Politics

త్వరలో అంటే ఎప్పుడు?

When will you hang nirbhaya rapists?

నిర్భయ సామూహిక అత్యాచార ఘటనలో దోషులకు విధించిన మరణశిక్షను త్వరలోనే అమలు చేయనున్నామని తిహాడ్‌ జైలు అధికారులు తెలియజేశారు. ఈ సమాచారాన్ని దోషులకు కూడా అక్టోబరు 28న తెలియజేశామని అధికారులు చెప్పారు. మరణశిక్షను సవాల్‌ చేసే హక్కు దోషులకు ఉన్నప్పటికీ, నలుగురిలో ఎవరూ దరఖాస్తు చేయలేదు. అంతేకాకుండా తమ శిక్ష తీవ్రతను తగ్గించి, మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చమని దేశ ప్రథమ పౌరుని క్షమాభిక్ష వేడుకొనే అవకాశాన్ని కూడా వారు వినియోగించుకోకపోవడం గమనించదగ్గ విషయం. ‘‘ఈ కేసుకు సంబంధించిన నలుగురు దోషులలో ముగ్గురు తిహాడ్‌ జైలులో ఉండగా, నాలుగో వ్యక్తి మండోలీ జైలులో ఉన్నారు. దిగువ కోర్టు విధించిన మరణ శిక్షలను దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా సమర్థించాయి.’’ అని తిహాడ్‌ జైలు డైరక్టర్‌ జనరల్‌ సందీప్‌ గోయల్‌ తెలిపారు. గడువు తేదీలోగా అపరాధులు క్షమాభిక్ష కోరడమో లేదా సవాలు చేయకపోతే అదే విషయాన్ని సంబంధిత న్యాయస్థానానికి తెలియజేస్తామన్నారు. అనంతరం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మరణశిక్ష అమలుచేస్తామని ఆయన వివరించారు.