Editorials

ఢిల్లీలో ఆరోగ్య అత్యవసర స్థితి

Health Emergency Declared In India's Capital Delhi

ఓవైపు పంట వ్యర్థాల దగ్ధం.. మరోవైపు బాణసంచాల మోత.. దీనికి తోడు వాహనాల పొగ.. వెరసి దేశ రాజధానిని కాలుష్య ఛాంబర్‌గా మార్చేశాయి. దిల్లీలో కాలుష్య స్థాయి నానాటికీ ప్రమాదకర స్థితికి చేరుతోంది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ‘ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి’ ప్రకటించింది. నవంబరు 5 వరకు నిర్మాణాలపై నిషేధం విధించింది. ఈ మేరకు దిల్లీ, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి(ఈపీసీఏ) ఛైర్మన్‌ భురేలాల్ లేఖ రాశారు. ‘దిల్లీ, ఎన్‌సీఆర్‌ ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. గత రాత్రి నుంచి అక్కడ కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. దీంతో ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. అందుకే ఈ ప్రాంతాల్లో ప్రజారోగ్య ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాం’ అని భురేలాల్‌ లేఖలో పేర్కొన్నారు.దిల్లీ, ఫరీదాబాద్‌, గురుగ్రామ్‌, ఘజియాబాద్‌, నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంతాల్లో నవంబరు 5 వరకు నిర్మాణ కార్యకలాపాలు, స్టోన్‌ క్రషర్లపై ఆంక్షలు విధించారు. అంతేగాక, ఈ శీతాకాలం మొత్తం బాణసంచా పేల్చడంపై నిషేధం విధించారు. దీంతో పాటు ఫరీదాబాద్‌, గురుగ్రామ్‌, ఘజియాబాద్‌, నోయిడా, బహదూర్‌గఢ్‌, భివాడి, గ్రేటర్‌ నోయిడా, సోనెపట్‌, పానిపట్‌ ప్రాంతాల్లో నవంబరు 5 వరకు బొగ్గు, ఇతర ఇంధన ఆధారిత పరిశ్రమలను మూసివేయాలని ఈపీసీఏ ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అధికారిక డేటా ప్రకారం.. దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం గాలి నాణ్యత సూచీ 582కు పడిపోయింది. సాధారణంగా గాలి నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే ‘బాగుంది’ అని, 51-100 మధ్య ఉంటే ‘సంతృప్తికరం’ అని, 101-200 మధ్య ఉండే ‘మధ్యస్తం’, 201-300 అయితే ‘బాగోలేదు’, 301-400 అయితే ‘ఏమాత్రం బాగోలేదు’, 401-500 మధ్య అయితే ‘ప్రమాదకరం’, 500పైన ఉంటే ‘ప్రమాదకరం-ప్లస్‌ ఎమర్జెన్సీ’గా పరిగణిస్తారు.