Sports

ఆ వార్త విని నాకు చెమట పట్టింది

Kapildev Recalls His Captaincy Announcement Times For 1983 World Cup

టీమిండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ తనకు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సందర్భాన్ని తాజాగా గుర్తు చేసుకున్నారు. ఎంతో బరువుతో కూడిన బాధ్యతను మీద పెట్టినట్లు భావించానని చెప్పకొచ్చారు. ‘ హఠాత్తుగా విన్న కొన్ని వార్తలు తొలుత భయాన్ని కలిగిస్తాయి. తర్వాత వాటి గురించి ఆలోచిస్తాం. 23 ఏళ్ల వయసున్నప్పుడు నాకు టీమిండియా సారథి బాధ్యతలు అప్పగించారు. తొలుత ఎంతో భయపడ్డాను. తర్వాత సంతోషంగా అనిపించింది. సీనియర్‌ ఆటగాళ్లను నేను ఎలా మేనేజ్‌ చేయగలననే సందేహం నాలో మొదలైంది. కానీ తర్వాత నాకు నేనే సర్దిచెప్పుకొన్నాను. నా మీద నమ్మకం ఉండబట్టే కదా నన్ను సారథిని చేశారనే ఆలోచన వచ్చింది. నా క్రికెట్‌ హీరోలు నా సారథ్యంలో ఆడుతున్నారు. నాతో ఆడుతున్నారన్న భావన ఎంతో గర్వంగా అనిపించింది. కానీ, అది నాకెంతో క్లిష్టమైన సమయం’ అని కపిల్ తెలిపారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘83’ సినిమాలో కపిల్ పాత్రను రణవీర్‌ సింగ్‌ పోషించడం పై మాట్లాడాల్సిందిగా ఆయన్ని కోరగా..‘అది నా జీవిత కథ కాదు.. 1983లో భారత జట్టు ప్రపంచ కప్‌ను ముద్దాడిన సందర్భం ఆధారంగా తెరకెక్కుతున్నది. ఇక నా పాత్రను రణ్‌వీర్‌ పోషించడం నా అదృష్టం. ఎందుకంటే..అతడికి నా పాత్రలో బాగా నటించగల సామర్థ్యం ఉంది’ అని పేర్కొన్నారు.