Devotional

అయ్యప్ప మాలా సమయం ఆసన్నమైంది

Kartheeka Masam Marks 2019 Ayyappa Deeksha Timing

కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాదిమంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు. కఠిన నియమాలతో, నిష్ఠ‌ల‌తో 41 రోజుల పాటు మండలదీక్ష చేయడంతో మాలధారులు పునీతులవుతారు. ఆధ్యాత్మిక జీవనశైలి అలవడుతుంది. తెల్లవారుఝామున లేచి బ్రహ్మముహూర్తంలో చన్నీటి స్నానం చేయడం.. కటిక నేలపై నిద్రపోవడం..నల్లని బట్టలు ధరించి చందన ధారణతో ప్రతి ఒక్కరిని స్వామీ అని పిల‌వ‌డం… ప్రతి ఒక్క మాలధారుడి జీవనశైలిని మార్చివేస్తుంది.

కేరళలోని పత్తనం తిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో శబరిమల క్షేత్రం నెలకొనివుంది. స్వామిని ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే దర్శించుకోవాల్సివుంటుంది. ముఖ్యంగా మలయాళ వృశ్చికమాసం (నవంబరు-డిసెంబరు)లో మండల చిరప్పు ప్రారంభమవుతుంది. ఇందు కోసం కార్తికం ముందునుంచి దీక్ష తీసుకుంటారు. ఆ రోజు నుంచి భక్తుల జీవనశైలి మారిపోతుంది. న‌ల్ల‌ని బ‌ట్ట‌లు ధ‌రించి, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకభుక్తం ఉంటూ. వారు సాగించే దీక్షలోని నియమాలు సామాన్యులకు కఠినమే. అలాగే దీక్షా సమయంలో అందరూ ‘స్వామి’గా భావించి వ్యవహరించడం అపురూప అనుభూతిని ఇస్తుంది. మండలకాలం అంటే 41 రోజుల పాటు స్వామిదీక్షను పూర్తిచేసుకొని ఇరుముడిని కట్టుకొని శబరిమలకు వెళ్లాలి. నేతితో నిండిన కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు, బియ్యం, వస్త్రాలు… తదితరాలతో నిండిన ఈ మూటను గురుస్వామి భక్తుల శిరసున ఉంచుతారు.

• ఇరుముడి తలదాల్చిన భక్తబృందం ఎరుమేలి నుంచి అసలు యాత్రను ప్రారంభిస్తుంది. ఈ దీక్షకు మతంతో సంబంధం లేదన్న వాస్తవాన్నీ, అసలైన లౌకిక భావన భారతీయుల సొంతమనీ వెల్లడి చేసే వేదిక ఎరుమేలే! హైందవ ధర్మానుసారం దీక్ష‌చేసిన భ‌క్తులు తొలుత ఇక్కడి వావర్‌ మసీదును దర్శించుకొని అక్కడి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ సందర్భంలోనే రంగులు జల్లుకొని వాద్యబృందాలు తోడు రాగా ‘పేటతుల్లాల్‌’ను నిర్వహిస్తారు. పిదప ఎరుమేలిలోని ధర్మశాస్తకు పూజలు చేస్తారు. ఇక్కడి నుంచి శబరిగిరికి చేరే పెద్దపాదం, చిన్నపాదం అనే మార్గాలు ఉన్నాయి. చిన్నపాదం అంటే ఎరుమేలి నుంచి పంపాతీరం వరకూ వాహనాల్లో ప్రయాణించి అక్కడ స్నానం చేసి నీలిమలను అధిరోహిస్తారు.

• ఇక పెద్దపాదం అంటే ఎరుమేలి నుంచే నడుస్తూ దాదాపు 80 కిలోమీటర్లు నడిచి కొండకు చేరడం! ఈ వనయాత్ర చేసే భక్తులు మొదట ‘పెరుర్‌తోడు’కు వెళ్లి స్నానాదికాలు ముగించి అక్కడి దేవుణ్ని పూజిస్తారు. తరవాత కాలైకట్టి అనే ప్రాంతానికి వెళ్తారు. పిదప అళుదా నదీ తీరానికి వెళ్లి పవిత్ర స్నానమాచరిస్తారు. ఈ నదీ ప్రవాహానికి కారణమైన గాథను గురుస్వాములు తప్పనిసరిగా చెబుతారు. అయ్యప్ప చంపిన మహిషి కార్చిన కన్నీరే నదిగా మారిందని అంటారు. ఇక్కడ చిన్నరాయిని తీసుకొని అళుదామేడు దాటి ఇంజిపరైకోటై చేరుకొంటారు. కళిడం కుండ్రు అనే ప్రదేశంలో ఈ రాయిని వేస్తారు. కరిమల యాత్రకు శ్రీకారం చుడుతారు. పెరియనపట్టం, చెరియ‌న‌ప‌ట్టం మీదుగా పంపకు (దీనినే పంబ అని వ్యవహరిస్తారు) చేర‌తారు.. ఈ వనయాత్రలోనే కొందరు భక్తులు శక్తిపూజ చేసి అన్నదానం చేస్తుంటారు.

