Health

జీతం తగ్గితే మైండ్ బ్లాంక్ అవుతుంది

Low Wages Will Hurt The Health Of Mind & Thoughts

మూడు పదుల వయసున్న ఉద్యోగుల వార్షిక వేతనంలో 25 శాతంపైగా కోత పడితే వారికి ఆలోచనాపరమైన సమస్యలు ఉత్పన్నమై మధ్యవయసులో మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని తాజా అథ్యయనం హెచ్చరించింది. స్ధిరమైన ఆదాయం కొరవడితే అది మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు తేల్చారు. తక్కువ ఆదాయం కలిగిన వారు నాణ్యతతో కూడిన వైద్య సదుపాయాలను అందిపుచ్చుకోలేరని, ఫలితంగా మధుమేహం వంటి వ్యాధులను దీటుగా ఎదుర్కోలేరని అథ్యయనం పేర్కొంది. పొగతాగడం, మద్యం అలవాట్లను నియంత్రించుకోలేరని తెలిపింది. కెరీర్‌ పీక్‌లో ఉన్న 30 ఏళ్ల వయసులో ఆదాయంలో తగ్గుదల చోటుచేసుకుంటే వారికి మధ్యవయసులో మెదడు ఆరోగ్యం ప్రభావితమవుతోందని తమ పరిశోధనలో విస్పష్టంగా వెల్లడైందని అథ్యయన రచయిత, కొలంబియా స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అదిన జెకి అల్‌ హజరి పేర్కొన్నారు. 23 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన 3287 మందిపై చేపట్టిన ఈ పరిశోధనలో ఆదాయం గణనీయంగా తగ్గిన ఉద్యోగుల మెదడు పనితీరు రాబడి కుదురుగా ఉన్నవారితో పోలిస్తే చురుకుగా లేదని వెల్లడైంది. ఆదాయం పడిపోతే వారిలో చెలరేగే మానసిక సంఘర్షణే మెదడు అనారోగ్యానికి లోనయ్యేందుకు కారణమని చెబుతున్నారు. కాగా, ఈ పరిశోధన నివేదిక జర్నల్‌ న్యూరాలజీలో ప్రచురితమైంది.