Food

వేరుశనగ ఉండలతో చలి పులి ఆటకట్టు

Telugu food news - Winter traditional Indian foods

చలి పులి వచ్చేసింది… ఉదయం, సాయంత్రం చలి వణికిస్తోంది కదా?! వేరుశనగలు, బెల్లంతో చేసే పప్పుచెక్కలు.. చిక్కీలు అనీ అంటారు.. వీటిని ఉండలుగానూ చేస్తారు. ఈ చలికి చెక్ పెట్టాలంటే వీటిని తినాలంటున్నారు పోషకాహార నిపుణులు. ఇవి తినడం వల్ల ఒంట్లో వేడి పుట్టడమే కాదు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. అసలే చలికాలం, ఆపైన వర్షాలు ఎఫెక్ట్ తోడయ్యితే… చలి గిలిగింతలు పెడుతుంది. ఇలాంటప్పుడే వేడి వేడిగా ఏమైనా తింటే బాగుండని అనిపిస్తుంది. అయితే వెంటనే వేడి వేడిగా పకోడీలో, భజ్జీలో లాగించేస్తుంటాం. అయితే ఇలా నూనెలో వేపినవి తింటే రుచి బాగానే ఉంటుంది. కానీ కొవ్వు పెరిగిపోతుంది. అందుకే వేరుశనగ, బెల్లంతో చేసే చిక్కీలు, ఉండలు ఎంచక్కా తినండి. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. ఒంట్లో వేడీ ఇట్టే పెరుగుతుంది. బెల్లం, వేరుశనగలు కలిపి, తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వేరుశనగలో ఫోలిక్ యాసిడ్, ప్రొటీన్లతో పాటు శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి. బెల్లంతో కలిపి వీటిని తినడం వల్ల రక్తహీనత దూరం అవుతుంది. వేరుశనగలు తరచుగా తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడటంతోపాటు గుండె ఆరోగ్యమూ మెరుగవుతుంది. ప్రతిఒక్కరూ రోజుకు 20 గ్రాముల బెల్లం తింటే శరీరానికి మేలు చేస్తుంది. బెల్లంలో ఇనుము, క్యాల్షియం తదితర పోషకాలు ఉంటాయి. చలికాలంలో బెల్లం, వేరుశనగ కలిపి తింటే బోలెడు ప్రయోజనాలుంటాయి. బెల్లం, వేరుశనగలను తినడం వల్ల మహిళల్లో నెలసరి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో రక్తప్రసరణా మెరుగవుతుంది. కానీ వీటిని మరీ ఎక్కువగా తినొద్దు. వేరుశనగ ఉండలు ఒంట్లోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి. దీంతో మీ ముఖం కొత్త మెరుపును సంతరించుకుంటుంది. వేరుశనగలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలు దూరమవుతాయి. బెల్లంలో ఉండే క్యాల్షియం, ఇతర ప్రొటీన్ల వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి. కాబట్టి ఎంచక్కా వేరుశనగ చిక్కీలను తినేయండి. ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. డాక్టర్ వద్దంటే మాత్రం వీటి జోలికి వెళ్లకండి. ఇంతకూ ఈ వేరుశనగ ఉండలు చేసుకోవడం ఎలాగో తెలీదా? చాలా సింపుల్.. అరకిలో వేరుశనగలు, అరకిలో బెల్లం తీసుకోండి. వేరుశనగ గింజలను వేయించి, పొట్టు తీసేయండి. తర్వాత స్టవ్ వెలిగించి దళసరిగా ఉండే గిన్నె పెట్టి.. అందులో బెల్లం.. కొద్ది మోతాదులో నీరు పోసి.. చిక్కగా తీగపాకం పట్టుకోండి. తర్వాత వీటిలో వేరుశనగ గింజలు కలిసేలా తిప్పాలి. ఓ ప్లేట్కి నెయ్యి రాసి.. ఈ మిశ్రమాన్ని అందులోకి తీసుకొని వేడిగా ఉన్నప్పుడే ఉండల్లా చుట్టుకోవాలి లేదా ముక్కల్లా కట్ చేసుకోవాలి. అంతే వేరుశనగ చిక్కీలు రెడీ!