NRI-NRT

అమెరికాలో తెలుగు ప్రముఖులు…డా.గొర్రెపాటి నవనీతకృష్ణ-TNI ఆశృనివాళి

Veteran NRI Telugu Doctor Dr.Gorrepati Navaneeta Krishna Passes Away- అమెరికాలో తెలుగు ప్రముఖులు:డా.గొర్రెపాటి నవనీతకృష్ణ-TNI ఆశృనివాళి

ప్రవాసాంధ్ర ప్రముఖ వైద్యులు, తానా మాజీ అధ్యక్షులు డా.గొర్రెపాటి నవనీతకృష్ణ బుధవారం రాత్రి 11గంటలకు డల్లాస్‌లోని తన స్వగృహంలో మృతిచెందారు. ఆయన వయస్సు 70సంవత్సరాలు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన మృతికి TNI ఆశృనివాళి అర్పిస్తూ ఆయన జీవిత విశేషాలపై ఈ ప్రత్యేక కథనాన్ని మా పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.

ఎల్లవేళలా మోముపై చెరగని చిరునవ్వు! ఆత్మీయతా, అనురాగం ఉట్టిపడేలా పలకరింపులు. ఆపదలో ఉన్నవారికి స్నేహహస్తాన్ని అందించడం, నిరుపేదలను దానగుణంతో ఆదుకోవడం…..ఈ లక్షణాలన్నీ కలగలిపిన వ్యక్తి డా.గొర్రెపాటి నవనీతకృష్ణ. నేటి కాలంలో సంపన్నులు చాలామంది గతంలో తాము అనుభవించిన కష్టాలను, సామాన్య జీవనాన్ని గుర్తుపెట్టుకుని ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ మర్చిపోకుండా జన్మభూమి ఋణం తీర్చుకుంటున్నారు. అటువంటి వారిలో ప్రముఖులు డా.గొర్రెపాటి నవనీత కృష్ణ. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే స్వభావం ఆయనది. వృత్తి వైద్యమే అయినా ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. రాజకీయాలు అంటే మరీ ఇష్టం. కళలను, కళాకారులను ప్రోత్సహించడంలో ఆయనకు ఆయనే సాటి. అమెరికాలో ప్రముఖ కార్దియలజిస్ట్ గా వెలుగొందుచున్న”తానా” మాజీ అధ్యక్షుడు డా.గొర్రెపాటి నవనీతకృష్ణ జీవితం అందరికీ ఆదర్శం.

*బాల్యం-విద్యాభ్యాసం
కృష్ణా జిల్లా ఘంటసాలలో సామాన్య రైతు కుటుంబానికి చెందిన గొర్రెపాటి వెంకట్రాములు, ఉదయభాస్కరమ్మలకు 1949 జూన్ 3న డా.గొర్రెపాటి నవనీతకృష్ణ జన్మించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన బౌద్ధ క్షేత్రం ఘంటసాలలోనే ఆయన ప్రాథమిక విద్యను, హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. 1966లో విజయవాడలోని లయోలా కాలేజీలో పి.యు.సి విద్య పూర్తి చేశారు. రైతుగా కొనసాగాలా లేక తండ్రి కోరిక మేరకు డాక్టర్ కావాలా అనే విషయంపై ఆయన సందిగ్ధంలో పడ్డారు. పి.యు.సి అయిన మరుసటి సంవత్సరం ఆయన కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించారు. 1975లో వైద్య విద్య పూర్తి చేసిన అనంతరం దాదాపు రెండేళ్ల పాటు తనకు ఇష్టమైన వ్యవసాయం చూసుకుంటూ, మరో పక్క ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేవారు. దాన ధర్మాలలో పేరుగాంచిన తన తాతగారు అయిన కంటమనేని వెంకటరంగయ్యగారి బాటలో అడుగులు వేశారు.

*అమెరికా వైపు అడుగులు
నవనీతకృష్ణ సోదరుడు రంగనాథబాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అప్పటికే అమెరికాలో ఉండడంతో అమెరికా నుండి నవనీతకృష్ణకు పిలుపు వచ్చింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో తన సహాధ్యాయి డాక్టర్ జయశ్రీతో 1978లో వివాహం జరిగింది. ఆ తర్వాత దంపతులు ఇరువురూ అమెరికా వెళ్లారు. నవనీతకృష్ణ చికాగోలో రెసిడెన్సీ అనంతరం డెట్రాయిట్‌లో కార్డియాలజీని పూర్తి చేశారు. డాక్టర్ జయశ్రీ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో రెసిడెన్సీ పూర్తి చేసి ఎనస్తీషియా వైద్యురాలిగా స్థిరపడ్డారు. ఇరువురు గత 35 సంవత్సరాల నుండి డల్లాస్ నగరం సమీపంలో తమ తమ వృత్తుల్లో స్థిరపడ్డారు. ప్రముఖ వైద్యులుగా టెక్సాస్ రాష్ట్రంలో గుర్తింపు పొందారు.

