Politics

గన్నవరంలో యార్లగడ్డ VS వల్లభనేని

Gannavaram Politics Pick Heat With Vallabhaneni Vamsi's Entry To YSRCP

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడంతో కృష్ణా జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్థానిక వైకాపా నేతలు, ప్రభుత్వ ఉద్యోగుల వేధింపుల నుంచి తన అనుచరులను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని వంశీ చంద్రబాబుకు రాసిన లేఖలో పేర్కొనడం వైకాపా, తెదేపా మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరలేపినట్లయింది. మరోవైపు వల్లభనేని వంశీ వైకాపాలో చేరకుండా అడ్డుకునేందుకు ఆపార్టీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనకు అన్యాయం చేయరని వెంకట్రావు నమ్మకంతో ఉన్నారు. వంశీ వైకాపాలో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయం తెలుసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ జెండా మోసి, అక్రమ కేసుల్లో ఇరుక్కుని ఇప్పటికీ పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, పార్టీకి నిస్వార్థంగా సేవలు చేసేది కార్యకర్తలేనని యార్లగడ్డ అభిప్రాయపడుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల ముందు 12వేల నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టడంతో పాటూ ప్రసాదంపాడులో రిగ్గింగ్‌ చేసి 200 ఓట్లతో గెలుపొందారంటూ వంశీపై వెంకట్రావు ఇటీవల ఆరోపణలు చేశారు. వంశీ గతంలో తమ కార్యకర్తలపై అనేక కేసులు పెట్టారని, తెదేపా పాలనలో గన్నవరం ప్రజలు, వైకాపా శ్రేణులు అనేక ఇబ్బందులు పడ్డారని యార్లగడ్డ ఆరోపిస్తున్నారు. అక్రమ సంపాదన కోసం మళ్లీ మట్టిని దోచుకోవడానికే వస్తున్నారంటూ యార్లగడ్డ విమర్శించారు. ఈ నేపథ్యంలో వంశీ వైకాపాలో చేరినా యార్లగడ్డ వర్గంతో కలిసి పనిచేయగలరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక వైకాపా నేతలు, ప్రభుత్వ ఉద్యోగుల వేధింపుల కారణంగానే తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నాని లేఖలో పేర్కొనడం యార్లగడ్డతో కలిసి పనిచేయడం తనకు ఇష్టం లేదని వంశీ చెప్పకనే చెప్పినట్లయింది. వంశీ పార్టీ మారడానికి నకిలీ ఇళ్ల పట్టాల కేసే కారణమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఆదివారం గన్నవరంలోని వైకాపా కార్యాలయానికి యార్గగడ్డ వచ్చిన సందర్భంగా.. పార్టీలోకి వంశీ రాకను వ్యతిరేకిస్తూ వైకాపా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ.. వంశీ వైకాపాలో చేరుతారనే అంశంపై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. పార్టీ నేతలతో కలిసి సోమవారం ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తానని చెప్పారు. నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు, వైకాపా శ్రేణుల మనోగతాన్ని సీఎంకు వివరిస్తానని ప్రకటించారు. కలలో కూడా జగన్‌ తనకు అన్యాయం చేయరని యార్లగడ్డ ధీమా వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో గన్నవరం రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. ఏ క్షణం ఏ మలుపు తిరుగుతాయోనని నియోజకవర్గ ప్రజలతో పాటు రాజకీయ పరిశీలకులు ఆస్తకిగా గమనిస్తున్నారు.