Editorials

జగన్ తన పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారా?TNI ప్రత్యేకం

జగన్ తన పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారా?TNI ప్రత్యేకం-TNILIVE Editorial Specials-AP Chief Secretary LV Subrahmanyam Transfer-Is Jagan Digging His Own Hole-TNILIVE Editorials

రాజకీయంలో దూకుడు ప్రదర్శించవచ్చు గాని పరిపాలనలో దూకుడు ప్రదర్శిస్తే అధికారంలో ఉన్నవారు తమ గోతిని తామే తవ్వుకున్నట్లు అవుతుంది. ఏవిధమైన పరిపాలనా అనుభవంలేని, కనీసం మంత్రిగా కూడా పనిచెయ్యని వైఎస్ జగన్, రాజశేఖరరెడ్డి తనయుడిగా ప్రజల్లో అభిమానాన్ని సంపాదించి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. చరిత్రలో ఎవ్వరికీ లభించని విధంగా ఆయనకు రాష్ట్ర ప్రజలు అధికారాన్ని అప్పగించారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ తన అధికారాన్ని చివరి వరకు నిలుపుకుంటారా? అనే సందేహం రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది. జగన్ కంటే రాజశేఖరరెడ్డి రాజకీయాల్లో దూకుడు ప్రదర్శించి మహానేతగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయన తన కింద పనిచేసే అధికారులను చాలా గౌరవంగా చూసేవారు. చాలా సందర్భాల్లో వారి సలహాలు కూడా స్వీకరించి ఆచరణలో పెట్టేవారు. ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నతాధికారులను ఆయన గౌరవంగా చూసేవారు.

* చరిత్రకు విరుద్ధంగా నడుస్తున్న జగన్
ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేసిన సంఘటనలు లేవు. జగన్ మాత్రం మచ్చలేని ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యంను బదిలీ చేసి తన పరిపాలనకే మచ్చ తెచ్చుకున్నారు. రాజశేఖరరెడ్డికి, జగన్మోహనరెడ్డికి ఎల్వీ.సుబ్రహ్మణ్యం నమ్మినబంటులా పనిచేశారు. రాజశేఖరరెడ్డి సైతం సుబ్రహ్మణ్యం మాటకు విలువ ఇచ్చేవారు. గత ఎన్నికల సమయంలోనూ, అనంతరం ఫలితాలు వెలువడే వరకు ఎల్వీ.సుబ్రహ్మణ్యంను అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు టార్గెట్ చేశారు. జగన్‌కు నమ్మినబంటు, కోవర్టు అంటూ ఎల్వీపై బాబు నిప్పులు చెరిగారు. జగన్ ముఖ్యమంత్రి అయిన అనంతరం పరిపాలనను గాడిలో పెట్టడంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం చాలా కసరత్తు చేశారు. జగన్‌కు వెన్నంటే ఉంటూ ఆయనకు పరిపాలనలో మెళకువలు నేర్పారు. ఎప్పుడూ వివాదాల చుట్టూ తిరిగిన ప్రవీణ్ ప్రకాష్ లాంటి దుందుడుకు అధికారులు జగన్ చుట్టూ మూగారు. చివరకు వారి చేతుల్లోనే జగన్ బందీ అయినట్లు కనిపిస్తోంది.  నేడు జగన్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని హింసించారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

జగన్ తీసుకున్న ఈ నిరంకుశ చర్యను రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైకాపా శ్రేణుల నుండి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఐఏఎస్ తదితర ఉన్నతాధికారుల సైతం ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిన్న జగన్ క్యాబినెట్‌లో కీలకంగా ఉండే రెవెన్యు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏకంగా తమ ప్రభుత్వంలో ఉండే రెవెన్యు, పోలీస్ అధికారుల అవినీతిపై సాక్ష్యాధారలతో బహిరంగంగా ప్రకటన చేశారు. జగన్ ఎవరి సలహాలు వింటున్నారో క్యాబినెట్‌లో ఉంటున్న మంత్రులకే అంతుచిక్కడం లేదని వార్తలు వెలువడుతున్నాయి. తనకు పూర్తి మెజార్టీ ఉందని తనకు తిరుగులేదని జగన్ భావిస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. జర్నలిస్టులకు సంబంధించి…వ్యతిరేక వార్తలు రాస్తే జైలులో పెడతాం అంటూ జగన్ సర్కారు ఇచ్చిన జీవో జాతీయస్థాయిలో తీవ్ర విమర్శలకు గురవుతోంది. అధికారంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండకపోతే ఏమి జరుగుతుందో ఎన్టీఆర్ పదవిని కోల్పోయిన సందర్భాలను జగన్ గుర్తుచేసుకోవాలని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓకసారి నాదెండ్ల భాస్కరరావు, మరొకసారి చంద్రబాబు ఎన్టీఆర్ నుండి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ప్రస్తుత పరిస్తితులు చూస్తుంటే జగన్ పరిపాలన పతనం వైపు పయనిస్తుందా? అని ప్రజలు నిశితంగానే విమర్శలు చేస్తున్నారు. ఒక నిబద్ధత, నిజాయితీ కలిగిన ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి సీనియర్ అధికారిని ఈ విధంగా అవమానించడం నూటికి నూరుపాళ్లు వైకాపా సర్కారు చేసిన పెద్ద తప్పిదం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ తప్పిదాన్ని సరిదిద్దుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు-కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.