Politics

గ్రామ సచివాలయ ఉద్యోగులకు కాంట్రాక్ట్ మెలిక

AP Village Secretariat Employees Are Bound By Three Years Contract

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారు రెండేళ్లు ప్రొబేషనరీ ఉంటుందని వారికిచ్చిన ఆర్డరల్లో పేర్కొన్నారు. అంతేకాదు ప్రతి ఉద్యోగి మూడేళ్లు తప్పనిసరిగా పనిచేయాల్సి ఉంటుందని, మధ్యలో ఉద్యోగం మానేస్తే వారికి అందించిన గౌరవ వేతనంతో పాటు శిక్షణ కోసం ప్రభుత్వం చేసిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించాలని పేర్కొన్నారు. దీంతో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు అందుకున్న అనేక మంది అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. నోటిఫికేషన్‌లో రెండే ళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ పనిచేయాలని పేర్కొన్నారని, మూడేళ్లు కచ్చితంగా పనిచేయాలన్న నిబంధన అందులో లేదని పలువురు పేర్కొంటున్నారు. ఉద్యోగాలు పొందినవారిలో ఎక్కువ మంది గ్రూప్‌ పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులే ఉన్నారు. ఇప్పటికే గ్రూప్‌-2, 3 పరీక్షలు రాసిన వారు ఫలితాల్లో మంచి మార్కులొస్తే ఆ ఉద్యోగాలకు వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌లో ఈ నిబంధనలు పెట్టడంతో అభ్యర్థులు డీలా పడుతున్నారు. కొంతమంది అభ్యర్థులు ఈ ఉద్యోగం వదిలేసుకుందాంలే అన్న భావనకొచ్చినట్లు తెలుస్తోంది.