Health

కృత్రిమ గుండెతో 5నెలలు బతికించారు

Artificlal Heart Blood Pumping Keeps Patient Alive For 5Months

గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులకు కృత్రిమ పద్ధతుల్లో గుండె కొట్టుకునేలా చేస్తారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే గుండె మార్పిడి చేయకపోతే రోగి మరణానికి దగ్గరవుతారు. దేశంలో ఇప్పటివరకు ఇలా కృత్రిమ వ్యవస్థతో రోగి బతికిన గరిష్ఠ కాలం 64 రోజులు. కర్ణాటకకు చెందిన 42 ఏళ్ల ఆశా (పేరు మార్చారు) 155 రోజులు బతికినట్లు వైద్యులు ప్రకటించారు. స్థానికంగా ఉన్న విక్రమ్‌ ఆస్పత్రి గుండె చికిత్స విభాగంలో 2017 డిసెంబరులో చేరిన ఆశా ‘వెంట్రిక్యులర్‌ టెకీకార్డియా’ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. రంగనాథ్‌నాయక్‌ నేతృత్వంలోని వైద్య బృందం గతేడాది ఫిబ్రవరి7న బి-వ్యాడ్‌ యంత్రంతో కృత్రిమ పంపింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థతోనే 155 రోజులు బతికిన ఆశాకు జులై 10న గుండె మార్పిడి చేసినట్లు వైద్యులు తెలిపారు. గుండె మార్పిడి తర్వాత రోగి సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లు వైద్యులు తెలిపారు.