Kids

బాలికల పట్ల వివక్ష వద్దు-World Girls Day

Telugu Kids News | Please avoid prejudice against girls - World Girls Day 2019

అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా… ఎక్కడో ఓ చోట విఫలమవుతూనే ఉంటారు. ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంటారు. ఆంక్షలు, కట్టుబాట్లు… ఇలా కారణాలు ఏవైనా… వాటన్నింటినీ పక్కన పెట్టేసి, అమ్మాయి ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో పెరగాలంటే మన వంతుగా ఏం చేయాలో చూద్దామా…

* ఆజ్ఞలు వద్దు: ఆంక్షలు పెడుతూ, ఆదేశిస్తుంటే పిల్లలు పెద్దవాళ్ల మాట వినరు సరికదా వాళ్లమధ్య దూరం పెరుగుతుంది. బదులుగా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించి, చెప్పాలనుకుంటున్న విషయాన్ని సున్నితంగా, అర్థమయ్యేలా తెలియజేయండి. అమ్మాయివి కాబట్టి ఇలానే ఉండాలంటూ ఆజ్ఞలు జారీ చేయకూడదు. ఇష్టాలను గౌరవించి, ప్రోత్సహిస్తూనే పొరపాట్లు చేసినప్పుడు సరిదిద్దేందుకు ప్రయత్నించాలి.
* ఇద్దరూ ఒకటే: ఆడా, మగా… ఇద్దరినీ సమానంగా, ఒకేలా పెంచాలి. ఆడపిల్లలకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని చూసుకుంటామో… అలాగే అబ్బాయిల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా ఉన్నతంగా పెంచే ప్రయత్నం చేయాలి. అమ్మాయిని ‘జాగ్రత్తగా ఉండమ్మా’ అని చెప్పినట్లే… అబ్బాయి వల్ల తప్పులు జరగకుండా ఉండేలా ‘మంచిగా నడుచుకో’ అని చెప్పే బాధ్యతా మనదే.
* దగ్గరకు తీసుకోండి: అమ్మాయిల్లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే చిన్నప్పటి నుంచి వారికోసం పెద్దవాళ్లు కొంత సమయం కేటాయించాలి. తాము అండగా ఉన్నామనే భరోసా కలిగించేందుకు ఆత్మీయ స్పర్శ అందించాలి. ఎన్ని పనులు ఉన్నా ఈ రెండూ తప్పనిసరి. పెద్దవాళ్ల స్పర్శ ఆప్యాయతతోపాటు రక్షణ అందిస్తుంది. అప్పుడే మిగతా ఆకర్షణలకు లోను కారు. పేరున్న స్కూల్లో చదివించడం, ఖరీదైన దుస్తులు, వస్తువులు ఇప్పిస్తే బాధ్యత తీరిపోదు. ప్రేమాభిమానాలను దండిగా అందివ్వాలి. అప్పుడే వారు ఆనందంగా ఉండగలుగుతారు.
* వారికి నచ్చేలా: అమ్మాయిలను కూర్చోబెట్టి క్రమశిక్షణ అలవాటు చేయడం కన్నా… కథల ద్వారా చెప్పి చూడండి. వారికి నచ్చిన విధంగా కథలు చెబుతూ వాటినుంచి విలువలు నేర్పాలి. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను అర్థమయ్యేలా చెప్పాలి. ఆటలు, పాటలు, కవితలు, కథలు, చిత్రలేఖనం… ఇలా వారికి ఇష్టమైన దాన్ని నేర్పిస్తూ… ఉన్నత వ్యక్తిత్వం అలవర్చాలి.
* మార్గదర్శి మీరే: చిన్నారులను ఎలా తయారుచేయాలనుకుంటున్నామో మనం ముందుగా వాటిని పాటించాలి. ముందు మనం మార్గదర్శకులుగా ఉండటానికి ప్రయత్నిస్తే వాళ్లూ అనుసరిస్తారు.
* ఆత్మవిశ్వాసమే ఆయుధంగా: అమ్మాయిలు తమను తాము ప్రేమించుకునేలా చూడాలి. వారిలోని సానుకూల అంశాలను తరచూ గుర్తుచేస్తూ వాటిని పెంచుకునేలా ప్రోత్సహించాలి. సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎలా ఉండాలో వివరించాలి. శారీరకంగా చురుకుగా ఉండేలా చూడాలి. ఆటలు ఆడించాలి. వ్యాయామం చేయించాలి. అవకాశం ఉంటే ఏదైనా ఆత్మరక్షణ విద్యలో తర్ఫీదు ఇప్పిస్తే మరీ మంచిది. ఇది వారిలో ధైర్యాన్ని పెంచుతుంది. అప్పుడే వారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు.