NRI-NRT

నేతన్నకు ఊతం-తానా ఆసు యంత్రం

KTR & TANA Reps Donate ASU Machines To Pochampally Weavers In Hyderabad-నేతన్నకు ఊతం-తానా ఆసు యంత్రం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్, తెలంగాణా ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి చేనేత రంగానికి తోడ్పాటును అందించే సదుద్దేశంతో సబ్సిడీ ధరకు ఆసు యంత్రాలను పంపిణీ చేసే నిమిత్తం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం నాడు మొదటి విడతగా ఆసు యంత్రాలను పోచంపల్లి చేనేత కార్మికులకు తెలంగాణా ఐటీ, జౌళీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశం రూపొందించిన ఈ ఆసు యంత్రం ఖర్చులో 50శాతాన్ని తానా, 25శాతాన్ని తెలంగాణా ప్రభుత్వం, మిగతా 25శాతాన్ని నేతన్నలు భరిస్తారు. ఒక్కొక్క ఆసు యంత్రానికి సుమారు $400 డాలర్లు ఖర్చు అవుతుంది. తెలంగాణావ్యాప్తంగా 1000 ఆసు యంత్రాలను పంపిణీ చేసే లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామని కార్యక్రమంలో పాల్గొన్న తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తెలిపారు. తానా ఆధ్వర్యంలో జరుగుతున్న పలు సేవా కార్యక్రమాలను కేటీఆర్‌కు జయశేఖర్ వివరించారు. తానా ఫౌండేషన్ ఛైర్మన్ శృంగవరపు నిరంజన్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ ఆసు యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని న్యూజెర్సీకి చెందిన ప్రవాసాంధ్రుడు కసుకుర్తి రాజా, కొలంబస్‌కు చెందిన మరో ప్రవాస తెలంగాణీయుడు సామినేని రవిలు సమన్వయపరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తానా, తానా ఫౌండేషన్, తానా టీంస్క్వేర్‌ల సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, తానా ఫౌండేషన్ కోశాధికారి వల్లేపల్లి శశికాంత్, ప్రవాసులు ఉప్పులూరి రేఖ తదితరులు పాల్గొన్నారు.