Editorials

అధికారం అడ్డుపెట్టుకుని విర్రవీగే నేతలకు కోడెల, చిదంబరం గతే-TNI ప్రత్యేకం

Hey Fraud Politician-Take Kodela & Chidambaram As Examples

దేశంలోనూ, రాష్ట్రంలోనూ గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు అవినీతిమయంగా, నేతల అక్రమాలకు నిలయంగా మారాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొందరు నేతలు అడ్డగోలుగా విర్రవీగుతున్నారు. అక్రమ పద్దతుల్లో కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. వ్యవస్థలను, అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని తమకు తిరుగేలేదని చెలరేగిపోతున్నారు. ఇలా చెలరేగిన వారి గతి ఏవిధంగా మారిందో ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలు నిశితంగా గమనించాలి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అడ్డూఅదుపు లేకుండా నిస్సిగ్గుగా అక్రమాలకు పాల్పడితే భవిష్యత్తులో చట్టం, ఉరితాడు తమ భుజాలపై ఉంటుందని నేటి నేతలు గమనించాలి. అడ్డగోలుగా వ్యవహరిస్తే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ లాగా ఆత్మహత్య అయినా చేసుకోవాలి, లేదా చిదంబరం లాగా జైలులో కూర్చొని చిప్పకూడైన తినవలసి ఉంటుందని నేడు అధికారంలో విర్రవీగుతున్న నేతలు దృష్టిలో పెట్టుకోవాలి.

*** కోడెల, చిదంబరంలకే ఆ గతి పడితే!…మీరెంత?
* కోడెల శివప్రసాద్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ తారాజువ్వగా వెలిగారు. మంచి వైద్యుడిగా పేరున్న కోడెల పల్నాడు పులిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి రాకెట్ మాదిరి దూసుకువెళ్ళారు. కానీ కోడెల జీవితం గత ఐదేళ్ళ అధికారంలో మసకబారింది. స్పీకర్ స్థానాన్ని ఆయన అపహాస్యం పాలుచేశారు. ఒక నియంతలాగా వ్యవహరించి ప్రతిపక్షం వైకాపాను అసెంబ్లీలో అడుగడుగునా అణగదొక్కారు. జగన్ అధికారంలోకి రావటానికి చంద్రబాబు పతనం కావడానికి, కోడెల శివప్రసాద్ ప్రధాన కారకుడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసిన ఒకప్పటి పలనాటి పులి నేడు దిక్కులేని విధంగా తనను సమర్థించేవారు లేక ఏకాకిగా మిగిలి ప్రాణాలనే తీసుకున్నారు.

* అధికారం దుర్వినియోగానికి పాల్పడి అడ్డగోలుగా వ్యవహారిస్తే ఎంతటి వారికైనా చిప్పకూడు తప్పదని, జైలులో పడక తప్పదని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం నిరూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో చిదంబరం ఒక వెలుగు వెలిగారు. ప్రతిపక్షాల వారినే కాదు తన పార్టీ సహచరులను సైతం పురుగుల్లాగా చూసిన చిదంబరం ఎప్పుడూ గర్వంతో విర్రవీగేవారు. వేలాది కోట్లు అక్రమంగా ఆర్జించారు. తెలుగుజాతిని ముక్కలు చేశారు. ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు. గత కొద్దిరోజుల నుండి తీహార్ జైల్లో గజదొంగల నడుమ దిక్కులేని వ్యక్తిగా చిదంబరం దీనంగా కలలు కంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే చిదంబరాన్ని వెనకేసుకుని వచ్చే నాయకుడే కరువయ్యాడు. కర్ణాటక రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి అంతా తానేనంటూ చక్రం తిప్పి కోట్లాది రూపాయలు కూడగట్టిన సీనియర్ కాంగ్రెస్ నేత వైవీ శివకుమార్ ప్రస్తుతం జైల్లోనే మగ్గుతున్నారు. మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు సుజనాచౌదరి, సిఎం.రమేశ్‌లు ప్రస్తుతానికి మోడీ కాళ్ళు పట్టుకుని జైలుకు వెళ్ళకుండా నీతివాక్యాలు పలుకుతున్నారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు పక్కన చేరి మోడీని తిట్టిపోసిన ఈ ఇరువురు ఎంపీలు నేడోరేపో జైలుకు వెళ్ళక తప్పదు.

***వ్యవస్థలను భ్రష్టుపట్టించిన చంద్రబాబు
తాను ప్రపంచంలోనే పెద్ద పరిపాలనాదక్షుడని ప్రగల్భాలు పలికే చంద్రబాబు తన ఐదేళ్ళ పరిపాలనలో వ్యవస్థలను భ్రష్టుపట్టించారు. కోడెలతో పాటు ఇటీవల అరెస్టు అయిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న యరపతినేని శ్రీనివాసరావు వంటి తన పార్టీ నేతల ఆగడాలను చంద్రబాబు అడ్డుకోలేకపోయారు. అవినీతి, అక్రమార్కుల మూలంగా చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయి. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. ప్రజాధనాన్ని అడ్డగోలుగా లూటీ చేశారు. ఫలితంగా చంద్రబాబు ఘోరపరాజయాన్ని చవిచూశారు.

*** అవినీతిని నిర్మూలించడం జగన్‌కు సాధ్యమా?
తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అక్రమాల మూలంగా ప్రజలు విసుగెత్తిపోయి ప్రత్యామ్యాయం లేక వై.ఎస్.జగన్‌ను ఎన్నుకున్నారు. అంతే తప్ప ఆయన ఘనచరిత్రను చూసి ఏ ఒక్కడూ ఓటు వేయలేదు అనడంలో సందేహంలేదు. అవినీతిని నిర్మూలిస్తామంటూ జగన్ పదేపదే చెపుతున్నారు. వాస్తవానికి ఆ దాఖలాలు ఏమీ కనిపించడంలేదు. డబ్బులు ఇవ్వందే ఎక్కడా పని జరగడం లేదు. వ్యవస్థలను పరుగెత్తించడంలో జగన్ ఇంకా మెతక వైఖరినే అవలంభిస్తున్నారు. వైకాపా నేతలు ఇసుక దందాలు, గనులు తవ్వకాల్లో మునిగి తేలుతున్నారు. చీరాలలో ఒక జర్నలిస్టుపై దాడి జరిపిన నేతలను కనీసం జగన్ మందలించలేకపోయారు. గత ఎన్నికల్లో ఒక్కొక్క ఎంపీ ₹40కోట్లు, ఎమ్మెల్యే ₹15కోట్ల వరకు ఖర్చు చేసి గెలిచారు. వీరందరూ తాము ఖర్చుపెట్టిన సొమ్మును రెండింతలు సంపాదిస్తేనే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నిలదొక్కుకుంటామనే ఆశతో ఉన్నారు. వీరిని జగన్ ఎలా కట్టడి చేయగలరో వేచి చూడాలి! సమాజానికి రుగ్మతగా మారిన అవినీతిని, అధికార దుర్వినియోగాన్ని అరికట్టకపోతే జగన్‌తో పాటు ఆయన పార్టీకి కూడా చంద్రబాబు, తెదేపాలకు పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో పడుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.