పంపానదిలో స్నానం చేసి అక్కడి గణపతికి ఇరుముడిని చూపిస్తారు. తరవాత దాదాపు అయిదు కిలోమీటర్ల ఎత్తున్న నీలిమలను ఎక్కాలి. అనంతరం శరంగుత్తికి వెళ్లాలి. ఈ ప్రదేశంలోనే తొలిసారి మాలను ధరించిన కన్నెస్వాములు- ఎరుమేలి నుంచి తీసుకువచ్చిన శరాలను గుచ్చాలి. తరువాత సన్నిధానంలోకి అడుగుపెడుతారు. అప్పటి వరకు కొండలు, కోనలు దాటుకొంటూ వచ్చిన భక్తులు స్వామివారి ఆలయం చూడగానే ఆధ్యాత్మిక అనుభూతికి గురవుతారు. ఇరుముడిని దాల్చిన స్వాములు పవిత్రమైన పదునెట్టాంబడి (పద్దెనిమిది మెట్లు) మీదుగా దేవాలయాన్ని చేరేందుకు సిద్ధమవుతారు. ఆలయానికి ద్వారపాలకులైన కడుత్తస్వామి, కరుప్పస్వామిలకు టెంకాయలు కొడుతారు. ఆ మెట్లను ఎక్కి స్వామి సన్నిధికి ప్రదక్షిణ చేసి ఇరుముడిని అయ్యప్పకు చూపించి ఆలయం నుంచి కిందికి దిగడంతో యాత్రలోని ప్రధానభాగం పూర్తవుతుంది.

చిన్నపాదం, పెద్దపాదం ఏదైనా యాత్ర ఆద్యంతం స్వామి నామసర్మణతో శరణుఘోషతో సాగుతుంది. వేలాదిమంది భక్తులతో కోలాహలంగా వుండే ఈ ప్రాంతం అనునిత్యం స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే అయ్యప్పో.. లాంటి ఆధ్యాత్మిక నినాదాలతో అక్కడి కొండ‌లు ప్రతిధ్వనిస్తాయి. మండల చిరప్పు, మకర విలక్కు సమయాల్లో ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ నేతితో అభిషేకాలు జరుగుతుంటాయి. భక్తులు చేయించే ఈ అభిషేకాన్ని ఇలా విశ్లేషిస్తారు. ‘ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడం ఇందులో ఇమిడివుంది. అలాగే నెయ్యిని తీసుకొచ్చిన కొబ్బరి చిప్పల్ని హోమాగ్నిలో వెయ్యాలి. భక్తుడి కర్మఫలాన్ని ఆ ప్రజ్వలనం ధ్వంసం చేస్తుంది’. తరువాత భక్తులు మాలికాపురత్తమ్మ ఆలయాన్ని , నాగరాజ, నాగాయక్షి ఆలయాలను దర్శించుకొంటారు. మాలికాపురత్తమ్మ ఆలయంలో కొబ్బరికాయను ఆ గుడి చుట్టూ తిప్పి వదిలేస్తారు. ఇక్కడ కొబ్బరికాయను కొట్టే ఆచారం లేదు.! ఎరుమేలి నుంచి శబరిమల వరకూ సాగే యాత్ర మకరసంక్రాంతి రోజున తుది ఘ‌ట్టానికి చేరుతుంది. వేనవేల సంఖ్యలో భక్తులు శబరికొండ నుంచి నీలకల్‌ ప్రాంతం వరకు వుంటారు. తిరువాభరణాల వూరేగింపు చూసిన భక్తులు స్వామి శరణాలను వల్లిస్తారు.

* రైలులో వెళ్లే భక్తులు చెంగనూర్‌ లేదా కొట్టాయం రైల్వేస్టేషన్లలో దిగి కారు లేదా బస్సుల ద్వారా పంప చేరుకోవచ్చు.
* దేశంలోని అనేక ప్రాంతాల‌నుంచి రవాణాసౌకర్యం ఉంది.
* కొచ్చి లేదా తిరువనంతపురం విమానాశ్రయాలకు చేరుకోవాలి. అక్కడ నుంచి వాహనాల ద్వారా పంప చేరుకోవాలి. అక్కడ నుంచి కాలిన‌డ‌క‌న ముందుకెళ్లి స్వామిని దర్శించుకోవాలి.