్నారు. బోటు బయటకు తీయడం అధికారులకు ఇష్టం లేదని, పర్యాటక అధికారులు, బోటు యజమానులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బోటును గుర్తించడానికి ఉత్తరాఖండ్‌ నిపుణులు అవసరం లేదని కొట్టిపారేశారు. వాళ్లు తీసుకొచ్చిన కెమెరాలు సరిగా పనిచేయడం లేదని వెంకటశివ చెప్పారు. నదుల్లో చిక్కుకున్న బోట్లను బయటకు తీయడంలో వెంకటశివ ఎక్స్‌పర్ట్‌ అని పలువురు చెబుతున్నారు. బోటు ప్రమాదంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ రెండు రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రి అవంతి శ్రీనివాస్‌పై ఆయన పలు ఆరోపణలు చేశారు. బోటును వెలికితీయడం అధికారులకు ఇష్టం లేదన్నారు. టూరిజం బోట్లలో మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలున్నాయని ఆరోపించారు. ప్రమాదం ముందు పోలీసులు తీసిన ఫొటోలు, సెల్‌ఫోన్ సంభాషణలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దేవీపట్నం ఎస్సై వద్దని వారించినా కలెక్టర్‌, ఎస్పీకి అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయడంతో బోటు కదిలిందని తెలిపారు. బోటు జాడ సోమవారమే తెలిసిందన్నారు. ఫ్లోటింగ్ జట్టీ ద్వారా బోటు వెలికి తీయవచ్చని చెప్పారు. కానీ ఆ దిశగా ప్రయత్నించడం లేదని, గోదావరిలో తిరిగే బోట్లలో నాయకులు, టూరిజం అధికారుల పెట్టుబడులున్నాయని ఆయన ఆరోపించారు. అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రమాదంపై సీనియర్ అధికారితో విచారణ జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.