DailyDose

హరిద్వార్‌లో గంగా ఆరతిలో పాల్గొన్న పవన్-తాజావార్తలు-10/12

Pawan Kalyan Attends Ganga Aarati In Haridwar-Telugu Latest Breaking News-10/12

* 36 గంటల దీక్ష కొనసాగిస్తున్న మాజీమంత్రి కొల్లు రవీంద్ర. మచిలిపట్నం తన నివాసంలోనే 36 గంటల దీక్ష కొనసాగిస్తున్న మాజీమంత్రి కొల్లు రవీంద్ర. ఇసుక కొరతపై గాంధీ అహింసా మార్గంలో దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాము. జగన్ నియంతలా మారి ప్రజావ్యతిరేక విదానాలతో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఇవాళ రాష్ట్రంలో ఇసుక లేక అసంఘటిత కార్మికులు పస్తులుంటున్నారు.

* భార‌త్ ఇచ్చిన ఆతిథ్యాన్ని తెగ ఎంజాయ్ చేసిన‌ట్లు చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ తెలిపారు. ఇవాళ ప్ర‌ధాని మోదీతో క‌లిసి ఆయ‌న చెన్నైలో జ‌రిగిన భేటీలో పాల్గొన్నారు. ఆ త‌ర్వాత మాట్లాడుతూ మీరు ఇచ్చిన ఆతిథ్యం మ‌మ్మ‌ల్ని అమితానందానికి గురి చేసింద‌ని జిన్‌పింగ్ చెప్పారు.

* కాలిఫోర్నియా ప్రజలను కార్చిచ్చు వణికిస్తోంది. గురువారం సాయంత్రం సిల్మర్​ ప్రాంతంలో మొదలైన దావానలం బీభత్సంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణ కాలిఫోర్నియాలో వేలాది ఇళ్లను ఖాళీ చేయాలని ప్రజలను కోరారు. దాదాపు లక్ష మందికిపైగా ప్రభావితమయ్యారు. గంటకు 800ఎకరాల మేర వ్యాపిస్తున్న కార్చిచ్చును ఇప్పట్లో అదుపు చేయలేమని అధికారులు చెబుతున్నారు. మరో ఆలోచన లేకుండా ప్రజలంతా తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని కోరారు.

* హరిద్వార్‌ పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ ఉదయం జరిగిన పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు. గంగా ప్రక్షాళనకు ఆయన మద్దతు ప్రకటించారు. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలు, సంస్కృతిని పరిరక్షించేందుకు గంగానది కాలుష్యానికి గురికాకుండా తీసుకోవాల్సిన అంశాలపై స్థానికులతో చర్చించారు.

* మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సీరియస్‌గా కబుర్లు చెప్పుకోవడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏపీ నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఈ దృశ్యం కంటపడింది. వివరాల్లోకి వెళితే.. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కపిల్.. ఏపీకి వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో చంద్రబాబు, కపిల్ దేవ్ ఇద్దరూ ఒకే విమానంలో హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ప్రస్తుత రాజకీయాలతో పాటు అమరావతిలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబును కపిల్ ఆరా తీసినట్టు సమాచారం.

* తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. సమ్మెను మరింత ఉద్ధృతం చేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస కార్యాచరణ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 19న తెలంగాణలో బంద్‌ పాటించాలని పిలుపునిచ్చింది.

* తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులు మరో వారంపాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

* తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బస్‌ భవన్‌ ఎదుట భాజపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కల్యాణమండపం నుంచి బస్‌భవన్‌ వరకు భాజపా శ్రేణులు, ఆర్టీసీ ఐకాస నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకుంటుండగా లక్ష్మణ్‌ కంటికి స్వల్పగాయమైంది. అనంతరం చికిత్స కోసం ఆయన నిమ్స్‌కు బయలుదేరారు.

* సమ్మె చేస్తున్న వారితో ఇకపై ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపబోదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను పూర్తిస్థాయిలో నడపాలని అధికారులను ఆదేశించారు. కండక్టర్లు, డ్రైవర్లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకోవాలని.. అద్దె బస్సులకు త్వరగా నోటిఫికేషన్‌ జారీ చేయాలని సీఎం సూచించారు.

* తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ మందుల కుంభకోణం కేసులో మరో నలుగురిని అవినీతి నిరోధకశాఖ (అనిశా) అధికారులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఈఎస్‌ఐ ఆర్సీపురం ఆస్పత్రి సీనియర్‌ అసిస్టెంట్‌ సురేంద్రబాబు, నాచారం ఆస్పత్రి ఫార్మాసిస్ట్‌ నాగలక్ష్మి, లైఫ్‌కేర్‌ ఎండీ సుధాకర్‌రెడ్డి, వెంకటేశ్వర హెల్త్‌కేర్‌ ఎండీ అరవింద్‌రెడ్డిలను తమ అదుపులోకి తీసుకున్నారు. నలుగురినీ రెండ్రోజుల పాటు విచారించనున్నారు.

* జమ్ముకశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోస్ట్‌పోయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.

* భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 2018-19 అసెస్‌మెంట్‌ సంవత్సరంలో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య 97,689కు చేరింది. ఈ విషయాన్ని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో వీరి సంఖ్య 81,344 మాత్రమే ఉంది. ఏడాదిలో దాదాపు 20శాతం వృద్ధిని సాధించింది.

* సౌదీ అరేబియా, ఇరాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరిన్ని అదనపు సైనిక బలగాల్ని సౌదీకి పంపుతున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. అందులో భాగంగా సైనికుల్ని, ఆయుధ సామగ్రిని సౌదీకి చేర్చుతున్నామన్నారు. ఇరాన్‌ నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సౌదీ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగానే తాజా నిర్ణయం తీసుకున్నామన్నారు.

* ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సరైన తనిఖీలు చేయకుండానే డిపోల నుంచి బస్సులను బయటకు పంపిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం. నార్కట్‌పల్లి నుంచి నల్గొండ వైపు వెళ్తున్న నార్కట్‌పల్లి డిపో బస్సు ఎల్లారెడ్డి గూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు వెనక చక్రాలు రెండు ఊడిపోయాయి. ఆ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.

* ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్పష్టం చేశారు.‘‘ పల్నాడు ప్రాంతంలో పరిస్థితి దిగజారిందని ఓ పార్టీ ఆరోపణలు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీపీ ఆదేశించారు. గతంలో 8 హత్యలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అవి రాజకీయ హత్యలు కావు. రౌడీ గ్రూపుల దాడులు’’ అని రవిశంకర్‌ మీడియాతో అన్నారు.

* ఎన్నో వివాదాస్పద పరిణామాల అనంతరం దిల్లీకి చెందిన ఆప్‌ నాయకురాలు అల్కాలంబా ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. శనివారం కాంగ్రెస్‌ నాయకులు పీసీ చాకో సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. సెప్టెంబర్‌ 6న అల్కాలంబా కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిసిన అనంతరం ఆప్‌ నుంచి వైదొలగాల్సిన సమయం ఆసన్నమైందంటూ ట్విటర్‌ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే.