DailyDose

నేటి పది ప్రధాన వార్తలు-11/05

Telugu Top News Roundup Of The Day-Nov 05 2019

1. ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న ఇసుక కొరతపై తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఒక రోజు దీక్ష చేయనున్నారు. ఈ నెల 14న విజయవాడలో చంద్రబాబు దీక్ష చేయనున్నట్లు పార్టీ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు దీక్ష కొనసాగనుంది. గత కొన్ని రోజులుగా ఏపీలో ఇసుక కొరతపై నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
2. అఖిలపక్షం నేతలతో ఆర్టీసీ ఐకాస సమావేశం
అఖిలపక్షం నేతలతో ఆర్టీసీ ఐకాస సమావేశమైంది. విద్యానగర్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి తెజస అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌, భాజపా నేత మోహన్‌రెడ్డి, ప్రజా, కార్మిక సంఘాల నేతలు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికులు తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగుస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. భవిష్యత్‌ కార్యాచరణపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఈ సమావేశంలో చర్చించనున్నారు.
3. పురస్కారాల పేరు మార్పుపై జగన్‌ ఆగ్రహం
పదోతరగతి ప్రతిభావంతులకు ఏటా ఇచ్చే అబ్దుల్‌ కలాం పురస్కారాల పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అబ్దుల్‌ కలాం పేరిట ఉన్న పురస్కారాన్ని వైఎస్ఆర్‌ పేరిట అందించనున్నట్లు నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై సామాజిక మాధ్యమాల్లో విస్త్రృత చర్చ జరిగింది. దేశానికి ఎంతో సేవ చేసిన అబ్దుల్‌కలాం పేరు మార్చడం ఆయన్ను అవమానించడమేనని తెదేపా అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ తీవ్రంగా స్పందించారు
4. విజయారెడ్డి డ్రైవర్‌ గురునాథ్‌ మృతి
నగర శివారులో దుండగుడి చేతిలో దారుణ హత్యకు గురైన అబ్దుల్లాపూర్‌ మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డి కారు డ్రైవర్‌ గురునాథ్‌ ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం మంటల్లో చిక్కుకున్న ఆమెను రక్షించే ప్రయత్నంలో దాదాపు 80 శాతం కాలిపోయిన ఆయన్ను అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామానికి చెందిన కామళ్ల గురునాథం తొలుత హైదరాబాద్‌లో లారీ డ్రైవరుగా కొంతకాలం పనిచేశారు.
5. ‘మహారాష్ట్ర రాజకీయం మారిపోనుంది
’మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతున్న వేళ శివసేన ప్రముఖ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి ముఖ్యమంత్రి తప్పకుండా శివసేన నుంచే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. దీంతో మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుందని జోస్యం చెప్పారు. ‘‘ముఖ్యమంత్రి శివసేన నుంచే ఉంటారు. మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. త్వరలో ప్రజలంతా చూడబోతున్నారు’’ అని సంజయ్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.
6. ‘అయోధ్య తీర్పుపై పార్టీ వైఖరినే అనుసరించాలి
’అయోధ్యలో ‘రామజన్మభూమి-బాబ్రీమసీదు’ భూవివాదంపై సుప్రీంకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యొద్దని కాంగ్రెస్‌ శ్రేణులను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆదేశించారు. తీర్పుపై పార్టీ వైఖరికి అనుగుణంగా నడుచుకోవాలని యూపీ కాంగ్రెస్‌ వర్గాలకు సూచించారు. పార్టీ వైఖరి ప్రకటించే వరకూ ఎలాంటి బహిరంగ ప్రకటనలు చెయ్యొద్దన్నారు. ప్రతి ఒక్కరూ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉండాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
7. శశికళ ఆస్తులు జప్తు..!
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ చుట్టూ మరో ఉచ్చు బిగుస్తోంది. శశికళకు చెందిన రూ.1600కోట్ల విలువచేసే ఆస్తులను ఆదాయపు పన్ను శాఖ సోమవారం జప్తు చేసింది. బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద వీటిని అటాచ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆమె ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో చెన్నై, కోయంబత్తూరు, పుదుచ్చేరిలో మొత్తం తొమ్మిది ఆస్తుల్ని జప్తు చేశారు. ఈ విషయాన్ని శశికళకు కూడా తెలియజేసినట్లు సమాచారం.
8. మూడు రాష్ట్రాలకు ఉగ్రముప్పు
జమ్మూకశ్మీర్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ రాష్ట్రాలకు కేంద్ర నిఘా సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. నేపాల్‌ లేదా బంగ్లాదేశ్‌ నుంచి ఉగ్రమూకలు చొరబడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మూడు రాష్ట్రాల్లో తీవ్ర స్థాయిలో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికరణ 370 రద్దుపై నిరసనతో పాటు అయోధ్య తీర్పునకు ముందు దేశ రాజధానిలో ఏదో ఒక అలజడి సృష్టించాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది.
9. సుముద్రమట్టాల పెరుగుదలతో భారత్‌కు ముప్పు
మావనవాళి మనుగడకు వాతావరణ మార్పులు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సుముద్ర మట్టాలు పెరగడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. దీనివల్ల జపాన్‌, చైనా, బంగ్లాదేశ్‌ సహా భారత్‌కు తీవ్ర ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. అంచనా వేసిన దానికంటే వేగంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయన్న ఇటీవలి ఓ అధ్యయనాన్ని ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు.
10. నేతల ప్రోద్బలంతోనే తహసీల్దార్ హత్య: రేవంత్‌మేజిస్ట్రేట్ అధికారాలున్న ఓ అధికారిణిపై దాడి చేయడం దారుణమని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే రోజులు వచ్చాయని ఆయన ఆరోపించారు. దుండగుడి దాడిలో సజీవ దహనమైన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి భౌతికకాయానికి కొత్తపేటలో ఆయన నివాళులర్పించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల ప్రోద్బలం వల్లే విజయారెడ్డిపై దాడి జరిగిందని ఆరోపించారు. రెవెన్యూ అధికారులను ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.