*మంచి వైద్యుడిగా గుర్తింపు
డా.గొర్రెపాటి నవనీతకృష్ణ రికార్డు స్థాయిలో ఏడువేల యాన్జియోగ్రాములు నిర్వహించిన కార్డియోలాజిస్టుగా టెక్సాస్ ప్రభుత్వ అవార్డును స్వీకరించారు. వారికి ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు అజయ్ యం.బి .ఏ పూర్తి చేసి న్యూయార్క్ ఎడ్జ్ ఫండ్ అనే సంస్థను స్థాపించి వ్యాపారంలో స్థిరపడ్డారు. రెండవ కుమారుడు విజయ్ టెక్సాస్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేసి తల్లిదండ్రుల బాటలోనే వైద్యుడిగా కొనసాగుతున్నారు.

*తానాతో అనుబంధం
అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) అభివృద్ధికి డాక్టర్ నవనీతకృష్ణ తన సేవలను అందించారు. 2001లో తానా కోశాధికారిగా, అనంతరం ఉపాధ్యక్షుడిగా పదవులు నిర్వహించారు. 2003-05 సంవత్సరాలలో తానా అధ్యక్షుడిగా ప్రశంసనీయమైన సేవలను అందించారు. 2005జూలై నెలలో డాక్టర్ నవనీతకృష్ణ ఆధ్వర్యంలో డెట్రాయిట్ లో నిర్వహించిన తానా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వతహాగా ఎన్.టీ.ఆర్ అభిమాని అయిన నవనీతకృష్ణ, తెలుగుదేశం అభిమాని కూడా! డాక్టర్.నవనీతకృష్ణ అమెరికాలో ఆ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఎన్టీఅర్ ట్రస్ట్ కు దాదాపు పదిహేను లక్షల రూపాయలు విరాళంగా అందించారు. 2007వ సంవత్సరంలో చంద్రబాబు అమెరికా పర్యటన సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ కు ఆక్కడి ప్రవాసాంధృల నుండి కోట్లాది రూపాయలు విరాళంగా ఇప్పించారు. 2008వ సంవత్సరంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో సినీ రంగస్థల కళాకారులను ఘనంగా సత్కరించారు.

*ట్రస్ట్ ద్వారా సేవలు
తన జన్మభూమి ఋణం తీర్చుకోవటానికి తన తల్లిదండ్రుల పేరు మీద నవనీతకృష్ణ ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. తన సోదరుడు రంగనాథబాబుతో కలిసి ‘వీరా’ లేబరేటరిస్ ను నెలకొల్పారు. ఘంటసాల గ్రామంలో దాదాపు రెండు కోట్ల రూపాయల విరాళంతో చెక్ డ్యాంను నిర్మించారు. కళ్యాణ మండపాన్ని, పేదలకు పక్కాగృహాలను, చల్లపల్లిలో హైస్కూల్ ను ఏర్పాటు చేశారు. స్థానికంగా దేవాలయాల ఆధునీకరణకు భారీగా విరాళాలు ఇచ్చారు. గత పది సంవత్సరాల నుండి వ్యవసాయంపై ఉన్న ఆసక్తి కొద్ది ఘంటసాల గ్రామంలో ఎడ్ల పందేలను నిర్వహిస్తున్నారు. ప్రతి సంక్రాంతి పండుగకు ఆయన స్వగ్రామం ఘంటసాలలో నిర్వహిస్తున్న ఎడ్లపందేలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

*అమరావతిలో భారీ ఆసుపత్రికి ప్రణాళికలు
డాక్టర్ నవనీతకృష్ణ ఆంధ్ర రాష్ట్ర నూతన రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో 500 పడకల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిని డాలస్ ప్రాంత వైద్యులు, అమెరికా వ్యాప్తంగా విస్తరించి ఉన్న తన స్నేహితులతో కలిసి ఏర్పాటు చేయాలని ఆయన ప్రణాళికలు రూపొందించారు. ఇబ్రహీంపట్నం వద్ద తమకు స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఇటీవల డా.నవనీతకృష్ణ కలిసి విజ్ఞప్తి చేశారు. తాను సంపాదించిన దానిలో పెద్ద మొత్తంలో సేవా కార్యక్రామలకు వెచ్చిస్తున్న డాక్టర్.నవనీతకృష్ణ జీవితం అందరికి ఆదర్శప్రాయం. డా.గొర్రెపాటి నవనీతకృష్ణ సారథ్యంలో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద నిర్మిస్తున్న అమరావతి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AAIMS) భవన నిర్మాణానికి చంద్రబాబు విజయవాడ ఏ1 కన్వెన్షన్ సెంటరు నుండి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోట్లాది రూపాయిల ఖర్చుతో పేదప్రజల కోసం AAIMS నిర్మాణాన్ని చేపడుతున్నందుకు డా.గొర్రెపాటి నవనీతకృష్ణను ఆయన బృందాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు.—కిలారు ముద్దుకృష్ణ.