Editorials

చైనా అందుకే ఆరాటపడుతోంది

China's Troubles Are Pushing It For Discussions-Says Trump

ప్రస్తుతం చైనా కష్ట కాలాన్ని ఎదుర్కొంటోందని, అందుకే అమెరికాతో వాణిజ్యం ఒప్పందం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య మరో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్‌ ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. అమెరికా నుంచి వాణిజ్య వ్యవహారాల ప్రతినిధి రాబర్ట్‌ లైట్జర్‌, ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ మ్యూనిచ్‌, చైనా నుంచి వైస్‌ ప్రీమియర్‌ లు హీలు ఈ చర్చల్లో పాల్గొననున్నారు. ‘చైనాకు ఇది కష్టకాలం. వాళ్లు ఒప్పందం చేసుకునే తీరు సరిలేదు. ఏడాది నుంచి చర్చలు విఫలమవుతూనే ఉన్నాయి. చర్చల్లో భాగంగా మేము కొన్ని అద్భుతమైన డీల్స్‌ను ఆఫర్‌ చేస్తున్నాం. ఎందుకంటే మా ఆర్థిక వ్యవస్థ, మార్కెట్‌ బలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చైనా మాతో ఒప్పందం చేసుకునేందుకు చూస్తోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. చైనాకు అమెరికా నుంచి ఎగుమతయ్యే వస్తువులపై ఆ దేశం విధిస్తున్న బిలియన్ల కొద్దీ డాలర్ల పన్నుల గురించి మాట్లాడుతున్నాం. మేము కూడా భారీగా సుంకాలను పెంచలేదు. పన్నుల రూపంలో వాళ్లు కోట్ల డాలర్ల కొద్దీ సంపద తినేస్తున్నారు. పైగా వాళ్ల నగదు విలువను తగ్గించుకొని లక్షల కొద్దీ డాలర్లను పెంచుకుంటున్నారు. చైనా చర్యల వల్ల ఇప్పటికే 35లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఈ ఒప్పందం వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని అన్నారు.