Business

ఎయిర్‌టెల్ ₹599 ప్లాన్‌తో బీమా సౌకర్యం

Airtel 599 Prepaid Plan Gives You Life Insurance

ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం భారతీ ఎయిర్‌టెల్ అదిరిపోయే ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. భారతీ ఏఎక్స్ఏ లైఫ్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఎయిర్‌టెల్.. దేశవ్యాప్తంగా ఉన్న తమ ప్రీపెయిడ్ ఖాతాదారులకు ఆ ప్రయోజనాలు అందించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం కొత్తగా రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో రోజుకు 2జీబీ డేటాతోపాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. దీంతో పాటు భారతి ఏఎక్స్ఏ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి రూ.4 లక్షల జీవిత బీమా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్ కాలపరిమితి 84 రోజులు. ఒకసారి రీచార్జ్ చేయించుకున్న తర్వాత లభించే జీవిత బీమా.. రీచార్జ్ చేసిన ప్రతిసారీ దానంతట అదే రెన్యువల్ అవుతుంది. ప్రస్తుతం ఈ ఆఫర్ తమిళనాడు, పాండిచ్చేరిలోని ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే దీనిని దేశమంతా విస్తరించనున్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది.

ఎయిర్‌టెల్ అందించే జీవిత బీమా 18-54 వయసున్న ఖాతాదారులందరికీ లభిస్తుంది. అయితే, ఇందుకోసం ఎటువంటి పేపర్ వర్క్, వైద్య పరీక్షలు అవసరం లేదు. ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సర్టిఫికెట్ డిజిటల్‌గా డెలివరీ అవుతుందని కంపెనీ తెలిపింది. అవసరం అనుకుంటే ఫిజికల్‌గా కూడా ఓ సర్టిఫికెట్‌ ఇంటి అడ్రస్‌కు వస్తుంది. ఇన్సూరెన్స్ ఆఫర్ పొందాలంటే ఖాతాదారుడు తొలుత రూ.599 ప్లాన్ రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత జీవిత బీమా కోసం ఎస్సెమ్మెస్, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కానీ, ఎయిర్‌టెల్ రిటైలర్ ద్వారా కానీ ఎన్‌రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. విచిత్రం ఏమిటంటే.. దేశంలోని మొత్తం జనాభాలో జీవిత బీమా చేయించుకున్న వారి సంఖ్య 4 శాతం లోపే ఉండగా, మొబైల్స్ కలిగిన వారి సంఖ్య 90 శాతంగా ఉండడం గమనార్హం. 2022 నాటికి దేశంలో మొబైల్ వినియోగించేవారి సంఖ్య 830 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా.