Kids

నిజాయితీ నిబద్ధత నేర్పుతుంది ఖురాన్-తెలుగు చిన్నారుల కథ

Integrity And Honesty Is A Good Trait-Telugu Kids Moral Stories

ఇమామ్‌ అహ్మద్‌ బిన్‌ హంబల్‌ శిష్యుడు ఒకరు ఒక్క రాత్రిలో ఖుర్‌ఆన్‌ గ్రంథమంతా పారాయణ చేసేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఇమామ్‌కు ఆ పద్ధతి నచ్చలేదు. శిష్యుడిని పిలిపించి ‘‘నువ్వు రాత్రంతా దైవారాధనలో ఉండి ఖుర్‌ఆన్‌ పూర్తిచేస్తావని తెలిసింది. ఎంతవరకు నిజం?’’ అని అడిగారు ఇమామ్‌.
‘‘అవును గురువు గారూ…’’ అన్నాడు శిష్యుడు.
‘‘ఈ రోజు రాత్రి నాకు అప్పజెబుతున్నట్లుగా ఖుర్‌ఆన్‌ చదువు’’ అన్నారు ఇమామ్‌.
చీకటి పడింది. దైవారాధన చేసేందుకు నమాజులో నిల్చోగానే ఇమామ్‌ చెప్పిన మాట గుర్తొకొచ్చింది. గురువు గారు తన ముందుండి వింటున్నట్లుగా ఊహించుకుని ఖుర్‌ఆన్‌ చదవడం మొదలెట్టాడు. రాత్రంతా అతని పారాయణం ఎంతో తృప్తిగా సాగింది. తెల్లారింది. అప్పుడే వచ్చిన తన శిష్యుడిని ‘‘రాత్రి పారాయణం ఎలాసాగింది’’ అని అడిగారు ఇమామ్‌. ‘‘రోజూలాగే తెల్లారే వరకూ చదివాను కానీ సగం కూడా పూర్తి చేయలేకపోయాను’’ అని జవాబిచ్చాడు శిష్యుడు.
‘‘ఈ రోజు నువ్వు ఖుర్‌ఆన్‌ చదివే మాటయితే ముహమ్మద్‌ ప్రవక్త మహనీయులు (సఅసం) స్వయంగా వచ్చి వింటున్నట్లుగా ఊహించుకుని చదువు’’ అని చెప్పారు. శిష్యుడు సరేనన్నాడు. సాయంత్రం దైవారాధనలో లీనమైపోయాడు. దైవ ప్రవక్త (స) వచ్చి తన ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని వింటున్నట్లుగా ఎంతో అణకువతో, మధురమైన స్వరంతో పారాయణం చేశాడు.’ తెల్లారాక ఇమామ్‌ గారు తనదగ్గరికి వచ్చిన శిష్యుడిని రాత్రి పారాయణం ఎలా సాగిందని అడిగారు. దానికి శిష్యుడు ‘‘గురువు గారూ ఒకే ఒక్క అధ్యాయం పూర్తిచేయగలిగానండి’’ చెప్పాడు.
‘‘ఈ రోజు మాత్రం నువ్వు అల్లాహ్‌ దర్బారులో నిల్చొని ఖుర్‌ఆన్‌ చదువుతున్నట్లుగా భావించుకుని చదువు’’ అని చెప్పారు. గురువు గారికి ఎంతో విలువిచ్చే శిష్యుడు ఆ రోజు రాత్రి కూడా ఖుర్‌ఆన్‌ పారాయణానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. అల్లాహ్‌ దర్బారులో హాజరయినట్లుగా భావించుకున్నాడు. వినయ, వినమ్రతలు ఉట్టిపడేలా నిల్చొని ఎంతో మధురమైన కంఠ స్వరంతో ఖుర్‌ఆన్‌ పారాయణం మొదలెట్టగానే దైవభీతితో కళ్లల్లో అశ్రువులు. కంపించిపోసాగాడు.
తెల్లారింది ‘‘రాత్రి ఎంతవరకు చదివావు’’ అన్న గురువుగారి ప్రశ్నకు ‘‘గురువు గారూ; నేను ఎంతో ఉత్సాహంతో ఖుర్‌ఆన్‌ పారాయణానికి పూనుకున్నాను. కానీ; తెల్లవారుఝామున ఫజర్‌ నమాజుకోసం అజాన్‌ అయింది కానీ ఖుర్‌ఆన్‌ లోని మొదటి సూరా (పాఠం) సూరె ఫాతిహా కూడా పూర్తిగా చదవలేకపోయాను’’ అని అన్నాడు. ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని ఏదో మొక్కుబడిగా చిలకపలుకుల్లా వల్లెవేసుకోకూడదన్నది ఈ గాథలోని నీతి. అరబీలో ఉన్న ఖుర్‌ఆన్‌ వాక్యాల భావాన్ని అర్థం చేసుకుంటూ చదివితే చక్కని నీతి, నడవడికలు అలవడుతాయి. దేవుడు చూస్తున్నాడన్న తలంపుతో ఏ పనైనా చేస్తే నిజాయతీ, నిబద్ధత అలవడుతుంది.
– ఖైరున్నీసాబేగం