Devotional

దుర్గమ్మగా అమ్మవారు

Durga Avatar In Navaratri 2019

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఎనిమిదో రోజైన ఆదివారం కనకదుర్గమ్మ దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించినందుకు ప్రతీకగా అమ్మను ఈ అవతారంలో అలంకరిస్తారు. దేవతలందరి శక్తులు కలగలసిన మహోన్నతమైన శక్తిరూపం ఈ తల్లి. ఎనిమిది చేతులతో, ఎనిమిది రకాలైన ఆయుధాలను ధరించి, శత్రువులను సంహరించే స్వరూపంతో దర్శనమిస్తుంది. మనలో ఉన్న అసూయ, ద్వేషం, అహంకారం వంటి శత్రువుల్నీ సంహరించి శాంత స్వభావాన్ని అలవర్చుకోవాలని దుర్గాదేవి అలంకారం సూచిస్తుంది. ఆయుధాలు ధరించడం… ధైర్యానికి, అన్యాయంపై పోరాటం చెయ్యడానికి… అనుక్షణం సన్నద్ధంగా ఉండే లక్షణానికి నిదర్శనం. తనపై జరిగే అన్యాయాన్ని, అక్రమాలను మౌనంగా భరించాల్సిన స్థితి నుంచి పోరాడి… తనను కాపాడుకోవడంతోపాటు సాటి మహిళల్లో స్ఫూర్తి నింపాలనే సందేశం ఈ అవతారం ద్వారా అందుకోవాలి. దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా అన్నిరకాల దుఃఖాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. లోకాలన్నింటికీ తల్లి అయిన దుర్గాదేవి ఎలాగైతే తన బిడ్డలకు ఆపదలు రాకుండా కాపాడుతుందో తల్లులంతా తమ బిడ్డల్ని అదేవిధంగా కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ అవతారం అందిస్తుంది. స్త్రీ అంటే శాంతమూర్తి మాత్రమే కాదు… అవసరమైతే ఆదిపరాశక్తిగానూ విజృంభించగలదన్న శక్తిచైతన్యాన్ని నిరూపించడం… మహిళలకు ఈ స్ఫూర్తిని అందించడమే దుర్గాదేవి అవతారంలోని పరమార్థం. దుర్గాదేవి ప్రకృతి స్వరూపిణి అని శాస్త్రాలు చెబుతున్నాయి. దుర్గాస్వరూపంలో ఉన్న మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కృషి చెయ్యాలనే సందేశాన్నీ ఈ అవతారం అందిస్తుంది.