NRI-NRT

సింగపూర్‌లో వైభవంగా శ్రీనివాస కళ్యాణం

TNILIVE Singapore Latest Telugu News - TNILIVE Singapore Latest Telugu News | TTD Sreenivasa Kalyanam In Singapore 2019 - సింగపూర్‌లో వైభవంగా శ్రీనివాస కళ్యాణం

శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని నేడు విశ్వ వ్యాప్తంగా ఆరాధిస్తున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సింగపూర్‌లో ప్రవాస తెలుగు ప్రజలు నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శనివారం అక్కడి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ ఇతర దేశాల్లోని తెలుగు ప్రజలు ఇలాగే శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని అభిలషించారు. దేశం విడిచి వచ్చినా మన సంప్రదాయాలు, సంస్కృతిని మరచిపోకుండా వీధివీధినా శ్రీనివాసుడి ఆలయాలు నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. తిరుమలలో శ్రీవారి కల్యాణాన్ని అందరూ తిలకించలేరు. విదేశాల్లోనూ నిర్వహించి ఆ అనుభూతిని అందరికీ పంచడం ఆనందదాయకమన్నారు. లోక కల్యాణం కోసం, సర్వ జనుల సుఖసంతోషాల కోసం శ్రీనివాస కళ్యాణాలు మరిన్ని దేశాల్లో నిర్వహణకు టీటీడీ కృషి చేస్తుందని వైవీ తెలిపారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిగారి మార్గదర్శకాలతో మన దళిత గిరిజన వాడల ప్రజలూ స్వామి ఆశీస్సులు పొందేందుకు ఆలయాలు నిర్మించి కల్యాణాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటిదాకా వీఐపీ, వీవీఐపీ దర్శనాల పేరుతో దళారులు భక్తులను దోచుకున్నారు. దాన్ని అరికట్టేందుకు టీటీడీలో ప్రొటోకాల్‌, నాన్‌ ప్రొటోకాల్‌ దర్శనాలు చేపట్టి సామాన్య భక్తుడు క్యూలో వేచి ఉండే సమయాన్ని 16 గంటల నుంచి ఎనిమిది గంటలకు తీసుకొచ్చినట్లు వివరించారు. సింగపూర్‌ నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా దర్శనాన్ని బుక్‌ చేసుకోవాలని సూచించారు. తిరుమల వచ్చే ఎన్‌ఆర్‌ఐ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే స్పందిస్తానన్నారు. టీటీడీ ద్వారా ఇంకా మెరుగైన వసతులు కల్పించేందుకు పాలకమండలి కృషి చేస్తున్నట్లు సుబ్బారెడ్డి వివరించారు. వైవీ సతీమణి స్వర్ణలతారెడ్డితోపాటు తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సింగపూర్‌ కమ్యూనికేషన్స్‌, ఐటీ శాఖ మంత్రి ఈశ్వరన్‌ పాల్గొన్నారు.