Sports

ద్రవిడ్‌కు చిర్రెత్తింది. సిక్సర్ బాదాడు.

ద్రవిడ్‌కు చిర్రెత్తింది. సిక్సర్ బాదాడు.

రాహుల్ ద్రవిడ్‌.. భావితరాల క్రికెటర్లకు అతడో రోల్‌ మోడల్‌. సుదీర్ఘ ఫార్మాట్‌కు రారాజు. నిప్పులు చెరిగే బంతులు విసురుతున్నా సులువుగా ఎదుర్కొంటూ ప్రత్యర్థులను నిస్సహాయులను చేయడంలో నేర్పరి. సహచరులంతా వెనుదిరుగుతున్నా క్రీజులో పాతుకపోయే ‘ది గ్రేట్‌ వాల్‌’. ప్రత్యర్థులు కవ్విస్తున్నా సౌమ్యుడిగా ఉంటూ బ్యాట్‌తో సమాధానం చెప్పే ‘మిస్టర్‌ కూల్‌’. అతడి 15 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో వివాదాలకు చోటు లేదు. కానీ, ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే రాహుల్‌ ద్రవిడ్‌ ప్రత్యర్థికి ఓ సందర్భంలో తన ఆవేశాన్ని రుచి చూపించాడు. ఇంతకీ సహనానికి మారుపేరుగా ఉండే ద్రవిడ్‌కు అసలు ఆవేశం ఎందుకు వచ్చింది? ప్రత్యర్థికి అతడు ఎలాంటి సమాధానమిచ్చాడు?

భారత్‌ తరఫున రాహుల్‌ ద్రవిడ్‌ 1996లో టెస్టు క్రికెట్‌ అరంగ్రేటం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే క్రికెట్‌ ప్రపంచానికి తన సత్తా ఏంటో తెలియజేశాడు. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 95 పరుగులు బాది జట్టును ఆదుకున్నాడు. దీంతో కొన్ని రోజుల్లోనే జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఆ తర్వాత 1997లో జింబాబ్వే, దక్షిణాఫ్రికాతో జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. సఫారీల గడ్డపై అతడికదే తొలి పర్యటన. సఫారీ జట్టులో అరవీర భయంకర బౌలర్లకు కొదవ లేదు. ట్రై సిరీస్‌ లీగ్‌ మ్యాచుల్లో దక్షిణాఫ్రికాదే పైచేయి. ఆతిథ్య జట్టుపై జింబాబ్వే, భారత్‌ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. జింబాబ్వేపై టీమిండియా గెలిచి దక్షిణాఫ్రికాతో తుది పోరుకు సిద్ధమైంది. బలమైన సఫారీ జట్టు చేతిలో భారత్‌కు ఓటమి తప్పదని భావించారంతా. కానీ, ఫైనల్‌కు వరుణుడు అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను మరుసటి రోజు నిర్వహించారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. మరోసారి వరుణుడు తన ప్రతాపం చూపించాడు. దీంతో టీమిండియా లక్ష్యాన్ని 40 ఓవర్లలో 251 పరుగులుగా నిర్ణయించారు. 18 పరుగులకే గంగూలీ రూపంలో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం ద్రవిడ్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. సచిన్‌తో కలిసి అతడు సఫారీల బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను విడదీయాలని సఫారీ బౌలర్లు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ, వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. దక్షిణాఫ్రికా పేసర్‌ అలెన్‌ డొనాల్డ్‌ రంగంలోకి దిగాడు. అతడు 150 కి.మీల వేగంతో బంతులను విసరగలడు. ప్రత్యర్థులను కవ్వించడంలో సిద్ధహస్తుడు. బంతితో ద్రవిడ్‌ను బోల్తా కొట్టించడం కష్టమని డొనాల్డ్‌ మాటల యుద్ధానికి తెరతీశాడు. రెచ్చగొట్టి వాల్‌ ఏకాగ్రతను దెబ్బతీయాలనుకున్నాడు. కానీ, అతడికి ద్రవిడ్‌ తన బ్యాటుతో అదిరిపోయే సమాధానమిచ్చాడు. అతడు వేసిన తర్వాతి బంతిని లాంగ్‌ఆన్‌ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ద్రవిడ్‌ నుంచి అలాంటి స్పందన వస్తుందని ఊహించని డొనాల్డ్‌ దెబ్బకు నీరుగారిపోయాడు.

10 ఓవర్లకు భారత్ 84/1. దీంతో టీమిండియా విజయం నల్లేరు మీద నడకే అని అనుకున్నారంతా. కానీ, సచిన్‌ ఔటవ్వడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. తర్వాత క్రీజులోకి వచ్చిన అజారుద్దీన్, అజయ్‌ జడేజా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. అయినా ద్రవిడ్‌ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. 84 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. తర్వాత భారత్‌ ఓటమి లాంఛనమైంది. 17 పరుగుల తేడాతో టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ముక్కోణ సిరీస్ ఫైనల్‌ క్రికెట్ ప్రేమికులకు ఓ మంచి జ్ఞాపకం. సఫారీ గడ్డపై ద్రవిడ్‌ పోరాడిన తీరు అద్భుతం. డొనాల్డ్‌ బౌలింగ్‌లో బాదిన సిక్సర్‌ను ఎన్నటికీ మరవలేనని, ఎంతో ప్రత్యేకమని ఓ సందర్భంలో ద్రవిడ్‌ పేర్కొన్నాడు. ఈ సిక్సర్‌ను ‘వైట్‌ లైటింగ్‌’గా క్రికెట్‌ వ్యాఖ్యాతలు అభివర్ణించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ద్రవిడ్‌ కోచ్‌గా అవతరామెత్తాడు.