NRI-NRT

అమెరికాపైనే గాంధీజీ ప్రభావం ఎక్కువ

Mandali Buddhaprasad Says Gandhiji Influence Is Heavy On The US Than On India

భారత దేశంలో కంటే అమెరికాపై మహాత్మా గాంధీజీ ప్రభావం ఎక్కువగా ఉందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ చెప్పారు. ఇటీవల అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోలో జరిగిన మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాల్లో పాల్గొని ప్రత్యేక గుర్తింపు పొందిన సందర్భంగా స్థానిక తెదేపా నాయకులు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన శుక్రవారం మాట్లాడారు. గాంధీజీ సత్యాగ్రహాల ద్వారా సాధించిన స్వాతంత్య్రం పలు దేశాల వారిని ఆకర్షించాయని చెప్పారు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ కూడా అమెరికాలో తెల్ల, నల్ల జాతీయుల మధ్య జరిగిన ఉద్యమంలో గాంధీజీ భారత దేశంలో అనుసరించిన పద్ధతులను ఆయన అక్కడ అనుసరించారని వివరించారు. అందుకే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తను అధ్యక్షుడు కావడానికి లూథర్‌ కింగ్‌, గాంధీజీ సిద్ధాంతాలే కారణమని చెప్పే వారని గుర్తుచేశారు. మూడు రోజులపాటు శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని కింగ్‌ సెంటర్‌లో జరిగిన కార్యక్రమాల్లో గాంధీజీ మనుమరాలు ఇలా గాంధీ, రాజమోహన్‌గాంధీ వారసులుగా పాల్గొన్నారని చెప్పారు. నియోజకవర్గంలో జరుగుతున్న స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాల గురించి వివరించగా వారు చాలా ఆసక్తిగా విన్నారని చెప్పారు. అనంతరం పలువురు నాయకులు గజమాలలు, దుశ్శాలువాలతో బుద్ధప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. డాక్టర్‌ డీఆర్కే.ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో మాజీ ఎంపీపీలు కనకదుర్గ, భీమయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యులు కె.వెంకటేశ్వరరావు, పి.కృష్ణకుమారి, వరలక్ష్మి, ఇతర నాయకులు చౌదరిబాబు, బాలవర్ధిరావు, ముద్దినేని చంద్రరావు, మత్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.