Business

ఎయిరిండియాకు పెట్రోల్ పోయమంటున్న చమురు సంస్థలు

Indian Fuel Agencies Issues Last Warning To Air India

అప్పుల ఊబిలో కూరుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబరు 18లోపు పెండింగ్‌ రుసుము చెల్లించకపోతే ఇంధన సరఫరా నిలిపివేస్తామని చమురు సంస్థలు హెచ్చరించాయి. ఈ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐవోసీఎల్‌), భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్‌) కంపెనీలు గురువారం ఎయిరిండియాకు లేఖ రాశాయి. గత ఎనిమిది నెలలుగా ఇంధనానికి డబ్బులు చెల్లించలేదని, బిల్లుల విలువ రూ.5వేల కోట్లకు చేరుకుందని ఆగస్టులో ఈ మూడు కంపెనీలు ఎయిరిండియాకు తెలిపాయి. దీంతో కొచి, మొహాలి, పుణె, పట్నా, రాంచీ, విశాఖపట్నం విమానాశ్రయాలకు ఆగస్టు 22న ఇంధన సరఫరా నిలిపివేశాయి. తర్వాత పౌరవిమానయాన శాఖ జోక్యంతో సెప్టెంబర్‌ 7నుంచి మళ్లీ ఇంధన సరఫరా సేవలను పునఃప్రారంభించాయి. ఇప్పుడు తాజాగా మరో హెచ్చరికను జారీ చేశాయి. దీనిపై స్పందించిన ఎయిరిండియా..ఇంధన సరఫరా నిలిపివేయవద్దని పెండింగ్‌ రుసుములు చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఎయిరిండియాలో నెలకొన్న ఈ అనిశ్చితిని పరిష్కరించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది. నష్టాన్ని తగ్గించడానికి ఎయిరిండియాను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ సంస్థ అప్పులు రూ.60వేల కోట్లకు చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్క 2018-19 సంవత్సరంలోనే ఎయిరిండియా రూ.8,400కోట్లు నష్టపోయింది.