Business

కొత్తగా ₹31వేల కోట్లు అప్పు చేయనున్న ఏపీ

Andhra To Take Another 31000 Crores Loan

2019-20 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా దాదాపు 31వేల కోట్ల రూపాయలకుపైగా అప్పు చేయాల్సి ఉంటుందని బడ్జెట్‌ అంచనాల్లో పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి రాష్ట్ర అప్పుల మొత్తం 2లక్షల 91 వేల 345 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా.

అయితే తొలి ఆరునెలల్లోనే అప్పుల వాటా అంచనాల్లో సగం దాటడం కలవరపెడుతోంది.

బహిరంగ మార్కెట్‌ నుంచి నికరంగా 14వేల 168 కోట్ల రూపాయల అప్పు తీసుకోగా…. పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా 5వేల కోట్ల రూపాయలు, ఏపీ ట్రాన్స్‌కో ద్వారా మరో 2వేల 250 కోట్ల రూపాయల రుణం పొందినట్టు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు కేంద్రం నుంచి రావట్లేదు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఖర్చు చేసిన 5వేల 500 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది.

గతేడాది జులై తర్వాత పోలవరానికి సంబంధించిన నిధులు కేంద్రం నుంచి విడుదల కాలేదు.

3వేల 500 కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర జల్‌శక్తి నుంచి ప్రక్రియ పూర్తి చేసుకుని ఆర్థికశాఖకు ప్రతిపాదనలు వెళ్లినా ఇంతవరకూ దానిపై ఎలాంటి స్పందనా లేదు.

కేంద్రం అడిగిన అన్ని సందేహాలకు మాత్రం తాము సమాధానం ఇచ్చినట్టు రాష్ట్ర అధికారులు చెబుతున్నారు.