Agriculture

బద్దలైన ప్రాజెక్టు గేటులు

Telugu Latest Agricultural News | Musi Project Gates Damaged

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో అతి పెద్దదైన మూసీ ప్రాజెక్టు ఆరో నంబరు రెగ్యులేటరీ గేటు శనివారం సాయంత్రం కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టులోని నీరు దిగువన ఉన్న మూసీ నదిలోకి వృథాగా వెళుతోంది. హైదరాబాద్‌తో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పైనుంచి వస్తున్న వరదను పూర్తి స్థాయిలో అంచనా వేయకపోవడం వల్లే గేటు కొట్టుకుపోయిందని నీటిపారుదల శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 2017లో ప్రభుత్వం విడుదల చేసిన రూ.18 కోట్లతో మరమ్మతులను చేపట్టారు. కానీ రెండేళ్లలోనే రెగ్యులేటరీ గేటు కొట్టుకుపోవడం పనుల్లో నాణ్యతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 4.4 టీఎంసీలు(645 అడుగులు) కాగా.. గేటు కొట్టుకుపోయే సమయానికి ప్రాజెక్టులో 4.3 టీఎంసీల (644.5 అడుగులు) మేర నీరు ఉంది. ప్రాజెక్టుకు 8 రెగ్యులేటరీ గేట్లు (డెడ్‌ స్టోరేజీ వద్ద ఉన్న నీటిని ఈ గేట్ల ద్వారా విడుదల చేయవచ్చు), 12 క్రస్ట్‌ గేట్లున్నాయి. గేటు కొట్టుకుపోవడంతో ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ (612 అడుగులు)కి పడిపోయే ప్రమాదం నెలకొంది. ‘‘ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని ఇప్పుడే తెలిసింది. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తే తప్ప ఘటనకు కారణం తెలియద’’ని ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీరు నర్సింహ ‘ఈనాడు’కు చెప్పారు. శనివారం రాత్రి ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు కింద నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 42 గ్రామాల కింద 33 వేల ఎకరాల ఆయకట్టు ఉంది.