Sports

భజ్జీ దెబ్బకు బజ్జీ అయిన పాక్ నటి

Harbhajan Singh Mocks Pak Actress Veena Malik

ఐరాస వేదికగా పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భారత్‌ మీద చేసిన తీవ్ర వ్యాఖ్యలపై టీమిండియా క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్, పాకిస్థాన్‌ నటి వీణా మాలిక్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల అంతర్జాతీయ వేదికపై ఇమ్రాన్‌ భారత్‌పై విషం చిమ్ములా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను హర్భజన్‌ ఖండిస్తూ అక్టోబర్‌ 2న ఓ ట్వీట్‌ చేశాడు. ‘ఇమ్రాన్‌ ప్రసంగం ద్వారా భారత్‌కు అణుయుద్ధం సంకేతాలు అందుతున్నాయని, ఒక మేటి క్రీడాకారుడైన ఆయన మాటలు ఇరు దేశాల మధ్య మరింత ద్వేషాన్ని వెదజల్లేలా కనిపిస్తున్నాయని పేర్కొన్నాడు. పాక్‌ ప్రధాని తన ప్రసంగాలతో శాంతిని నెలకొల్పాలని ఒక క్రీడాకారుడిగా తాను కోరుకుంటున్నట్లు భజ్జీ పోస్టు చేశాడు. అందుకు స్పందించిన పాక్‌ నటి వీణా మాలిక్‌ హర్భజన్‌ను ఉద్దేశిస్తూ.. తమ ప్రధాని ఇమ్రాన్‌ శాంతి గురించే మాట్లాడారనీ, కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేస్తే దారుణ పరిస్థితులు తలెత్తి, హింసాత్మక ఘటనలు జరుగుతాయనే వాస్తవిక పరిస్థితులనే ఆయన చెప్పారని తెలిపింది. అక్కడ ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని పేర్కొనలేదని, ప్రజల్లో నెలకొన్న భయాందోళనల్ని మాత్రమే చాలా స్పష్టంగా చెప్పారని ఆమె పేర్కొంది. చివరగా నీకు ఇంగ్లీష్‌ అర్థం కాదా? అంటూ భజ్జీకి ట్వీట్‌ చేసింది. అయితే వీణామాలిక్‌ చేసిన ఆ ట్వీట్‌లో ఓ ఇంగ్లీష్‌ పదం (Surley)కి బదులు(surly)గా తప్పుగా రాసింది. భజ్జీ దానిపై పంచ్‌ ట్వీట్‌ విసురుతూ.. surly అంటే ఏమిటి? అది Surelyయేనా? అంటూ నవ్వాడు. ఇంకెప్పుడైనా ఇంగ్లీష్‌లో రాసేటప్పుడు ఒకసారి చదివుకో అంటూ రీట్వీట్‌ చేశాడు. ఇదిలా ఉండగా ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై టీమిండియా క్రికెటర్లు వీరేందర్‌ సెహ్వాగ్‌, గంగూలీ సైతం ఘాటుగా స్పందించారు. అతడి మాటలు దారుణమని, ఒక అత్యుత్తమ ఆటగాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని గంగూలీ పేర్కొన్న విషయం తెలిసిందే.