Politics

కంటి వెలుగు పథకం ప్రారంభించిన జగన్

AP CM YS Jagan Starts Kanti Velugu Scheme

ఏపీలో అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకానికి శ్రీకారం చుట్టింది. తొలి దశ కంటి వెలుగు పథకాన్ని అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. తొలి రెండు దశల్లో 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. నవంబర్‌, డిసెంబర్‌లో సమగ్ర పరీక్షలు చేయనున్నారు. ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించడంతోపాటు కళ్లజోళ్లు వైద్య సదుపాయాలు అందించనున్నారు. అంతేకాకుండా జనవరి 1 నుంచి రాష్ట్రంలో అందరికీ కంటి వెలుగు పథకం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో 2.12 కోట్ల మందికి కంటి సమస్యలున్నాయని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కంటివెలుగు పథకం ప్రారంభం సంధర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంటి సమస్యలు పట్టించుకోకపోతే చూపు కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన పని లేకుండా కంటి పరీక్షలు, చికిత్స చేస్తామని సీఎం వెల్లడించారు. ‘ రూ. 560 కోట్లతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. కంటి పరీక్షలతోపాటు ఉచితంగా కళ్లజోళ్లు అందిస్తాం. దశలవారీగా కంటి పరీక్షలు చేసేందుకు శ్రీకారం చుట్టాం. ఒక్కోదశ ఆరు నెలలపాటు జరుగుతుంది’ అని జగన్‌ అన్నారు. మొదటి, రెండో దశలో కేవలం పిల్లకుల కంటి పరీక్షలు, చికిత్సలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఇవాళ్టి నుంచి అక్టోబర్‌ 16 వరకు మొదటి దశ, ఫిబ్రవరి 1 నుంచి తర్వాతి దశ ‘కంటి వెలుగు’ నిర్వహిస్తామన్నారు. మొదటి దశలో 62,489 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు చేస్తామన్నారు. అంతేకాకుండా అన్ని జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామని సీఎం పునరుద్ఘాటించారు. మొత్తం 2 వేల జబ్బులను ఈ పథకం పరిధిలోకి చేరుస్తామన్నారు.