Health

బీరు సేవయామి – అకాల మరణ ప్రాప్తిరస్తు.

Drinking 9Glasses Of Beer Per Week Will Kill You Abruptly

నిత్యం మితంగా మద్యం లేదా వైన్‌ సేవిస్తే పదికాలాల పాటు ఆరోగ్యం పదిలంగా ఉంటుందని పలు అథ్యయనాలు వెల్లడైనా తాజా అథ్యయనం మద్యం ప్రియులకు షాక్‌ ఇస్తోంది. వారానికి కేవలం 100 గ్రాములు అంటే దాదాపు ఐదు గ్లాసుల వైన్‌, 9 గ్లాస్‌ల బీర్‌ను పుచ్చుకున్నా అకాల మరణం తప్పదని మెడికల్‌ జర్నల్‌ ది లాన్సెట్‌ స్పష్టం చేసింది. 19 దేశాల్లోని ఆరు లక్షల మంది మందు ముచ్చట్లను పరిశీలించిన మీదట ఈ పరిశోధన వివరాలు వెల్లడయ్యాయి. మద్యాన్ని ఎక్కువగా సేవించే వారు స్ర్టోక్‌, గుండె వైఫల్యం వంటి తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే ముప్పు అధికంగా ఉందని ఈ పత్రిక తేల్చింది. ఇక వారానికి 200 గ్రాముల నుంచి 350 గ్రాములు అంటే వారానికి 10 నుంచి 18 గ్లాసుల వరకూ వైన్‌, 20 నుంచి 40 గ్లాసుల వరకూ బీరును తీసుకునేవారు సగటు జీవిత కాలంలో రెండేళ్లకు ముందే మృత్యువాతన పడతారని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మద్యం సేవించడంపై ఉన్న అధికారిక గైడ్‌లైన్స్‌ను సవరించాల్సిన అవసరం ఉందని ది లాన్సెట్‌లో ప్రచురితమైన అథ్యయనం తెలిపింది. ఇక ప్రతివారం ఆరు గ్లాస్‌ల వైన్‌, అదే మోతాదులో బీర్‌ను తీసుకోవాలని, అంతకు మించి మద్యం సేవించడం ఆరోగ్యానికి చేటని బ్రిటన్‌ ఇటీవల తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. మరోవైపు మహిళలు తగిన మోతాదులో రోజుకు ఒక డ్రింక్‌, పురుషులు రోజుకు రెండు సార్లు మితంగా మద్యం తీసుకోవచ్చని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) గైడ్‌లైన్స్‌ పేర్కొంటున్నాయి.