Food

ఓ సారూ…ఇది చారు జోరు

Types Of Chaaru In Traditional Indian Style-Telugu Food Recipes

చారుకి చారని పేరెందుకంటే నవ్వుతారేంటో…నవ్వకండి, ఇది చిత్తగించండి…

చింతపండు
ఇంగువ
పోపు దినుసులు
ఉప్పు

ఈ నాలుగు(చార్) కీలక పదార్థాలు నీటిలో వేస్తే తయారౌతుందని దానిని చారన్నారో మరేమో….
చారు చాలా సులభంగా ఏ కష్టమూ లేకుండా తయారౌతుంది….

పప్పేస్తే పప్పు చారు

టమాటాలతో టమాటా చారు

మునగేస్తే మునగచారు

మిరియం వేస్తే మిరియాల చారూ

ఏక్ దో తీన్ చార్ అని నాలుగు నిమిషాలలో…….

ఇలా పాపం దేనిని తగిలిస్తే దానితో కలగలిసిపోయి తన రుచిని దానికిచ్చేసి దాని పసని తనలో కలిపేసుకుని వేడి వేడిగా తాగినవాడిలో కొత్త ఉత్తేజాన్ని నింపేస్తుంది.

పళ్ళు రాని పాపడి నుంచి పళ్ళూడిన తాత దాకా మరి మెచ్చేదే చారూ బువ్వ….

అన్న ప్రాసన తర్వాత రుచులు అలవాటయ్యేది చారుతోటే.
మారాం చేసే బుజ్జి గాడికి గోరుముద్దలు తినిపించేది చారుగుజ్జు తోనే…

మీకు ఉప్మా నచ్చదా…ఐతే ఓ రెండు చెంచాల చారు కలుపుకొండి…అమృతమే….

జొరమొస్తే లంఖణం తర్వాత తినిపించేది చారే…

ఇంట్లో శ్రీమతికి కోపం వచ్చిందంటే(వస్తేనూ) కంచంలో తగిలేవి చారునీళ్ళే…అంతే కాదండోయ్ ప్రేమగా పెడితే చారంత రుచికరమైన వంటకం మరోటి ఉంటుందా….నిజం ఒప్పుకోండి….

ఇంట్లో పెద్దాళ్ళకి జలుబు పట్టిందంటే…మరింక ఆ రోజు అందరికీ చారు భోజనమే…

ప్రియే….చారు శీలే … అన్నారు గుర్తుందండీ జయదేవులవారు…

చారు అంటే అందమైనది అద్భుతమైనది అని..* *అలాగే చారు బాగా కాచగలిగిన ఇల్లాలిని చారుశీల అనీ, చారు లేందే ముద్ద దిగని భర్తను చారుదత్తుడు అని అంటే తప్పా… చెప్పండి…

మరి చారు తాగే జయదేవులు అష్టపదులు చెప్పుంటారు లెండి మరి…ఒడిషా మరి తెలుగు దేశానికి దగ్గరే కదా….

మరి వేడి చారు తాగడానికి సమయం సందర్భం అవసరం లేదని నా అభిప్రాయం….

వేడి వేడి చారు పొగలు గ్రక్కుతూ ఇంగువ ఘాటుతో కరివేపాకు ఘుమఘుమలు ముక్కుకు తగుల్తూ ఉంటే దాని ముందు అన్ని పేరొందిన ద్రవపదార్థాలు దిగదుడుపే… మరి కొత్తిమీర త్రుంచివేసి, కాచిన చారైతే మరింత రుచి… అద్భుతః, అమోఘః……

కాఫీకి ముందు మన పూర్వీకులు చారే కాచుకు తాగేవారని నా గట్టి ప్రగాఢ నమ్మకం…

డికాషన్ చూడండి మరి చారు రంగు కాదూ…

మా అమ్మమ్మ పెట్టేది కుంపటి పై కాచిన సత్తుగిన్నెలో చారు….ఆ పోపుకొచ్చిన ఘాటు నాకు ఇప్పటికీ జ్ఞాపకం….ఆ రుచి….ఇప్పటికి మళ్ళీ చూడలేదు….

మరి చారు రుచి ప్రాంతాన్ని బట్టి మారుతుంది…. గుంటూరు ఘాటు మిర్చితో పెట్టిన చారుదొక తీరు… ఉత్తరాంధ్రలో బెల్లంతో పెట్టిన చారే వేరు….
ఇలా చెప్పుకుంటూ పోతే..

అహో ఏమి చెప్పను చారు…
వేడి వేడిగా గొంతులో జారు.. చెవులనుండి వచ్చు హోరు..
జలుబు దగ్గులు ఓ గుటకతో తీరు……

ఇంకే ద్రవమేనా చారుముందు బేజారు

చార్ మినిట్ మే బనే చారు
ఆ ఘాటుకు మాత్రం నా జోహారు

మాతృహీన శిశుజీవనం వృధా, కాంతహీన నవయవ్వనం వృధా,
శాన్తిహీనతపసః ఫలం వృధా, తింత్రిణీరస విహీన భోజనం వృథా, వృథా!!

తల్లిలేని పిల్లవాని బ్రతుకు, భార్యలేనివాని యవ్వనం, శాంతం లేని ఋషి తపస్సు ఇవన్నీ ‘చారు’ లేని భోజనంలా నిష్ఫలం అని పై శ్లోకానికి అర్ధం.