DailyDose

కల్కి ఆశ్రమాల్లో ₹9కోట్ల విదేశీ కరెన్సీ-పరరీలో దంపతులు

Kalki Couple Goes Missing-9Crores Illegal Foreign Currency Found In Ashram

కల్కి భగవాన్‌ ఆశ్రమాల్లో మూడో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, ఏపీలోలోని పలు ప్రాంతాలు సహా చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో ఈ ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. రెండ్రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో రూ.33కోట్ల విలువైన నగదు పట్టుబడిందని, ఇందులో రూ.24కోట్ల భారత కరెన్సీ, రూ.9కోట్ల విదేశీ కరెన్సీ ఉందని సమాచారం. ఇక ఏపీ, తమిళనాడు సహా ఆఫ్రికా దేశాల్లో భారీగా ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారని అంటున్నారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలోని ఆశ్రమం చుట్టూ భారీగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది. ఒక్క తమిళనాడులోనే వెయ్యి ఎకరాలకు పైగా భూములున్నట్లు గుర్తించారు. అయితే ఇప్పుడు కల్కి భగవాన్ ఆశ్రమం, ఆస్తులపై ఐటీ దాడులు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడే ఎందుకు దాడులు చేశారు అనే విషయమై పలు వాదనలు వినిపిస్తున్నాయి. దీని వెనుక రాజకీయ కారణలేమైనా ఉన్నాయా? లేక ఎవరైనా ఉప్పందించారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కల్కి ఆశ్రమం నుంచి పెద్దఎత్తున నగదు విదేశాలకు తరలిపోతోందన్న ఆరోపణలు రావడంతోనే ఐటీ అధికారులు దాడులు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కల్కిభగవాన్‌ దంపతులు అజ్ఞాతంలోనే ఉన్నారు. మరోవైపు వారికి చెందిన ఆశ్రమాలు, వ్యాపార సంస్థలపై రెండోరోజైన గురువారం ఆదాయం పన్ను (ఐటీ) అధికారుల దాడులు కొనసాగాయి. దక్షిణాది రాష్ట్రాలలో 40 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. హైదరాబాద్‌లోని స్ట్టూడియో ఎన్‌ కార్యాలయంతోపాటు డబ్ల్యూఎల్‌ స్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఫిల్మ్‌నగర్‌లోని కల్కిభగవాన్‌ కుమారుడు కృష్ణకు చెందిన ఆస్తులతోపాటు, ఆయన వ్యాపార భాగస్వాములపై కూడా ఐటీ దాడులు జరిగాయి. స్థానిక ఐటీ అధికారుల సహకారంతో చెన్నైకి చెందిన అధికారుల బృందం ఈ సోదాలు నిర్వహించింది. మణికొండలోని పంచవటి కాలనీలో ఉన్న స్ట్టూడియో ఎన్‌ చానల్‌ను నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ నార్నే శ్రీనివాసరావు నుంచి 2014లో కల్కి భగవాన్‌ కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఈ సంస్థలో తనిఖీలు చేశారు.

కల్కిభగవాన్‌ ఆశ్రమం ఐదెకరాల నుంచి ప్రారంభమై వేలాది ఎకరాలకు విస్తరించింది. ఆశ్రమంలో దాదాపు 1500 మందికిపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి ఏటా సిబ్బందికి జీతభత్యాలు చెల్లిస్తూ క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తూ, ఐటీ రిటర్న్‌ దాఖలు చేస్తున్న కల్కిభగవాన్‌ గత మూడేండ్లుగా పన్నులు చెల్లించడం లేదని, ఐటీ రిటర్న్స్‌ కూడా దాఖలు చేయడం లేదని సమాచారం. అలాగే సంస్థలకు ఉన్న కల్కి పేరును కూడా మార్చారు. ‘ఏకం’తో పాటు పలురకాల కంపెనీలు, ట్రస్టీల పేర్లతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు కల్కి ఆశ్రమంపై నిఘా పెట్టారు. చెన్నైలోని ప్రధాన కార్యాలయంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అనుబంధ ఆశ్రమాలు, కార్యాలయాలు, భూముల కొనుగోళ్లు, విరాళాల సేకరణలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది.

చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలోని కల్కిభగవాన్‌కు చెందిన ప్రధాన ఆశ్రమం తమిళనాడు పోలీసుల పహారాలో ఉన్నది. అజ్ఞాతంలోకి వెళ్లిన కల్కిభగవాన్‌, ఆయన భార్య పద్మావతి రెండో రోజుకూడా బయటకు రాలేదు. చెన్నైలోని నుంగంబాకం ప్రధాన కార్యాలయంలో కల్కిభగవాన్‌ కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. వరదయ్యపాలెం, బీఎన్‌ కండ్రిగ మండలాల్లో ఉన్న ఆశ్రమాల నిర్వాహకుడు లోకేష్‌దాసాజీతో పాటు మరికొంత మంది సిబ్బందిని కూడా రహస్యంగా విచారించారు. ఈ విచారణలో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తుల సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసింది. బినామీల పేరుతో వేల ఎకరాల భూముల అమ్మకాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు సుమారు రూ.40 కోట్ల భారతీయ, విదేశీ నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

2008లో వరదయ్యపాలెం బత్తల వల్లంలో నిర్మించిన ‘గోల్డెన్‌సిటీ’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మృతిచెందగా, అనేక మంది గాయపడ్డారు. దీంతో కొన్ని రోజులు ఆశ్రమం మూతపడింది. తిరిగి కొన్నాళ్లకు ఆశ్రమ కార్యకలాపాలు ప్రారంభించినా, వివాదాలు పెద్దఎత్తున రావడంతో కల్కి పేరును మార్చినట్లు తెలిసింది. కల్కి ఆలయాన్ని గోల్డెన్‌ సిటీగా, ఆ తరువాత ‘వన్నెస్‌’గా మార్చారు. ప్రస్తుతం ‘ఏకం’ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కల్కి ట్రస్ట్‌ పేరుతో జరిపే ఆర్థిక లావాదేవీలను కొన్నాళ్లకు ‘గోల్డెన్‌ షెల్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది.