NRI-NRT

తాతగారికి సత్యాగ్రహాన్ని నేర్పింది మా నాయినమ్మే-ఇలా గాంధీ

తాతగారికి సత్యాగ్రహాన్ని నేర్పింది మా నాయినమ్మే-ఇలా గాంధీ-Ela Gandhi In Mahatma Gandhi's 150th Birthday Celebrations By MGMNT In Dallas Texas USA

ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందనేది అసత్యమని నిరూపిస్తూ గాంధీజితో సమానంగా ఆయన పక్కనే నడుస్తూ లేదా ఆయన కంటే ఓ అడుగు ముందులోనే ఉంటూ కస్తుర్బా గాంధీ మహాత్మునికి సత్యాగ్రహంతో పాటు మరెన్నో విషయాల్లో మూలవిద్యగా తోడ్పాటును అందించారని మహాత్మా గాంధీ మనవరాలు ఇలా గాంధీ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం డల్లాస్‌లోని పార్క్‌ప్లాజాలో ఉత్తర టెక్సాస్ మహాత్మా గాంధీ మెమొరియల్(MGMNT) ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్ముని 150వ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మహాత్ముని జీవిత గాథలపై గాక ఆయన సతీమణి కస్తుర్బా గాంధీ జీవితంపై చక్కని ప్రదర్శనతో కూడిన ప్రసంగాన్ని వినిపించారు. 13ఏళ్ల వయస్సులో గాంధీజిని వివాహం చేసుకున్న కస్తుర్బా ఏనాడూ బడికి పోలేదని, గాంధీజి చొరవతో ఆయన శిక్షణలోనే విద్యాభ్యాసం చేసిన కస్తుర్బా భర్తతో కలిసి దక్షిణాఫ్రికా వలస వెళ్లాక అక్కడి భారతీయులకు వ్యతిరేకంగా అమలులో ఉన్న జాతి వివక్ష చట్టాలపై ఆమె చేసిన పోరాటాలు, 1942-44 మధ్య కాలంలో ఆమె జీవిత చివరి దశలో బాపూజీతో కలిసి గడిపిన జైలు జీవితంపై ఇలా గాంధీ ప్రసంగిస్తూ పలు చిత్రాలను ప్రదర్శించారు. బాహ్యప్రపంచానికి గాంధీజి మహాత్ముడేమో గానీ, ఇంట్లో మాత్రం ఆమె శక్తిమంతురాలని, బాపూజీకి సత్యాగ్రహాన్ని దాని శక్తిని పరిచయం చేసిన తొలి వ్యక్తి కస్తుర్బా అని ఇలా గాంధీ పేర్కొన్నారు. మహిళా చైతన్యం, మహిళా సాధికారత వంటి అంశాల పట్ల ఆ రోజుల్లోనే ఎంతో అవగాహన కలిగిన తన నాయినమ్మ కస్తుర్బా గాంధీ నేటి మహిళలకు తప్పక ఆదర్శంగా నిలుస్తుందని ఇలా గాంధీ ఆశాభావం వ్యక్తపరిచారు. అనంతరం ఆమెను MGMNT కార్యవర్గం ఘనంగా సత్కరించింది.

* అహింసయే శాంతి – శాంతియే శక్తి – శక్తియే ఆనందం – ఆనందమే ఐకమత్యం
ఇలా గాంధీ ప్రసంగానికి పూర్వం MGMNT ఛైర్మన్ డా.తోటకూర ప్రసాద్ ప్రసంగిస్తూ సోషల్ మీడియాలు, వైరల్ వీడియోలు లేని రోజుల్లో కోట్ల మందిని అహింసా, సత్యాగ్రహం, క్రమశిక్షణ వంటి శాంతియుతమైన నినాదాలతో కదిలించిన మహిమాన్వితుడు మహాత్మా గాంధీ అని, ఆయన 150వ జయంత్యుత్సవాలను డల్లాస్‌లో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. నోబెల్ విజేతలకు, దేశాధినేతలకు, ప్రపంచ ప్రముఖులు ఎందరికో గాంధీజి సిద్ధంతాలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఇండో అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్(IAFC), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(IANT) సంయుక్త సహకారంతో నాలుగన్నరేళ్లు అర్వింగ్ నగరంతో చర్చించి గాంధీజి స్మారకస్థలిని అర్వింగ్‌లో ఏర్పాటు చేశామని, దీనికి లక్షల డాలర్లు విరాళాలు అందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా దాత రమేశ్ భాటియా, కల్పనా భాటియాల్ను సత్కరించారు. గాంధీజి ఆశయాలు, ఆదర్శాలు మరో 150ఏళ్లు విరాజిల్లుతాయని పేర్కొన్నారు. ఏపీ శాసనసభ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అహింసతోనే శాంతి సాధ్యమని, గాంధీజి సిద్ధంతాలు ఎల్లవేళలా ఆదర్శనీయమని వెల్లడించారు. గాంధీజి నిర్దేశించిన మార్గంలో అందరూ నడవాలని తద్వారా ఐకమత్యం భాసిల్లుతుందని అన్నారు. పుదుచ్చెరి ఆరోగ్య శాఖా మంత్రి మల్లాది కృష్ణారావు మాట్లాడుతూ ₹11కోట్ల వ్యయంతో పుదుచ్చేరిలో గాంధీజి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, గాంధీ పార్కుగా పిలవబడే ఈ ప్రాంతాన్ని జనవరిలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. స్టాన్‌ఫోర్డ్ ప్రొఫెసర్ డా.క్లేబోర్న్ కార్సన్ మాట్లాడుతూ గాంధీజి జీవితాన్ని అనుసరించి అందరూ శాంతియుత జీవితాన్ని ఆస్వాదించాలని కోరారు. డా.గొల్లనపల్లి ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. నృత్యశక్తి డ్యాన్స్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యరూపకం ఆకట్టుకుంది. శిల్పి డా. బొర్రా శివను సత్కరించారు. ఈ కార్యక్రమంలో MGMNT బోర్డు సభ్యులు బి.ఎన్.రావు, జాన్ హామేండ్, రావు కల్వాల, టయాబ్ కుండావాల, పియూష్ పటేల్, అక్రం సయెద్, కమల్ కౌశిల్, అభిజిత్ రాయల్కర్, మురళి వెన్నం, రన్నా జాని, ఆనంద్ దాసరి, డా. సత్ గుప్తా, శ్రీకాంత్ పోలవరపు, షబ్నం మోడ్గిల్, గుత్తా వెంకట్, మల్లవరపు అనంత్, మద్దుకూరి చంద్రహాస్, రమణ జువ్వాడి, కాజా సురేష్, డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కోడూరి కృష్ణారెడ్డి, TPAD అధ్యక్షుడు పోలీస్ చంద్రా రెడ్డి, వీర్నపు చినసత్యం, డా.అడుసుమిల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.