DailyDose

ఆర్టీసీ డిపోల వద్ద కార్మికుల మౌనవ్రతం-తాజావార్తలు-10/11

Telangana RTC Employees To Protest Silently At Depots-Telugu Latest Breaking News-10/11

* ఆఫ్రికాలోని కొమొరోస్‌లో పర్యటిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుదైన గౌరవం లభించింది. అక్కడి ప్రభుత్వం కొమొరోస్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ద గ్రీన్‌ క్రెసెంట్‌’ ప్రకటించిది. కొమొరోస్‌ అధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా వెంకయ్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ కొమొరోస్‌ పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.

* ఈఎస్‌ఐ కుంభకోణంలో మరో ముగ్గుర్ని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దీంతో అరెస్టుల సంఖ్య 16కి చేరింది. తాజాగా తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి, చర్లపల్లి డిస్పెన్సరీ ఫార్మాసిస్ట్‌ లావణ్య, వరంగల్‌ జేడీ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి పాషాలను అరెస్ట్‌ చేశారు. మందుల కొనుగోళ్లలో రాజేశ్వర్‌రెడ్డి రూ.28కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. గతంలో అరెస్టైన వెంకటేశ్వర హెల్త్‌కేర్‌ ఎండీ అరవింద్‌ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు ఈ ముగ్గుర్ని అరెస్ట్‌ చేశారు.

* వైఎస్‌ఆర్‌ రైతుభరోసా అర్హుల జాబితాలో ఏపీ మంత్రి పేరు ఉండటంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లకు ఈ పథకం వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రకాశం జిల్లా జాబితాలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పేరు ఉండటంతో విమర్శలు వచ్చాయి. త్రిపురాంతకం మండలం గనపవరం గ్రామ జాబితాలో మంత్రి పేరు కనిపించింది. దీనిపై విమర్శలు రావడంతో మంత్రి సురేశ్‌ స్పందించారు.

* ఆర్టీసీని కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మెకు మద్దతు కోరేందుకు లక్ష్మణ్‌ను కలిసినట్లు తెలిపారు. సమ్మెకు మద్దతు, పోరాటంలో భాగస్వాములం అవుతామని లక్ష్మణ్‌ హామీ ఇచ్చారని చెప్పారు. రేపు అన్ని డిపోల వద్ద కుటుంబ సభ్యులతో మౌనదీక్ష చేస్తామని తెలిపారు.

* చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో ఆ దేశ ఆక్రమణ అంశాన్ని లేవనెత్తాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబల్‌ ప్రధాని మోదీకి సవాల్‌ విసిరారు. అలాగే భారత్‌లో హువావే 5జీకి స్థానం లేదని స్పష్టం చేయాలన్నారు. ‘‘అధికరణ 370 రద్దు విషయంలో ఇమ్రాన్‌కు జిన్‌పింగ్‌ మద్దతుగా నిలుస్తున్నారు. మహాబలిపురంలో భేటీ సందర్భంగా మీ 56అంగుళాల ఛాతి చూపి పీవోకే ప్రాంతంలో చైనా ఆక్రమించుకున్న 5000కి.మీ భూభాగాన్ని వదిలి వెళ్లమని చెప్పండి’’ అని వ్యాఖ్యానించారు.

* అప్పుల ఊబిలో కూరుకున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబరు 18లోపు పెండింగ్‌ రుసుము చెల్లించకపోతే ఇంధన సరఫరా నిలిపివేస్తామని చమురు సంస్థలు హెచ్చరించాయి. ఈ మేరకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐవోసీఎల్‌), భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్‌) కంపెనీలు గురువారం ఎయిరిండియాకు లేఖ రాశాయి.

* పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ శాక్సాఫోన్‌ విద్వాంసుడు కదిరి గోపాల్‌నాథ్‌(69) కన్నుమూశారు. కర్ణాటకలోని మంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంగీత ప్రపంచంలో శాక్సాఫోన్‌తో అద్భుతాలు సృష్టించిన విద్వాంసుడు కదిరి గోపాలనాథ్‌. స్వదేశంలోనే కాకుండా యూరప్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, శ్రీలంక, పశ్చిమాసియా దేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చి అక్కడి సంగీత ప్రియుల నీరాజనాలందుకున్నారు.

* టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ (254*; 336 బంతుల్లో 33×4, 2×6) తన రికార్డులను తానే బద్దలు కొట్టేస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తన అత్యధిక స్కోరు 243ను దాటేశాడు. మరో ఆటగాడు రవీంద్ర జడేజా (91; 104 బంతుల్లో 8×4, 2×6) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. ముత్తుసామి వేసిన 156.3వ బంతిని ఆడిన జడ్డూ డిబ్రూన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ వెంటనే కోహ్లీ తన త్రిశతకం గురించి ఆలోచించకుండా 601/5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు.

* ఒడుదొడుకుల మధ్య స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు దేశీయ మార్కెట్లను నడిపించాయి. అమ్మకాల ఒత్తిడితో ఆరంభంలో కాస్త తడబడినా లోహ, ఐటీ రంగాల షేర్లు రాణించడంతో సూచీలు నిలబడ్డాయి. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 247 పాయింట్లు ఎగబాకి 38,127 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 70 పాయింట్ల లాభంతో 11,305 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.03గా కొనసాగుతోంది.

* బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ ఫోన్‌ నంబర్‌ కోసం ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు కరణ్‌ జోహర్‌కు మెసేజ్‌ చేశానని అన్నారు టాలీవుడ్‌ అర్జున్‌రెడ్డి విజయ్‌దేవరకొండ. ఇటీవల ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మీరు చూసిన సినిమాల్లో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సినిమా ఏది? అని ప్రశ్నించగా.. ‘‘గల్లీబాయ్‌’. ఆ సినిమా చూసిన వెంటనే నేను ఆలియా భట్‌ను అభినందించాలనుకున్నాను. అందుకే ఆ సమయంలో నేను ఆలియా నంబర్‌ కోసం కరణ్‌ జోహర్‌కి మెసేజ్‌ చేశాను. ఆ సినిమా చూశాక నాకు నిద్రరాలేదు.’ అని విజయ్‌ దేవరకొండ తెలిపారు.