DailyDose

సాహిత్యంలో ఇద్దరికి నోబెల్‌-తాజావార్తలు-10/10

2019 Literature Nobel Prize Goes To Poland And Austria

* తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విధివిధానాలు ఖరారు చేయాలని సూచించారు. మంత్రివర్గ భేటీలో ప్లాస్టిక్‌ నిషేధంపై చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

* ప్రభుత్వ అసమర్థత వల్లే రాజధాని అమరావతి అభివృద్ధి కుంటుపడిందని తెదేపా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్‌ ఆరోపించారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం రాజధాని అమరావతిని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. తెదేపా హయాంలో అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాతే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని గుర్తు చేశారు. రైతులు కూడా చంద్రబాబు పిలుపు మేరకు 33వేల ఎకరాలను భూసమీకరణకు ఇచ్చారని డొక్కా వివరించారు.

* దేశ ప్రజలు శాంతి, సామరస్యాలతో ఉండాలని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ ఆకాంక్షించారు. గత 15 ఏళ్లుగా నిర్వహిస్తున్న అలాయ్‌ బలాయ్‌ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా హైదరాబాద్‌లోని జలవిహార్‌లో ఘనంగా నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్‌ తమిళి సైతోపాటు పలువురు తెదేపా, కాంగ్రెస్‌, భాజపా నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకమన్నారు. అవినీతి, ప్లాస్టిక్‌ భూతాన్ని దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

* ఆర్టీసీ సమ్మెపై హైకోర్టుకు తమ వాదన వినిపించామని కార్మిక సంఘాల ఐకాస ఛైర్మన్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజారవాణా వ్యవస్థను కాపాడేందుకే తాము ప్రయత్నిస్తున్నామన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పారు. యాజమాన్యం వైఖరే సమ్మెకు దారితీందని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు తమకు నోటీసులు రాలేదని.. వస్తే స్పందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

* చిరంజీవి గురించి మాట్లాడే అదృష్టం తనకు కలిగిందని, ‘సైరా’ లాంటి పెద్ద సినిమా చేయాలంటే ఉండాల్సింది డబ్బులు కాదు.. గుండెల్లో ధైర్యం కూడా ఉండాలని అన్నారు ప్రముఖ నటుడు రాజశేఖర్‌. చిరంజీవి కథానాయకుడిగా ఇటీవల విడుదలైన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. రామ్‌చరణ్‌ నిర్మాత. అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి ‘సైరా’ చిత్రబృందాన్ని ఘనంగా సన్మానించారు.

* జీఎస్టీ వసూళ్లు తగ్గిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జీఎస్టీ వసూళ్లు పెంపు, చట్టంలోని మార్పులను సూచించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 15 రోజుల్లోగా తొలి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. జీఎస్టీ వసూళ్లు 19 నెలల కనిష్ఠానికి చేరిన నేపథ్యంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. 2017లో జీఎస్టీని అమల్లోకి తీసుకొచ్చిన కొన్నాళ్లకే వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో వసూళ్లు కేవలం రూ.91,916 కోట్లకు పరిమితమయ్యాయి.

* పంజాబ్‌ మహారాష్ట్ర కో-ఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంక్‌ కుంభకోణంపై ఆందోళన చేస్తున్న ఆ బ్యాంక్‌ ఖాతాదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసా ఇచ్చారు. ఖాతాదారుల ఆందోళనపై ఆర్‌బీఐ గవర్నర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తనను కలిసిన ఖాతాదారులతో మాట్లాడారు. అంతకుముందు ఆమె భాజపా కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సి ఉండగా.. అక్కడ ఖాతాదారులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో వారిని కలిసి సీతారామన్‌ మాట్లాడారు.

* దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వరుస నష్టాలకు అడ్డుకట్ట వేస్తూ బుధవారం ఒక్కసారిగా ఎగిసిన మార్కెట్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో నేల చూపులు చూశాయి. సెన్సెక్స్‌ 297.55 పాయింట్లు కోల్పోయి 37,880.40 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 78.80 పాయింట్లు కోల్పోయి 11,234 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.03గా ఉంది. గురువారం నాటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోయాయి.

* సాహిత్య రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన ఇద్దరికి నోబెల్‌ పురస్కారాలు వరించాయి. 2018, 2019 సంవత్సరాలకు గానూ ఈ పురస్కారాలను రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ కమిటీ ప్రకటించింది. 2018కి పోలండ్‌ రచయిత్రి ఓల్గా టోకర్చుక్‌కు.. 2019 ఏడాదికి ఆస్ట్రియాకు చెందిన పీటర్‌ హెండ్కేకు ఈ అరుదైన గౌరవం లభించింది.