Agriculture

మెదక్ యువ రైతాంగ దంపతులు అద్భుతాలు సాధిస్తున్నారు

Medak Young Couple Does Miracles With Natural Farming

ఆరోగ్యానికి, ఆదాయానికి ప్రకృతి వ్యవసాయమే మేలని యువ రైతు జిన్న రాజు, మాధవి దంపతుల కుటుంబం అనుభవపూర్వకంగా చెబుతోంది. గత ఐదేళ్లుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరి, కూరగాయలు, పప్పుధాన్యాలు సాగు చేసుకుంటూ రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తాము తింటూ, పరిసర గ్రామాల ప్రజలకు కూడా అందుబాటులోకి తేవడం విశేషం. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి చెందిన జిన్న బేతయ్య–లింగమ్మ దంపతుల సంతానం బాలయ్య, రాజు, కృష్ణ. రెండు బోరుబావులతో కూడిన ఐదు ఎకరాల సాగు భూమే వీరి జీవనాధారం.

అందరిలాగే రసాయనిక ఎరువులు, పురుగు మందులతో వీరి వ్యవసాయం కొనసాగింది. ఆ క్రమంలో ఎంసీఏ చదువుకున్న బాలయ్య సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ గ్రామభారతి ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని తన కుటుంబానికి పరిచయం చేశారు. పంట పొలాన్నే ప్రాణంగా నమ్ముకున్న భర్త రాజు, అతని భార్య మాధవి ప్రకృతి వ్యవసాయంపై పాలేకర్‌ పుస్తకం చదివి.. ఆ ప్రకారంగా ఐదేళ్ల క్రితం వరి, కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయనారంభించారు. టేక్మాల్‌ మండలం శేరిపల్లి గ్రామంలో విఠల్‌–బూదెమ్మ దంపతుల కుమార్తె అయిన మాధవి తొమ్మిదో తరగతి వరకు చదువుకుంది. రాజును పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పొలం పనుల్లో తన భర్తకు చేదోడు వాదోడుగా ఉంటోంది. రాజు, మాధవి సహా ఇంటిల్లపాదీ పొలానికి వెళ్లి పనులన్నీ చేసుకుంటారు.

ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం
మాచవరంలో ప్రకృతి వ్యవసాయదారుడు కోటపాటి మురహరి రావు, హైదరాబాద్‌లో విజయరామ్‌ ఆధ్వర్యంలో జరిగిన సభల్లో పాల్గొన్న రాజు ప్రకృతి వ్యవసాయంలో పాటించాల్సిన ముఖ్య సూత్రాలు, ఎరువులు, కషాయాలు తయారీ పద్ధతులపై అవగాహన పెంచుకున్నాడు. అతని భార్య మాధవి పాలేకర్‌ పుస్తకాన్ని చదివి ప్రకృతి వ్యవసాయ పరిజ్ఞానం పెంచుకున్నారు. దంపతులు శ్రద్ధగా ఆచరణలో పెట్టారు. ఘనజీవామృతం, జీవామృతం, కషాయాలను సొంతంగానే తయారు చేసుకొని వాడుతున్నారు.

రసాయనిక ఎరువులు, పురుగుమందులకు స్వస్తి చెప్పడంతో వరి సాగులో ఎకరానికి రూ. 4 వేల నుంచి 5 వేల వరకు ఖర్చు తగ్గిపోయిందని, ఐదెకరాలకు సరిపోను ఘనజీవామృతం, జీవామృతం తయారీకి రూ. రెండు వేల ఖరీదైన బెల్లం కొంటే సరిపోతున్నదని రాజు చెప్పాడు. వరిలో ఎకరానికి దుక్కిలో 200 కిలోలు, కలుపు తీసిన తర్వాత మరో 200 కిలోల చొప్పున ఘన జీవామృతం వాడుతున్నారు. ప్రతి 15 రోజులకోసారి ద్రవ జీవామృతం నీటితోపాటు క్రమం తప్పకుండా అందిస్తున్నారు. వరి దిగుబడి ఎకరానికి 30 బస్తాలు(20 క్వింటాళ్ల) వరకు వస్తున్నదని రాజు వివరించారు. వరితోపాటు ఇంట్లోకి అవసరమైన ఇతర పంటలన్నీ కొద్ది విస్తీర్ణంలో పండించుకుంటుండడం ఈ రైతు కుటుంబం ప్రత్యేకత. కూరగాయలు, ఆకుకూరలు, ఉల్లి, వెల్లుల్లి, పప్పులు.. తమ కుటుంబానికి సరిపడా ఏడాది పొడవునా సాగు చేసుకొని తింటుండడం విశేషం.

దేశీ వంగడం మైసూరు మల్లిగ
గతంలో సాధారణ వరి రకాలు సాగు చేసిన రాజు, మాధవి గత ఏడాది నుంచి దేశీ వంగడాలను సాగు చేస్తున్నారు. హైదరాబాద్‌ సేవ్‌ సంస్థ దేశీ విత్తనోత్సవంలో పాల్గొని తెచ్చుకున్న ఐదు రకాల దేశీ వరి వంగడాలను ఒక్కో ఎకరంలో గత ఏడాది సాగు చేశారు. అందులో దిగుబడి మెరుగ్గా ఉన్న సన్న రకం దేశీ వంగడం మైసూరు మల్లిగను ఈ ఏడాది మూడున్నర ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దూదేశ్వర్‌ అనే మరో దేశీ రకాన్ని అరెకరంలో సాగు చేస్తున్నారు. పండించిన ధాన్యాన్ని నిల్వ పెట్టుకొని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారికి బియ్యం క్వింటాలు రూ. 6,500 చొప్పున అమ్ముతూ మంచి ఆదాయం గడిస్తున్నామని, రసాయనాల్లేని ఆహారం తింటూ ఆరోగ్యంగా ఉన్నామని రాజు(99634 49223) అన్నారు.