Politics

KTR=Kalvakuntla Twitter Rao

KTR=Kalvakuntla Twitter Rao

ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని కోరుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఏ అంశంపై అయినా అవసరమున్నా లేకున్నా ట్విటర్‌లో స్పందించే మంత్రి కేటీఆర్‌.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు పొన్నం ఓ ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్‌ అంటే కల్వకుంట్ల తారక రామారావు కంటే కల్వకుంట్ల ట్విటర్‌ రావుగానే బాగా ప్రచారంలోకి వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికలకు ముందు కేసీఆర్‌ హామీ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ‘‘యాభై వేల ఆర్టీసీ కార్మికుల బాధ మీకు కనబడడం లేదా? ఉద్యోగాలు తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డుకు మీదుకు రావా?ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోవడం లేదు?’’ అని పొన్నం మండిపడ్డారు. ఆర్టీసీ సమస్యలపై కేటీఆర్ స్పందించకపోతే తెలంగాణ ప్రజల దృష్టిలో ఆయన ద్రోహిగా మిగులుతారన్నారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు.