Politics

న్యూయార్క్‌కు గుడ్‌బై చెప్పిన ట్రంప్

Trump Tweets About His Permanent Address Change To Florida

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన అడ్రస్‌ను పర్మినెంట్‌గా మార్చనున్నారు. ప్రస్తుతం ఉంటున్న న్యూయర్‌ నగరం నుంచి ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌కు తన చిరునామాను మార్చుకోనున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్‌ తన ట్వీట్టర్‌ అకౌంట్‌ ద్వారా తెలిపారు. “నేను నా కుటుంబం ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌ను మా శాశ్వత నివాసంగా మార్చు‍కోబోతున్నాం.నేను న్యూయార్క్ ప్రజలను ఎంతో ఆదరిస్తాను. నేను ప్రతి సంవత్సరం నగరానికి పన్నుల రూపంలో మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నప్పటికీ, నన్ను రాజకీయ నాయకులు చాలా ఘోరంగా చూశారు. కొద్దిమంది చాలా దారుణంగా వ్యవహరించారు. నాకు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధగా ఉంది కానీ చివరికి ఇదే సరియైనది అనిపించడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఎప్పటికీ నా హృదయంలో న్యూయర్క్‌ నగరానికి ప్రత్యేక స్థానం ఉంటుంది” అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ట్రంప్ స్థానికంగా న్యూయార్క్‌ నగరానికి చెందినవాడైనప్పటికి ఆయన భార్య మెలానియాట్రంప్‌ తమ ప్రాథమిక నివాసాన్ని మాన్హాటన్ నుండి పామ్ బీచ్‌కు మారుస్తూ సెప్టెంబరులో వ్యక్తిగత నివాస ప్రకటనలను దాఖలు చేశారు. ట్రంప్‌కు న్యూయర్‌ నగరంలో ఎప్పుడూ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ట్రంప్‌ నివాసమైన ట్రంప్‌ టవర్స్‌ వద్ద ప్రజలు నిరసనలు తెలుపుతూ ఉండే వారు.. దీంతో ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌ తన చిరునామా మార్చడానికి గల కారణాలను తెలియజేయడానికి వైట్‌హౌస్‌ వర్గాలు నిరాకరించాయి. అయితే ట్రంప్‌కు సన్నిహతంగా ఉండే వారి సమాచారం ప్రకారం పన్నులకు సంబంధించిన విషయంలో ట్రంప్‌ తన నివాసాన్ని మారుస్తున్నట్లుగా తెలుస్తోంది.