ScienceAndTech

రఫేల్ విమానాల ప్రత్యేకతలు

What is so special about Rafael fighter planes?

భారత వాయుసేనలోకి అధునాతన యుద్ధవిమానం రఫేల్‌ చేరింది. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ యుద్ధ విమానాన్ని అధికారికంగా స్వీకరించారు. డసో ఏవియేషన్‌ తయారుచేసిన రఫేల్‌ విమానాలతో భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. 2022 కల్లా మొత్తం 36 విమానాలు భారత్‌కు అందనున్నాయి. భారత్‌ వద్ద రష్యా నుంచి దిగుమతి చేసుకున్న మిగ్‌లు, సుఖోయ్‌లతో పాటు ఇంగ్లాండ్‌ నుంచి అందుకున్న జాగ్వార్‌లు ఉన్నాయి. అయితే సుఖోయ్‌ తప్ప మిగ్‌లు చాలా పాతబడిపోయాయి. మరోవైపు చైనా, పాక్‌ వద్ద అధునాతన యుద్ధ విమానాలున్నాయి. కార్గిల్‌ యుద్ధం అనంతరం శత్రుస్థావరాలపై దాడి చేయాలంటే అధునాతన యుద్ధ విమానాలు ఉండాలని రక్షణ నిపుణులు సూచించారు. దీంతో పొరుగు దేశాలపై ఆధిక్యం సాధించాలన్న లక్ష్యంతో పాటు వాయుసేన ఆధునికీకరణకు కొత్తతరం యుద్ధవిమానాలు అవసరమని కేంద్రం భావించింది. ఇందులో భాగంగానే ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్‌ తయారు చేసే రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

* రెండు ఇంజిన్లు ఉన్న రఫేల్‌ యుద్ధ రంగంలో కీలకపాత్ర పోషించగలదు. దాడుల్లో దీనికి ఎదురుండదు.
* అన్ని రకాల ఆయుధాలను ఇందులో అమర్చవచ్చు. కచ్చితమైన లక్ష్యంతో దాడులు చేయడం దీని ప్రత్యేకత.
* ఆన్‌ బోర్డ్‌లోనే ఆక్సిజన్‌ జనరేషన్‌ సౌకర్యం ఉంది.
* ఎయిర్‌ డిఫెన్స్‌, గస్తీ, దాడులు, నౌకలపై దాడులు చేయడంతో పాటు దాడులను తట్టుకోగలవు.
* ఇప్పటికే ఫ్రాన్స్‌ వాయుసేనతో పాటు ఈజిప్టు, ఖతార్‌లు వీటిని వినియోగిస్తున్నాయి.
* అఫ్గన్‌, లిబియా, మాలి, ఇరాక్‌, సిరియా తదితర దేశాల్లో ఉగ్రవాద శిబిరాలపై జరిపిన దాడుల్లో పాల్గొన్నాయి. 
* సముద్ర మట్టానికి ఎత్తుగా ఉండే స్థావరాలైన లేహ్‌లో కూడా దీన్ని సులభంగా వాడొచ్చు.
* శత్రురాడార్లను కూడా గుర్తిస్తుంది.
* పాక్‌ చేతిలో ఎఫ్‌-16 విమానాలుండగా రఫేల్‌ రాకతో భారత్‌కు ఆధిపత్యం లభిస్తుంది.
* బాలాకోట్‌ దాడుల్లో మిరాజ్‌లు పాల్గొన్నాయి. ఇవి కూడా ఫ్రాన్స్‌కు చెందినవే. అయితే రఫేల్‌ రాకతో భారత్‌కు వాయుసేన రంగంలో మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని రక్షణ నిపుణుల అంచనా.